HYD : ఆక్రమణల్లో ప్రభుత్వ స్థలాలు.. ఎడతెగని వివాదాలు..

ABN , First Publish Date - 2022-02-18T14:23:24+05:30 IST

మహానగరంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేసే కబ్జారాయుళ్లు చాలా మందే ఉన్నారు. ఇది తమదేనంటూ కొందరు ప్రభుత్వ స్థలాల్లో

HYD : ఆక్రమణల్లో ప్రభుత్వ స్థలాలు.. ఎడతెగని వివాదాలు..

  • రెవెన్యూ స్థలాలపై కోర్టుల్లో కేసులు 
  • ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని పరిస్థితి
  • కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగమున్నా.. 
  • కౌంటర్ల దాఖలు అంతంతే..

హైదరాబాద్‌ సిటీ : మహానగరంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేసే కబ్జారాయుళ్లు చాలా మందే ఉన్నారు. ఇది తమదేనంటూ కొందరు ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు పాతుతుండగా మరికొందరు ఏకంగా ఇళ్లు, కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారు. నిర్మాణ సమయంలో కొందరు అధికారులు పట్టించుకోకపోవడంతో వివాదాలు కోర్టు వరకూ వెళ్తున్నాయి. ఇలాంటి కేసులు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని తహసీల్దార్లు, అధికారులు రోజువారీ కార్యకలాపాలకంటే కోర్టు పనులకే అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. 


వివిధ కోర్టుల్లో 2,452 కేసులు..

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో రెవెన్యూ భూముల ఆక్రమణకు సంబంధించి ఆయా కోర్టుల్లో ప్రస్తుతం 2,452 కేసులు నడుస్తున్నాయి. వాస్తవంగా మొత్తం 16 మండలాల పరిధిలో 1,200 వరకు ల్యాండ్‌ బ్యాంకులున్నట్లు అధికారులు గుర్తించారు. అందు లో ప్రస్తుతం 90 నుంచి 100 ఎకరాలు ఉన్నాయి. అయితే మొత్తం స్థలాల్లో దాదాపు సగానికి పైగా కోర్టు కేసుల్లో ఉన్నట్లు తెలిసింది. సివిల్‌ కోర్టులకు సంబంధించి షేక్‌పేట్‌ మండలంలో 45, ఆసి్‌ఫనగర్‌లో 38, మారేడ్‌పల్లిలో 22, సైదాబాద్‌లో 22 కేసులు నడుస్తున్నాయి. అలాగే హైకోర్టు పరిధిలో మారేడ్‌పల్లి మండలంలో 498, షేక్‌పేట్‌లో 411, ఆసి్‌ఫనగర్‌లో 212 కేసులున్నాయి. కాగా, సుప్రీంకోర్టుకు సంబంధించి షేక్‌పేట్‌ మండలంలో 5, సైదాబాద్‌లో ఒకటి, అమీర్‌పేట్‌లో ఒకటి ఉండగా.. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ (యూఎల్‌సీ)కి సంబంధించి మూడు కేసులు నడుస్తున్నాయి.


ప్రభుత్వం తరఫున సకాలంలో పిటిషన్‌ దాఖలు చేయకపోవడం.. వివిధ కారణాలతో అధికారులు కోర్టుకు హాజరుకాకపోవడంతో ఈ సమస్య ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, పలు ప్రాంతాల్లో అక్రమార్కులకు కొందరు రెవెన్యూ అధికారులు పరోక్షంగా సహకరిస్తుండడంతోనే కోర్టు కేసులు త్వరితగతిన పూర్తికావడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులకు కోర్టులో బలం చేకూరే విధంగా వ్యవహరిస్తుండడంతో రెవెన్యూ స్థలాలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి.


కౌంటర్ల దాఖలులో ఆలస్యం..

ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు సంబంధించి రెవెన్యూ శాఖలో ప్రత్యేక న్యాయవిభాగం ఉంది. కలెక్టరేట్‌లో డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో నలుగురు అధికారులు పనిచేస్తున్నారు. పలు కేసుల్లో కౌంటర్ల దాఖలు చేయడంలో ఆలస్యం జరుగుతుండడంతో వివాదాలు ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు మారేడ్‌పల్లి మండలంలోని ఓ సర్వే నంబర్‌లో 119 ఎకరాల స్థలం ఉండగా.. ఈ భూమి తమదేనంటూ ఓ సంస్థ భారీ నిర్మాణాలు చేపట్టింది. దీంతో న్యాయ విభాగం అధికారులు ల్యాండ్‌ గ్రాబింగ్‌ కేస్‌ (ఎల్‌జీసీ) కింద 1997లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సమస్య కోర్టులో నడుస్తున్నప్పటికీ సదరు సంస్థ తమ కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-02-18T14:23:24+05:30 IST