ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా

ABN , First Publish Date - 2022-06-30T03:47:43+05:30 IST

అవి ప్రభుత్వ భూములని తెలుసు.. అమ్మడం, కొనడం నేరమని తెలుసు.. అయినా ఇక్కడ అక్రమార్కులు అధికారుల అండదండలతో నిర్భయంగా ప్రభుత్వ భూముల క్రయ, విక్రయాలు సాగిస్తున్నారు. ఉన్నతాధికారుల కళ్లకూ గంతలుకట్టి దిగువస్థాయి రెవెన్యూ సిబ్బంది, దళారులతో కలిసి పని కానిచ్చేస్తున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా

- ఆబాదీ భూముల అడ్రస్సు గల్లంతు

- కాజేసిన భూముల విస్తీర్ణం 2000 ఎకరాల పైమాటే..

- 95 శాతం అక్రమంగా చెరబట్టినవే

- సర్వే నంబర్‌ ఒకటి.. విక్రయాలు మరొక్కటి 

- ఇప్పటికే కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు...

- దళారులతో అధికారుల కుమ్ముక్కు

- ఉన్నతాధికారుల కళ్లకూ గంతలుకట్టి పని కానిచ్చేస్తున్న రెవెన్యూ సిబ్బంది

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌) 

అవి ప్రభుత్వ భూములని తెలుసు.. అమ్మడం, కొనడం నేరమని తెలుసు.. అయినా ఇక్కడ అక్రమార్కులు అధికారుల అండదండలతో నిర్భయంగా ప్రభుత్వ భూముల క్రయ, విక్రయాలు సాగిస్తున్నారు. ఉన్నతాధికారుల కళ్లకూ గంతలుకట్టి దిగువస్థాయి రెవెన్యూ సిబ్బంది, దళారులతో కలిసి పని కానిచ్చేస్తున్నారు. దీంతో కోట్లాది రుపాయల విలువైన ప్రభుత్వ భూములు వెంచర్ల రూపంలో ప్లాట్లుగా మారి కనుమరుగైపోతున్నాయి. రెవెన్యూ అధికారుల కుమ్మక్కు వ్యవహారం కారణంగా జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌, రెబ్బెన, వాంకిడి, కెరమెరి ప్రాంతాల్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి. ఒకప్పుడు జిల్లా కేంద్రంగా కొనసాగి తన ప్రభావాన్ని కోల్పోయిన ఆసిఫాబాద్‌ను తిరిగి జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణలో మరోసారి జిల్లా కేంద్రంగా మార్చడంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పాత దస్తావేజుల దుమ్ము దులుపుతున్న భూ బకాసురులు అవినీతి సొమ్ములను తినమరిగిన రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డులను తారుమారు చేసే పనిలో బిజీ అయి పోయారు. ఆసిఫాబాద్‌ పట్టణంతో పాటు శివారులోని జన్కాపూర్‌, అంకుశాపూర్‌, సందీప్‌నగర్‌, ఎల్లారం, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ, గొడవెల్లి తదితర ప్రాంతాల్లోని భూములకు బేరం పెట్టారు. వాప్తవానికి ఈ ప్రాంతంలో ఉన్నవన్నీ కూడా ఒకప్పుడు ప్రభుత్వ భూములే. గతంలో జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు వీటి రికార్డులు సజావుగానే ఉన్నప్పటికీ 1941లో జిల్లా రద్దయిన తరువాత ఆ రికార్డులన్నీ కూడా అప్పట్లో స్థానిక గ్రామ పంచాయతీలకు అప్పగించారని నాటితరం గ్రామ రెవెన్యూ అధికారులుగా పనిచేసిన పలువురు పట్వారీలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ రికార్డుల్లో చాలా మట్టుకు గల్లంతై పోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ భూములకు సంబంధించి బిలాదాఖల పోరంబోకు, ఖరజ్‌ఖాత, టెనాన్సీ, ఇనామ్‌ వంటి పట్టాలతో పాటు గ్రామపంచాయతీలకు చెందిన ఆబాదీ స్థలాలన్నీ కూడా కనుమరుగైపోయాయి. వీటికి సంబంధించి కొంతకాలంగా ఎవరికి వారు స్వాధీనంలో ఉంచుకున్న వ్యక్తులు ప్లాట్లుగా విభజించి ఇతరులకు విక్రయించడమో లేదా దొడ్డిదారిన ఓఆర్‌సీ పొంది ఇతరులకు విక్రయంచడమో చేస్తున్నారు. 

లోపభూయిష్టంగా రికార్డుల నిర్వహణ..

ఆసిఫాబాద్‌ పట్టణానికి సంబంధించి దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనక రెవెన్యూ, పంచాయతీ రాజ్‌శాఖల మధ్య సమన్వయలోపం, సిబ్బంది అవినీతి ప్రధానపాత్ర పోషి స్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబాది భూముల రికార్డులను భద్రపర్చా ల్సిన గ్రామ పంచాయతీ ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం ఒక కారణమైతే సంబంధిత భూముల వివరాలు రెవెన్యూ అధికారుల వద్ద కూడా లేక పోవడం అనేక అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంలో రికార్డులు మాయం కావడం వెనక ఖచ్చితంగా ఇంటి దొంగల హస్తం ఉంటుందని జిల్లా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో గతంలో పనిచేసి పదవీ విరమణ చేసిన తహసీల్దార్లు ఈతతంగంలో రికార్డులను తారుమారు చేసి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ ఓ అధికారి పాత తేదీలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జారీచేసిన నకిలీ పట్టా పుస్తకాలు తయారుచేసి ఇస్తున్నాడని, అక్రమార్కులు వాటి సహాయంతో ధరణిలో మార్పులు చేర్పులు పేరిట దరఖాస్తు చేసుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించాయి. 

కబ్జాకు గురైనట్లు భావిస్తున్న భూముల వివరాలు..

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి అయిదు కిలో మీటర్ల పరిధిలో సుమారు 849.68 ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనట్లు ఇదివరకే గుర్తించారు. ఇందులో సాలెగూడ పరిధిలో 15.36ఎకరాలు, అంకుశాపూర్‌లో 64.66ఎకరాలు, గోవిందాపూర్‌లో 94.75ఎకరాలు, కేస్లాపూర్‌లో 55.83, పిప్పల్‌గాంలో 132.8ఎకరాలు, మేకలవాడలో 21.85 ఎకరాలు, ఎల్లారంలో 105.04ఎకరాలు, ఆసిఫాబాద్‌లో 224.22 ఎకరాలు, గొడవెల్లిలో 277.51 ఎకరాల ప్రభుత్వ, 1/70 భూములు ఆక్రమణలో ఉన్నట్లు తేలింది. అయితే 1985లోనే పట్టణం నుంచి అయిదు కిలో మీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములను అసైన్డ్‌ చేయరాదన్న ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు వాటిని భేఖాతరు చేసి పెద్దఎత్తున లావుణి పట్టాలు ఇచ్చినట్లు అధికారుల విచారణలో బయటపడుతున్నాయి.

Updated Date - 2022-06-30T03:47:43+05:30 IST