ఓ ఉన్మాదీ నువ్వు ఓడిపోయావు

ABN , First Publish Date - 2022-08-17T06:25:33+05:30 IST

ప్రసిద్ధ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో దాడికి పాల్పడిన హాదీ మతార్‌ను ఉద్దేశించి రచయిత, పాత్రికేయుడు అమితవ్ కుమార్ రాసిన బహిరంగ లేఖ...

ఓ ఉన్మాదీ నువ్వు  ఓడిపోయావు

హాదీ మతార్, 

నువ్వు యువకుడివి. పనీ పాటా లేకుండా ఒక గదిలో నీవొక్కడివే చాలా చాలా సంవత్సరాలు గడపవలసి ఉన్నది. ఈ లేఖ చదివేందుకు తగు సమయం చూసుకోగలవని ఆశిస్తున్నాను. నువ్వు 24 సంవత్సరాల పిన్న వయస్కుడవని కొద్ది రోజుల క్రితం ప్రపంచం తెలుసుకుంది. నువ్వు చంపడానికి ప్రయత్నించిన మనిషి వయసు 75 ఏళ్లు. నీ గురించి నాకు తెలియదు గానీ నేను 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ మనిషి రచనలను మహా దీక్షగా చదువుతుండేవాణ్ణి. సల్మాన్ రష్దీ పుస్తకాల పఠనంలో నా అంకిత భావం ఉన్మాదమని నువ్వు అంటావు కూడా.


నేను 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రష్దీని హతమార్చాలని ఆదేశిస్తూ అయతొల్లా ఖొమేనీ ఫత్వా జారీ చేశారు. ‘ద శాటానిక్ వెర్సెస్’ నవల రాసిందుకే ఆయనకు అయతొల్లా మరణ శిక్ష విధించారు. హత్యకు ప్రేరేపించిన ఆ ఫత్వా, మూడు దశాబ్దాల అనంతరం అత్యంత ఆటవికంగా నువ్వు పాల్పడిన భయంకర చర్యగా పర్యవసించింది. నువ్వు చంపడానికి ప్రయత్నించిన మనిషి, నీ దాడికి గురయినా సురక్షితంగా ఉన్నాడు. ఇప్పుడు నీకు భాగ్యరాశి ఏదీ లభించబోదని, శాశ్వత కారాగార వాసమే నీకు ప్రాప్తిస్తుందని అనుకుంటున్నాను.


నువ్వు హతమార్చడానికి ప్రయత్నించిన మాననీయుడు అయితే నిర్విచారంగా, తనపై హత్యాయత్నం నీకు అంత లాభదాయకం కాలేదని అనగలడు. ఈ లేఖను రాయడానికి కూర్చున్నప్పుడు కటువుగా రాయాలని నేను ఉద్దేశించలేదు. నేను నా ఇరవై నాలుగు ఏళ్ల అంతరాత్మతో నీతో సంభాషించాలని అనుకుంటున్నాను. నాలోని ఆ నిర్దిష్ట వ్యక్తి నువ్వు పుస్తకాలు చదవాలని కోరుకుంటున్నాడు. మత వేదికల నుంచి కఠోరంగా, ఉగ్రంగా మాట్లాడే, దైవ సందేశాన్ని తీసుకు వస్తున్నామని విశ్వసించే, ఎవరు బతకాలి, ఎవరు అంతమొందాలో నిర్ణయించే వృద్ధులను వినడానికి బదులు మరింత మానవతా పూరిత మాటలను శ్రద్ధగా వింటావా? లక్ష్య పెడతావా? నువ్వు అంతమొందించడానికి ప్రయత్నించిన మనిషి ఏమన్నాడో తొలుత ప్రస్తావిస్తాను. 


వేలంటైన్స్ డే శుభ దినాన ఆ భయంకర ఫత్వా జారీ అయిన తరువాత రచయిత రష్దీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసు రక్షణలో భద్రమైన గృహాలలో నివసించాడు. ఖొమేనీ జారీ చేసిన ఫత్వా తొలి వార్షికోత్సవాన ఆయన ఒక సాహిత్య పత్రికలో ఒక చిన్న కవితను ప్రచురించారు. ‘పాడండి, దాడులు జరుగుతున్నప్పటికీ, పాడండి/ నా స్వప్నాలు అంతమైపోతున్నప్పటికీ/ రెక్కలు విరిగిపోతున్న సీతాకోక చిలుకల కీర్తిని గానం చేసేందుకు’. ఆ కవితలో వర్ణితమైన పాశవికతను బహుశా గ్రహించే ఉంటావు. అయితే అందులోని సౌందర్యాన్ని చూశావా? చిత్రవధల సాధనాలపై విరిగిపోతున్న సీతాకోక చిలుకల భావనాత్మక బొమ్మ మనసుకు తగులుతుంది. ఆలోచనలను కదిలించే శక్తిమంతమైన ఊహాత్మక చిత్రమది. నువ్వు చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి ‘భావనాశక్తి తిరుగుబాటుకు’ ప్రాతినిధ్యం వహించే రచయిత అని సాహిత్య విమర్శకుడు ఎడ్వర్డ్ సయిద్ ఒకప్పుడు ఎందుకన్నాడో ఆ కవితా పఠనంతో నాకు అర్థమయింది.


