ఆలయం నిర్మిస్తానని చెప్పి ఆక్రమణ

ABN , First Publish Date - 2021-09-19T04:56:27+05:30 IST

అధికార పార్టీ నేత కన్ను దళిత రైతు భూమిపై పడింది. ఆలయం కడతామని శిఖం భూమితో పాటు పక్కనే ఉన్న దళిత రైతు 10 గుంటల పట్టా భూమిలోనూ మట్టి పోసి ఆక్రమించాడు. ఇదేమీ అన్యాయమని ప్రశ్నించిన బాధిత మహిళా రైతును మట్టి కుప్పల కింద తొక్కి చంపేస్తా అంటూ బెదిరించాడు.

ఆలయం నిర్మిస్తానని చెప్పి ఆక్రమణ
రైతు పట్టా భూమిలో మట్టి పోసి చదును చేసిన దృశ్యం

దళిత మహిళకు చెందిన 10 గుంటలు కబ్జా

ఇదేమిటని ప్రశ్నించిన మహిళను చంపేస్తానని అధికార పార్టీ నాయకుడి బెదిరింపు

అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోని వైనం


తొగుట, సెప్టెంబరు 18 : అధికార పార్టీ నేత కన్ను దళిత రైతు భూమిపై పడింది. ఆలయం కడతామని శిఖం భూమితో పాటు పక్కనే ఉన్న దళిత రైతు 10 గుంటల పట్టా భూమిలోనూ మట్టి పోసి ఆక్రమించాడు. ఇదేమీ అన్యాయమని ప్రశ్నించిన బాధిత మహిళా రైతును మట్టి కుప్పల కింద తొక్కి చంపేస్తా అంటూ బెదిరించాడు. బాధిత మహిళ అధికారుల చుట్టూ తిరిగి తన గోడు వెళ్లబోసుకున్న పట్టించుకునే వారే కరువయ్యారు. న్యాయం జరుగకపోతే తనకు చావే శరణ్యమని రోదిస్తున్నది. వివరాల్లోకి వెళితే..  భాదితుల కథనం ప్రకారం... సిద్దిపేట జిల్లాలోని మండల కేంద్రమైన తొగుటకు చెందిన అనిమెల్లి లచ్చవ్వకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. భర్త, పెద్ద కొడుకు ఇద్దరు కొన్నేళ్ల క్రితం చనిపోయారు. చిన్నకొడుకు బతుకు దెరువు కోసం వలస వెళ్లాడు. పెద్ద కోడలు మంజులతో పాటు లచ్చవ్వ ఉంటుంది. ఆ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన 336/రు/2,336/ఇ సర్వే నెంబర్‌లో 1.16 గుంటల భూమి ఉంది. అందులో 5 గుంటల భూమిని కుటుంబ అవసరాల కోసం చాలా ఏళ్ల క్రితం వేరే వారికి విక్రయించారు. మిగతా  ఎకరా 11 గుంటల భూమిలో 6 గుంటల భూమిని తన కూతురు పేర రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చింది. మిగతా ఎకరా 5 గుంటల భూమిలో పత్తి పంట సాగుచేసుకొని జీవిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన ఒక నేత ఆ భూమిపై కన్నేసాడు. బతుకమ్మ కుంట కింది భాగంలో ఉన్న రైతు భూమి పక్కనే ఉన్న శిఖం భూమిలో రామమందిరం కట్టిస్తానని గ్రామస్థులకు చెప్పి ఆ భూమిలో మట్టి పోయడం ప్రారంభించాడు. శిఖం భూమితో పాటు పక్కనే ఉన్న దళిత రైతుకు చెందిన 10 గుంటల భూమిలోనూ మట్టిని పోయించాడు. రాత్రికిరాత్రి చదును చేయించాడు. అంతే కాకుండా ఆ భూమిలో బోరు బావి తవ్వించాడు. ఇదేమని దళిత రైతు ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరింపులకు పాల్పడ్డారు. అంతే కాకుండా ఎక్కువ చేస్తే చంపి ఈ మట్టిలోనే కప్పి జైలుకైనా పోతానంటూ ఇష్టారీతిగా మాట్లాడాడు. పట్టా భూమిలో మట్టి పోయడంతో వర్షం నీరు బయటకు రాక అందులో వేసిన పత్తి పంట మొత్తం నీట మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. తన భూమిని అక్రమంగా కబ్జా చేసిన నాయకునిపై చర్యలు తీసుకొని తన భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకుంటుంది. సదురు అధికార పార్టీ నేతతో తమకు కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతుంది. ఈ విషయంపై ఇదివరకే తన కోడలుతో కలిసి జిల్లా కలెక్టరేట్‌లో, తొగుట పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై మరోమారు శనివారం తొగుట తహసీల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ తిరుపతిరెడ్డికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్‌ తిరుపతిరెడ్డిని వివరణ కోరగా భూ కబ్జాపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Updated Date - 2021-09-19T04:56:27+05:30 IST