మూగ జీవాల కోసం ఒడిశా సీఎం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-05-10T01:09:18+05:30 IST

కరోనా వేళ జనం ఆసుపత్రులకు క్యూకడుతుంటే ఆహారం లేక అల్లాడిపోతున్న మూగ జీవాల కడుపు నింపేందుకు ఒడిశా ముఖ్యమంత్రి

మూగ జీవాల కోసం ఒడిశా సీఎం కీలక నిర్ణయం

భువనేశ్వర్: కరోనా వేళ జనం ఆసుపత్రులకు క్యూకడుతుంటే ఆహారం లేక అల్లాడిపోతున్న మూగ జీవాల కడుపు నింపేందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీధి కుక్కలు, పశువుల ఆహారం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 లక్షల రూపాయలు కేటాయించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మూగ జీవాల కడుపు నింపేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నారు. 


చాలా రాష్ట్రాల్లానే ఒడిశా కూడా కొవిడ్‌ వ్యాప్తిని అదుపు చేసేందుకు పలు ఆంక్షలు అమలు చేస్తోంది. 5 మెట్రోపాలిటిన్ కార్పొరేషన్లు, 48 మునిసిపాలిటీలు, 61 నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్స్ (ఎన్ఏసీ)లో ఈ అంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ కారణంగా వీధి కుక్కలు, పశువులు ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఒడిశా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది. 


వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ద్వారా మూగ జీవాలకు ఆహారాన్ని అందజేయనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 60 లక్షల్లో భువనేశ్వర్, కటక్, సంబల్‌పూర్, రౌర్కెలా, బ్రహ్మపూర్ మెట్రోపాలిటన్ కార్పొరేషన్లలో రోజుకు రూ. 20 వేలు ఖర్చు చేస్తారు. మునిసిపాలిటీల్లో రోజుకు రూ. 5 వేలు ఎన్ఏసీలలో రూ. 2 వేలు ఖర్చు చేయనున్నారు. 

Updated Date - 2021-05-10T01:09:18+05:30 IST