‘స్థలాలు చూపించకుండా అధికారుల నిర్లక్ష్యం’

ABN , First Publish Date - 2021-10-26T05:16:03+05:30 IST

మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో 2016లో 40 మందికి అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఇంటి పట్టాలు ఇచ్చారని, అయితే స్థలాలు చూపించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నాయకులు, లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

‘స్థలాలు చూపించకుండా అధికారుల నిర్లక్ష్యం’
టీడీపీ నాయకులు, లబ్ధిదారుల ఆందోళన

మద్దికెర, అక్టోబరు 25: మండలంలోని ఎం.అగ్రహారం గ్రామంలో 2016లో 40 మందికి అప్పటి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఇంటి పట్టాలు ఇచ్చారని, అయితే స్థలాలు చూపించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ నాయకులు, లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఆనంద్‌కుమార్‌, పెసలబండ శ్రీనివాసులు, మురళి ఆధ్వర్యంలో స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి సోమవారం లబ్ధిదారులు స్థలాల వద్దకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వీఆర్వో గోవిందప్ప వచ్చి తమకు 15 రోజుల సమయం ఇవ్వాలని, సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. దీంతో లబ్ధిదారులు వాగ్వాదానికి దిగారు. ఎన్నాళ్ల నుంచో తిరుగుతున్నామని, పలుమార్లు స్పందనలో అర్జీలు కూడా ఇచ్చామని తెలిపారు. ఇంతవరకు సమస్య కొలిక్కి తీసుకుని రాలేదని వాపోయారు. స్థలాలు లేక ఇళ్లు మంజూరైన కట్టుకోలేకపోతున్నామని తెలిపారు. వెంటనే స్థలాలను చూపించకపోతే తామే కొలతలు వేసుకుని తమ పట్టాలో ఉన్న రెండు సెంట్లు స్థలానికి కొలతలు వేసుకుని గుడిసెలు వేసుకుంటామని అన్నారు. దీంతో తహసీల్దార్‌ నాగభూషణం దృష్టికి తీసుకెళ్లగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామని, అంతవరకు ఆ స్థలాల్లో ఎటువంటి పనులు చేయవద్దని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. టీడీపీ నాయకులు హుసేన్‌పీరా, సుధాకర్‌, మెడికల్‌ శ్రీనివాసులు, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:16:03+05:30 IST