ఏ భవనం ఎప్పుడు కూలుతుందో...?

ABN , First Publish Date - 2021-11-23T04:28:50+05:30 IST

రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భవనాలు కూలి ప్రాణాలు పోతున్నాయి.

ఏ భవనం ఎప్పుడు కూలుతుందో...?
శిథిలావస ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల విశ్రాంతి గదులు

ఉపాధ్యాయులు, విద్యార్థులకు పొంచి ఉన్న ప్రమాదం 

ఉదయగిరి రూరల్‌, నవంబరు 22: రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భవనాలు కూలి ప్రాణాలు పోతున్నాయి. మండలంలో దశాబ్దాల కాలం నాటి భవనాల్లో విద్యాబోధన సాగుతుండడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల అనంతపురం, కడప తదితర పట్టణాల్లో పురాతన భవనాలు నేలకూలి పలువురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భవనాలు ఉరుస్తుండడంతో ఎప్పుడు కూలుతాయో.. ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయగిరి ఉన్నత పాఠశాల భవనాలు పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరాయి. తరగతి గదులు ఫిల్లర్లు, బీమ్‌లు కుంగి శ్లాబు పెచ్చులూడిపోయాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకొనే గదులు కూలే దశలో ఉన్నాయి. సమీపంలో ఉన్న జూనియర్‌ కళాశాల భవనాలు మొత్తం ఉరుస్తుండడంతో ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. అలాగే మండలంలోని గండిపాళెం, బిజ్జంపల్లి మెయిన్‌, మాసాయిపేట, వెంకట్రావుపల్లి, జీ.చెరువుపల్లి దళితవాడ, కుర్రపల్లి బీసీ కాలనీ తదితర పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే భవనాల శ్లాబు పెచ్చులేడి పైనపడి పలువురు గాయపడిన సంఘటనలూ ఉన్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ఉపాఽధ్యాయులు, విద్యార్థులకు ఏమైనా ప్రమాదం సంభవిస్తోందనని వారిలో భయాందోళన నెలకొంది. 

Updated Date - 2021-11-23T04:28:50+05:30 IST