ఖొమేనీ ఫత్వా జారీ చేసిన పదేళ్ల అనంతరం ‘ది న్యూయార్కర్’ పత్రికలో రాసిన ‘నన్ను ఆహ్లాదపరచని వేలంటైన్’ అన్న వ్యాసంలో, నువ్వు చంపడానికి ప్రయత్నించిన ఆ రచయిత తాను ప్రేమ గురించి మాత్రమే రాయబోతున్నానని పేర్కొన్నాడు. ‘ప్రేమ ఒక్కటే అంతకంతకూ నేను సంవేదిస్తున్న ఏకైక విషయం. నా జీవిత కేంద్రంలో, నా కొత్త సృజనాత్మక కృషిలో, నా భవిష్యత్ ప్రణాళికల్లో ప్రేమ మినహా నేను ఏమీ చూడడం లేదు’. ఈ మాటల ప్రాధాన్యమేమిటో ఊహించగలవా? ఒక రచయితగా అతని అస్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో అటువంటి మాటలకున్న మహత్వాన్ని అర్థం చేసుకోగలవా?


ఇంతకూ నువ్వు చదువుతావా? నిన్ను తక్కువ చేయడానికో, అవమానించడానికో నేనీ ప్రశ్న అడగడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం భారత్‌లో ఒక రచయిత్రిని ఒక వ్యక్తి చంపేశాడు. తాను కాల్చి చంపిన ఆమె రచనలను ఆ హంతకుడు చదవనే లేదట. ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. హత్యకు గురైన ఆ రచయిత్రి సాహసోపేత పాత్రికేయురాలు. వృత్తి ధర్మ నిర్వహణలో ఎటువంటి ప్రతికూలతలకూ భయపడని ధీర. ఆమె హంతకుడికి, ఆ కిరాతక కృత్యానికి నియుక్తం చేసినవారు పదివేల రూపాయలు ఇచ్చారు. ఆమె తమ మతాన్ని కించపరుస్తున్నదని మాత్రమే వారు ఆ కిరాయి హంతకుడికి చెప్పారు. అంతకు మించి మరేమీ చెప్పలేదు. ఆ రచయిత్రి పేరు గౌరీ లంకేశ్. ఆ హంతకుడి పేరు పరశురామ్ వాఘ్మారే. ఆ ఘోర కృత్యానికి పాల్పడినప్పుడు అతడి వయస్సు ఇప్పుడు నీ వయస్సు కంటే రెండేళ్లు ఎక్కువ. అతడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జీవితాలను అంతమొందించేందుకు మతాన్ని ఉపయోగించుకునే కరడుగట్టిన ఛాందసవాద శక్తులు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిపోతున్నాయి. ఆధునిక భౌమ రాజకీయాల వినాశనకర లక్షణమిది. ఇది సకల సమాజాలనూ కుదిపివేస్తోంది. 


నువ్వు చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి వలే నేనూ ఒక రచయితను. పుస్తక పఠనం, సాహిత్య సృజనలోనే జీవితాన్ని గడుపుతున్నాను. మనం విస్తృతంగా, లోతుగా చదివితే మనకు భిన్నమైన ప్రదేశాలు, ప్రజలు తటస్థిస్తారని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. పరిచితాలు, అపరిచితాల మధ్య తేడా, దాని ఆహ్లాదాలు, సవాళ్లు మనలను అసహనం నుంచి దూరంగా ఉంచుతాయి. జైల్లో పుస్తకాలు చదవడమనేది మాల్కమ్ ఎక్స్ సహా ఈ దేశం (అమెరికా)లోని అనేక మందిలో పరివర్తనను తీసుకువచ్చింది. పుస్తకాలు చదివి నీవూ అటువంటి పరివర్తనాత్మక విముక్తిని పొందగలవని ఆశిస్తున్నాను. నువ్వు చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి విషయమై ప్రపంచవ్యాప్తంగా అపార సానుభూతి వ్యక్తమయింది. ఆయనకు ప్రాణాపాయస్థితి ఏర్పడడం పట్ల అంతులేని విచారం వ్యక్తమయింది. అన్ని మతాలు, సమస్త దేశాలకు చెందిన వారు ఎంతో ఆందోళన పడ్డారు. నేను మరొక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ పేర్కొనదలిచాను. ఇప్పుడు ఎంతోమంది ఆయన నవలలు, కథలు, కవితలు, వ్యాసాల నుంచి చాలా వాక్యాలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఆయన రచనల ప్రభావం గురించి చర్చిస్తున్నారు. ఆ ఘోర హత్యాయత్నం జరిగిన నాటి నుంచీ నేను ఆయన నవలలు, వ్యాసాలు, ఇంటర్వ్యూలు మినహా మరేమీ చదవడం లేదు పన్నెండేళ్ల నా కొడుకు ఆయన నవల ‘ద శాటానిక్ వెర్సెస్’ చదువుతానంటున్నాడు. ఆ చిన్నవాడు కొంతకాలం వేచి ఉండాలని నేను భావిస్తున్నాను. నేనేమి విశదం చేయదలిచానో నీకు అర్థమయిందా? నువ్వు విఫలమయ్యావు. ఏ హింసాత్మక చర్య అయినా, ఇటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా విఫలమవుతుంది. అయితే, నువ్వు ఎవరినైతే చంపడానికి ప్రయత్నించావో ఆ రచయిత మాంత్రిక మాటల జగత్తుకు మమ్ములను మళ్లీ పంపించడంలో మాత్రం నువ్వు విజయవంతమయ్యావు. 

(ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యం)


ప్రసిద్ధ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్‌లో దాడికి పాల్పడిన హాదీ మతార్‌ను ఉద్దేశించి రచయిత, పాత్రికేయుడు అమితవ్ కుమార్ రాసిన బహిరంగ లేఖ స్వేచ్ఛానువాదం

Updated Date - 2022-08-17T06:25:33+05:30 IST