HYD : అమ్మో.. అక్టోబర్.. వణికిస్తున్న భారీ, అతిభారీ వర్షాలు.. గతేడాది, ఇప్పుడు కూడా..!

ABN , First Publish Date - 2021-10-11T15:29:16+05:30 IST

ఆకాశంలో మబ్బులు కమ్ము కుంటే చాలు.. ‘అమ్మో వాన మళ్లీ దంచికొట్టేట్టు ఉంది’...

HYD : అమ్మో.. అక్టోబర్.. వణికిస్తున్న భారీ, అతిభారీ వర్షాలు.. గతేడాది, ఇప్పుడు కూడా..!

హైదరాబాద్‌ సిటీ : ఆకాశంలో మబ్బులు కమ్ము కుంటే చాలు.. ‘అమ్మో వాన మళ్లీ దంచికొట్టేట్టు ఉంది’ అంటూ లోతట్టు ప్రాంతాల వాసులు హడలిపోతున్నారు. ప్రధానంగా అక్టోబర్‌లో కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాలతో బెంబేలెత్తుతున్నారు. రెండేళ్లుగా ఈ నెలలో గ్రేటర్‌లో అత్యంత గరిష్ఠంగా వర్షపాతం నమోదవుతోంది. భారీ వర్షాలకు కొందరు గుంతల్లో పడి గాయాలపాలవుతుండగా, మరి కొందరు ప్రమాదవశాత్తు నాలాలు, డ్రైనేజీల్లో గల్లంతవుతున్నారు.


రెండింతలు..

2020 అక్టోబర్‌లో క్యుములో నింబస్‌ మేఘాల కారణంగా జిల్లాలో సాధారణం కంటే రెండింతల అధిక వర్షపాతం నమోదైంది. గతేడాది అక్టోబర్‌ 9న నగర వ్యాప్తంగా 12.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అక్టోబర్‌ 13న ఒక్క హయత్‌నగర్‌లో అత్యధికంగా 22.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గ్రేటర్‌ వ్యాప్తంగా పరిశీలిస్తే 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ 8న హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని శివారు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి.


హయత్‌నగర్‌ను వీడని వరద..

శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలకు హయత్‌నగర్‌ నిండా మునిగింది. డివిజన్‌లోని బంజారాకాలనీ, రంగనాయకుల గుట్ట, అంబేడ్కర్‌నగర్‌, సుధీర్‌కుమార్‌నగర్‌ కాలనీలోని సుమారు 200 ఇళ్లు జలదిగ్భందంలోనే ఉన్నాయి. కింది పోర్షన్లలో ఉన్న వారు ఇళ్లు ఖాళీ  చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. కొంత మందిని జీహెచ్‌ఎంసీ బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. దాదాపు మూడు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.


జంట జలాశయాలకు తగ్గుతున్న వరద

జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గుతోంది. భారీగా వరద చేరడంతో శనివారం సాయంత్రం 8 గేట్లను ఎత్తగా, ఆదివారం సాయంత్రానికి ఐదు గేట్లను మూసేశారు. మూడు గేట్ల ద్వారా 2100 క్యూసెక్కుల నీటిని దిగువ వదులుతున్నారు. జంట జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయని, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఆధారంగానే గేట్లను ఎత్తడం, దించడం చేస్తున్నామని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు.


గుంతలో పడి రైల్వే ఉద్యోగి మృతి 

నీటితో నిండిన గుంతలో పడి రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. తుకారాంగేట్‌ పోలీసుల కథనం ప్రకారం... మల్కాజిగిరి ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన నవీన్‌ కుమార్‌ (38) లాలాగూడలో రైల్వే వాల్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం (ఈనెల 9న) సాయంత్రం విధులు ముగించుకొని లాలాగూడ రైల్వేస్టేషన్‌ పక్కన నుంచి కొండారెడ్డి పార్కు మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. రైల్వే స్టేషన్‌ వద్ద మూడేళ్లుగా డ్రైనేజీ పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా  కొండారెడ్డిపార్కు వద్ద 15 అడుగుల లోతులో గుంతలు తీసి నిర్లక్ష్యంగా వదిలిపెట్టారు. భారీ వర్షానికి ఆ గుంతలు నీటితో నిండిపోయాయి. నవీన్‌కుమార్‌ గమనించకుండా గుంతలో పడి చనిపోయాడు. ఆదివారం ఉదయం నీటి గుంతలో మృతదేహం తేలియాడుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తుకారాంగేట్‌ పోలీసులు మృతదేహన్ని గాంధీ మార్చురీకి తరలించారు.

Updated Date - 2021-10-11T15:29:16+05:30 IST