పాత బిల్లులే రాలే.. కొత్తగా పనులెలా చేయాలి

ABN , First Publish Date - 2022-05-29T05:54:38+05:30 IST

‘మొదటి విడత పల్లె ప్రగతి నుంచి 4వ విడత పల్లె ప్రగతి వరకు చేసిన పనులకే బిల్లులు ఇంత వరకు రాలేదు, ఇప్పుడు 5వ విడత పల్లె ప్రగతిలో కొత్తగా పనులెలా చేయాలి’ అని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, రాగిబావి సర్పంచ్‌ రాంపాక నాగయ్య, పాలడుగు సర్పంచ్‌ మర్రిపెల్లి యాదయ్య అధికారులను ప్రశ్నించారు.

పాత బిల్లులే రాలే.. కొత్తగా పనులెలా చేయాలి
మోత్కూరులో మాట్లాడుతున్న పాలడుగు సర్పంచ్‌ యాదయ్య

మోత్కూరు, మే 28: ‘మొదటి విడత పల్లె ప్రగతి నుంచి 4వ విడత పల్లె ప్రగతి వరకు చేసిన పనులకే బిల్లులు ఇంత వరకు రాలేదు, ఇప్పుడు 5వ విడత పల్లె ప్రగతిలో కొత్తగా పనులెలా చేయాలి’ అని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, రాగిబావి సర్పంచ్‌ రాంపాక నాగయ్య, పాలడుగు సర్పంచ్‌ మర్రిపెల్లి యాదయ్య అధికారులను ప్రశ్నించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో 5వ విడత పల్లె ప్రగతిపై శనివారం జరిగిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడారు. రాగిబావి గ్రామం చిన్నదని, గ్రామానికి నెలకు ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.57,779 చొప్పున ఒక నెల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మరో నెల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని, అందులో ట్రాక్టర్‌ కిస్తు రూ.28వేలు, సిబ్బంది వేతనాలు రూ.17వేలు, కరెంటు బిల్లు రూ.10 వేలు ఖర్చవుతాయని, ఇక తాను పనులు ఎలా చేయించాలని సర్పంచ్‌ నాగయ్య ప్రశ్నించారు. అప్పులు చేసి గతంలో చేసిన పనులకు ఇంత వరకు బిల్లులు రాలేదన్నారు. పాలడుగు సర్పంచ్‌ యాదయ్య మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఒక్కో సర్పంచ్‌కు రూ.పది లక్షల నుంచి రూ.12 లక్షల వరకు రావాల్సి ఉందన్నారు. తప్ప సర్పంచ్‌ల బాధలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మండల ప్రత్యేక అధికారి పి.యాదయ్య, ఎంపీడీవో పి.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్‌లకు బిల్లులు రాని మాట వాస్తమే నని, వారి ఇబ్బందులు తెలుసన్నారు. ఇక్కడ సర్పంచ్‌లు వ్యక్తం చేసిన అభి ప్రాయాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లుతామన్నారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ బుషిపాక లక్ష్మీ, ఎంపీవో రావూఫ్‌అలీ పాల్గొన్నారు. 

భువనగిరి రూరల్‌: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామియాదవ్‌ కోరారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సమీక్ష సమావేశానికి అధికారులు గైర్హాజరు కావడం తగదన్నారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో గుత్తా నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, వైస్‌ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి పాల్గొన్నారు. 

మోటకొండూరు: పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి పరిమలదేవి, ఎంపీపీ పైళ్ల ఇందిరా అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇక్కుర్తి సర్పంచ్‌ చామకూర అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతం పల్లెప్రగతిలో చేసిన పను లకే డబ్బులు రాలేదు, ఇప్పుడు కొత్తగా పనులు ఎలా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తిరెడ్డిగూడెం సర్పంచ్‌ ఆడెపు విజయ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమాలపై గ్రామసభలు నిర్వహిస్తే ప్రజలు తమను కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీవో వీరస్వామి, ఎంపీవో కిషన్‌, ఎంపీటీసీ నిమ్మాని స్వప్న, సర్పంచ్‌లు వడ్డెబోయిన శ్రీలత, స్వప్న, మల్గ ఎట్టమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని మండల పత్యేక అధికారి రాజారాం అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మా ట్లాడారు. కాగ ఇప్పటికే చేసిన అభివృద్ధి పనులకు నిధులు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని, నిధులు కేటాయించకుండా మళ్లీ ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో ఎలా నిర్వహించాలని ఆత్మకూరు, తుక్కాపురం, కొరటికల్‌ పల్లెర్ల సర్పంచులు జె.నగేష్‌, డి.రాజు, కె.సత్తయ్య, ఎన్‌.నర్సింహ్మరెడ్డి అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ, ఎంపీడీవో ఏ.రాములు, ఎంపీవో పద్మావతి పాల్గొన్నారు. 

వలిగొండ: పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ నూతి రమేష్‌ రాజు కోరారు. మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జరి గిన సమావేశంలో మాట్లాడారు. ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దేం దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో చేసిన పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాలేదని దీంతో సర్పంచ్‌లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకువ చ్చారు. సమావేశంలో జడ్పీటీసీ వాకిటి పద్మ, ఎంపీడీవో గీతారెడ్డి, వైస్‌ ఎంపీపీ బాలరాజు ఉమ తదితరులు పాల్గొన్నారు. 

సంస్థాన్‌నారాయణపురం:  పల్లె ప్రగతి నిర్వహణ బాధ్యతలు నిబం ధనలపై శనివారం మండల ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గతంలో చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని సర్పంచులు కోరారు. సమావేశంలో ఎంపీపీ గుత్త ఉమాదేవి,  ఎంపీడీవో యాదగిరి రావు, ఎంపీవో నర్సింహారావు, ఉన్నారు. అదేవిధంగా రాజాపేట, తుర్కపల్లి, భూదాన్‌పోచంపల్లి, గుండాల, అడ్డగూడూరు మండలాల్లో పల్లెప్రగతి కార్యక్రమంపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు.


‘పల్లె ప్రగతి’ సమీక్షను బహిష్కరించిన సర్పంచులు

చౌటుప్పల్‌ రూరల్‌: పల్లెప్రగతి సమీక్ష సమావేశాన్ని అధికార, ప్రతిపక్షపార్టీల సర్పంచ్‌లు బహిష్కరించారు. మండలపరిషత్‌ కార్యాలయంలో పల్లె ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే  అధికార పార్టీ సర్పంచ్‌లతోపాటు, ప్రతిపక్షపార్టీల సర్పంచ్‌లు లేచి పల్లెప్రగతి, గ్రామపంచాయతీలపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన తెలిపారు. గత పల్లెప్రగతిలో చేపట్టిన పనులకు నేటికీ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులపాలు ఆయ్యామని ఆందోళన వ్యక్తం చేశారు. వైకుంఠథామాలు, రైతువేదికలు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు. బిల్లులు చెల్లిస్తేనే ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొంటామని, లేనిపక్షంలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు.  

Updated Date - 2022-05-29T05:54:38+05:30 IST