దర్జాగా కుంటల కబ్జా

ABN , First Publish Date - 2022-05-22T05:11:13+05:30 IST

ప్రభుత్వ స్థలాలు, కుంటలను రియల్‌ వ్యాపారులు దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఈ కబ్జాలపై రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా అడపాదడపా స్పందించి సర్వేల పేరుతో కాలయాపన తప్ప ఆక్రమణలను నిరోధించడం లేదు.

దర్జాగా కుంటల కబ్జా
జిన్నారంలో కబ్జాలతో కుచించుకుపోయిన పోసానికుంట

 బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలు

 జిన్నారం మండల పరిధిలో రెచ్చిపోతున్న ‘రియల్‌’ వ్యాపారులు

 సర్వేలతోనే సరిపెడుతున్న రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులు


జిన్నారం, మే 21 : ప్రభుత్వ స్థలాలు, కుంటలను రియల్‌ వ్యాపారులు దర్జాగా ఆక్రమిస్తున్నారు. ఈ కబ్జాలపై రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా అడపాదడపా స్పందించి సర్వేల పేరుతో కాలయాపన తప్ప ఆక్రమణలను నిరోధించడం లేదు. 


పోసానికుంట చుట్టూ వెంచర్లు


జిన్నారం మండలంలో ఇటీవల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ ఎకరం రూ.కోటి నుంచి రూ.5కోట్ల వరకు పలుకుతుంది. రియల్‌ వ్యాపారులు కొన్నిచోట్ల తాము కొనుగోలు చేసిన స్థలం పక్కనే ఉండే కుంటలను ఆక్రమిస్తున్నారు. జిన్నారంలోని పోసానికుంట వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 1025 సర్వేనంబర్‌లోని పోసానికుంట విస్తీర్ణం 2.30 ఎకరాలు కాగా ఇందులో నుంచే ప్రధానరహదారి ఏర్పాటు చేశారు. కుంట విస్తీర్ణం ప్రస్తుతం ఓ అర ఎకరాలోపే ఉంది. కుంట చుట్టూ ఇటీవల కమర్షియల్‌ నిర్మాణాలు, వెంచర్లను ఏర్పాటు చేశారు. స్థానిక మత్స్యకారులు కుంట ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లలో ఆక్రమణలు జరిగాయని రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులకు ఫిర్యాదుచేశారు. సర్వే జరిపిన ఆయాశాఖల అధికారులు కుంట బఫర్‌లో కొంత స్థలం ఆక్రమణలో ఉందని ప్రాథమిక నిర్థారణ చేశారు. పూర్తిస్థాయిలో సర్వే నిర్వహిస్తామని చెప్పి ఇంత వరకు చేయలేదు. మండలంలోని రాయునిచెరువు ఎఫ్‌టీఎల్‌లో ఓ పరిశ్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేసినా చర్యలు శూన్యం. గడ్డపోతారం పంచాయతీ పరిధిలో ఇటీవల కబ్జాల జోరు కొనసాగుతుంది. ఇక్కడ అయ్యమ్మచెరువు బఫర్‌, ఎఫ్‌టీఎల్‌లో కొందరు ఆక్రమణలు జరిపి నిర్మాణాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ పంచాయతీ పరిధిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఓ వెంచర్‌లో 10 గుంటల అసైన్డ్‌ భూమిని ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓ పరిశ్రమ ఎలాంటి అనుమతులు లేకుండా తమ పరిధి నుంచి అల్లీనగర్‌కుంటలోకి పైపులైన్‌ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారగా స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాజీపల్లి పరిధిలోని విశాఖవాణికుంట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో మట్టితో చదును చేసే ప్రయత్నం చేయగా స్థానికుల ఫిర్యాదుతో ఇరిగేషన్‌ శాఖ అధికారులు కబ్జాను తొలగించారు. ఇక్కడే జిల్లెలవాగు కింది భాగంలో వెంచర్‌ కోసం కాలువను మట్టితో పూడ్చే ప్రయత్నాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని రేళ్లకుంట మేడ్చల్‌ జిల్లా పరిధి పక్కనే ఉండటంతో కుంట ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ ప్రాంతంలో భారీ నిర్మాణలు వెలిశాయి. ఇక్కడే కిష్టంకుంట, మాధవానికుంటలో నిర్మాణాలు నిత్యకృత్యంలా మారాయి. ఊట్ల పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ నక్షాల్లో ఉన్న కాలినడక దారిని మార్చి రియల్‌ వ్యాపారులు కబ్జాలు చేశారు. స్థానిక కుంట బఫర్‌లో నిర్మాణలు చేశారనే ఫిర్యాదులు అందినా అధికారులు స్పందించ లేదనే ఆరోపణలున్నాయి. 


Updated Date - 2022-05-22T05:11:13+05:30 IST