బ్యాడ్‌ బ్యాంక్‌కు ఓకే

ABN , First Publish Date - 2021-01-17T06:48:03+05:30 IST

బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రతిపాదన వస్తే తప్పనిసరిగా పరిశీలిస్తామని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అయితే,

బ్యాడ్‌ బ్యాంక్‌కు ఓకే

ప్రతిపాదన వస్తే పరిశీలిస్తాం..

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ 

 

చెన్నై: బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రతిపాదన వస్తే తప్పనిసరిగా పరిశీలిస్తామని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అయితే, ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం, ప్రైవేట్‌ కంపెనీలు కలిసి ఆలోచించుకోవాలన్నారు. కరోనా సంక్షోభ ప్రభావంతో బ్యాంకిం గ్‌ రంగంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు-ఎన్‌పీఏ) రెట్టింపు కావచ్చని ఈ మధ్యనే విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ హెచ్చరించింది.


మొండిపద్దుల నిర్వహణ కోసం ప్రత్యేక బ్యాంక్‌ (బ్యాడ్‌ బ్యాంక్‌) ఏర్పాటు అవసరమన్న అభిప్రాయం చాలా కాలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శనివారం జరిగిన నానీ పాల్కీవాలా స్మారకోపన్యాస కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా శక్తికాంత దాస్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనింకా ఏమన్నారంటే.. 


ఆర్థిక పునరుజ్జీవం, స్థిరత్వానికి మద్దతు

ఆర్థిక స్థిరత్వంతో ప్రజలకు మేలు. అందరం కలిసి ఆర్థిక స్థిరత్వ స్థితి స్థాపకత, పటిష్ఠతను సంరక్షించడంతోపాటు పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పునరుజ్జీవం, వృద్ధి పెంపునకూ పాటుపడాల్సిన అవసరం ఉంది. జాతీయ చెల్లింపుల వేదిక కోసం అత్యంత ఆధునిక వ్యవ స్థ ఏర్పాటుతో పాటు సురక్షితమైన, భద్రమైన, సమర్థవంతమైన, చౌకగా సేవలందించగలిగే సమగ్ర చెల్లింపుల వ్యవస్థ కోసం ఆర్‌బీఐ ఇప్పటికే పలు విధానపరమైన చర్యలు చేపట్టింది. ఆర్‌బీఐ నియంత్రిత సంస్థలు కూడా తమ వంతు చర్యలు చేపట్టాలి. ముప్పును ముందుగానే గుర్తించి, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతర్గత రక్షణ వ్యవస్థలను మరింత పటిష్ఠపర్చుకోవాల్సిన అవసరం ఉంది. 


   ఆర్‌బీఐ చర్యలతో తగ్గిన కరోనా ప్రభావం 

కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా మానవ సమాజం 2020లో అత్యంత కఠిన సమయాన్ని ఎదుర్కొంది. ఈ అసాధారణ ఆరోగ్య, ఆర్థిక విపత్తు అన్ని దేశాల్లోని ఆర్థిక, సామాజిక లోపాల్ని ఎత్తిచూపడంతో పాటు మరింత పెంచింది. ఆర్‌బీఐ చేపట్టిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా సంక్షోభ ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పడ్డాయి. సంక్షోభ సమయంలో, దాని తర్వాత కూడా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివేకమైన, చట్టబద్ధమైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 


  వృద్ధికి మద్దతుగా మరిన్ని చర్యలకు సిద్ధం 

ఆర్థిక స్థిరత్వంలో రాజీ పడకుండా వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైతే మరిన్ని చర్యలు చేపట్టేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉంది. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంతో పాటు రుణ వితరణను పెంచేందుకు బ్యాంకులు ముందుజాగ్రత్త చర్యగా మూలధన నిల్వలను పెంచుకోవాలి. 

 

  బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీల పాలన    సామర్థ్యం మరింత పెరగాలి..  

ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కోసం బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎ్‌ఫసీ) పాలన సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, కంప్లయన్స్‌, అస్యూరెన్స్‌ మెకానిజంతో కూడిన పాలన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థిక సంస్థలపై పర్యవేక్షణను పెంచడంపై ఆర్‌బీఐ దృష్టిపెట్టింది. వ్యవస్థలో ఒత్తిడికి తాత్కాలిక నివారణలకు బదులు దాని మూలాల గుర్తింపు కోసం ఆర్‌బీఐ పర్యవేక్షణ కొనసాగుతుంది.

   

 విదేశీ మారక నిల్వలు      పెంచుకోక తప్పదు.. 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగినప్పుడు భారత్‌ వంటి వర్ధమాన దేశాల్లోకి విదేశీ మారక ప్రవాహం పెరగడం సాధారణ పరిణామమే. అమెరికా ప్రభుత్వం భారత్‌పై కరెన్సీ మ్యానిపులేటర్‌గా ముద్రవేసినప్పటికీ అగ్రరాజ్యాల  పరపతి విధానాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తమ వంటి వర్ధమాన దేశాలకు విదేశీ మారక నిల్వలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

భారత ప్రస్తుత విదేశీ మారక నిల్వలు 58,000 కోట్ల డాలర్ల స్థాయిని దాటాయి. గత ఏడాది కాలంలో నిల్వలు ఏకంగా 10,000 కోట్ల డాలర్లకు పైగా పెరగడాన్ని సాకుగా చూపుతూ అమెరికా సర్కారు మన దేశాన్ని కూడా కరెన్సీ మ్యానిపులేటర్ల జాబితాలో చేర్చింది. 


ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత కఠిన నిబంధనలు!


బ్యాంక్‌ల తరహాలో  బడా ఆర్థిక సంస్థలకూఎస్‌ఎల్‌ఆర్‌, సీఆర్‌ఆర్‌ నిర్వహణ తప్పనిసరి 


నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ)కు ఆర్‌బీఐ మరింత కఠిన నిబంధనలు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ రంగ కంపెనీల రుణ చెల్లింపుల సామర్థ్యంతో పాటు సంక్షోభ సహనీయ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ మరింత కఠిన వైఖరిని అవలంబించాలనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి వచ్చే వారంలో చర్చా పత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.


బ్యాంక్‌ల తరహాలో బడా ఎన్‌బీఎఫ్‌సీలకు సైతం చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌), నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌) నిర్వహణను తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బ్యాంక్‌ల ఎస్‌ఎల్‌ఆర్‌ 18 శాతం, సీఆర్‌ఆర్‌ 3 శాతంగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీ)లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆల్టికో క్యాపిటల్‌ ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీశాయి. 


Updated Date - 2021-01-17T06:48:03+05:30 IST