ధాన్యం దిగుమతులకు అధికారుల అడ్డు

ABN , First Publish Date - 2021-05-11T04:44:56+05:30 IST

ధాన్యం రైతుల పరిస్థితి దేవుడు ఇచ్చినా పూజారి అనుగ్రహించని చందంలా అత్యంత దయనీయంగా ఉందని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు విమర్శించారు.

ధాన్యం దిగుమతులకు అధికారుల అడ్డు
మిల్లు యజమానితో చర్చిస్తున్న రాంబాబు

 రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు

 దిగుమతికి మిల్లు యాజమాన్యం ఒప్పుకున్నా అడ్డుపడుతున్న జిల్లా అధికారులు

వైరా, మే 10: ధాన్యం రైతుల పరిస్థితి దేవుడు ఇచ్చినా పూజారి అనుగ్రహించని చందంలా అత్యంత దయనీయంగా ఉందని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు విమర్శించారు. వైరా మునిసిపాలిటీ పరిధిలోని లాలాపురం సమీపంలో ఉన్న ఎస్‌కేఆర్‌ రైస్‌మిల్లు యాజమాన్యం స్థానిక రైతుల ధాన్యాన్ని దిగుమతి చేసుకొనేందుకు హామీ ఇచ్చినప్పటికీ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. వైరా, కొణిజర్ల మండలాల రైతులతో కలిసి రాంబాబు సోమవారం ఆమిల్లు యాజమాన్యంతో చర్చించారు. అలాగే రైతులంతా వైరా వచ్చి ఎమ్మెల్యే రాములునాయక్‌ను కలిసి తమ ఇబ్బందులు ఏకరువు పెట్టుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే అందుబాటులో లేరు. దాంతో రాంబాబు ఫోన్‌ ద్వారా ఎమ్మెల్యేకు వివరించారు. అధికారులతో మాట్లాడి ధాన్యం దిగుమతులకు ఆదేశాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎస్‌కేఆర్‌ రైస్‌మిల్లుకు ఇప్పటికే 80వేల క్వింటాళ్ల ధాన్యాన్ని దిగుమతి చేయాల్సి ఉండగా 1.70లక్షల క్వింటాళ్లు దిగుమతి చేశామని ఇంకా అదనంగా ధాన్యం దిగుమతికి అనుమతించబోమని పౌరసరఫరాలశాఖ అధికారి అభ్యంతరం చెపుతున్న విషయాన్ని రాంబాబు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక రైతుల ధాన్యాన్ని తాము దిగుమతి చేసుకొనేందుకు మిల్లు యాజమాన్యం ముందుకొచ్చినా అధికారులు అందుకు నిరాకరించటాన్ని ఆయన ఖండించారు. మిల్లుల కేటాయింపు చేయకపోవడంతో రోజులతరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు గుట్టలుగా పడి ఉన్నాయని రైతులు పడిగాపులు కాస్తున్నారని అయినప్పటికీ అధికారులు మొండివైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ధాన్యం దిగుమతి చేసుకొనేందుకు మిల్లు యాజమాన్యం ముందుకొచ్చినా అధికారులు తిరస్కరించటాన్ని ఖండించారు. కొందరు అధికారులు రైస్‌మిల్లర్లు ఇచ్చే కమీషన్ల కోసం కక్కుర్తిపడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అలాంటి వారిపై కలెక్టర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ దందాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతుసంఘం నాయకులు చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి నర్సయ్య, పురుషోత్తం, అప్జల్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-11T04:44:56+05:30 IST