పాత భవనం కూల్చివేతకు పేలుళ్లు..!?

ABN , First Publish Date - 2022-07-05T05:57:11+05:30 IST

అది జనావాసాల మధ్యన, ప్రధాన రహదారికి పక్కన ఉన్న పురాతన బహుళ అంతస్తుల భవనం. కొన్నేళ్లుగా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకొని పడావు పడింది. అయితే ఇటీవల ఈ భవనం కూల్చివేతకు పేలుళ్లు జరపడం కలకలం రేపుతోంది.

పాత భవనం కూల్చివేతకు పేలుళ్లు..!?

నగరం నడిబొడ్డున వ్యక్తి దుందుడుకు చర్య
పేలుడు ధాటికి ఎగిరిపడిన భవన శకలాలు
కూలీలకు గాయాలు.. గప్‌చు్‌పగా తరలింపు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రాంత జనం
అలాంటిదేమీ లేదంటున్న పోలీస్‌ అధికారులు


ఓరుగల్లు, జూలై 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
అది జనావాసాల మధ్యన, ప్రధాన రహదారికి పక్కన ఉన్న పురాతన బహుళ అంతస్తుల భవనం. కొన్నేళ్లుగా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకొని పడావు పడింది. అయితే ఇటీవల ఈ భవనం కూల్చివేతకు పేలుళ్లు జరపడం కలకలం రేపుతోంది. ఇళ్ల మధ్యన ఉన్న ఏ కట్టడాన్ని అయినా యంత్రాలతో కూల్చాల్సిందే గానీ, పేలుళ్లు జరపకూడదు. కానీ ఈ నిబంధనను తోసిరాజని పట్టపగలు పేల్చివేతలకు పాల్పడటం పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల అండ ఉందని జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్లితే..  హనుమకొండ, వరంగల్‌ జిల్లాల సరిహద్దుల్లో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఒక పాత హోటల్‌ భవనం చాలా కాలంగా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నది. ఇది నగరం నడిబొడ్డున కొలువుదీరి ఉంది. వరంగల్‌ నగరంలో ఏకైక భారీ హోటల్‌గా ఒకప్పుడు ఇది పేరుపొందింది.  జాతీయ స్థాయి నాయకులతో పాటు రాష్ట్ర స్థాయి ముఖ్యమైన నేతలు ఇక్కడే బస చేసేవారు. ఈ హోటల్‌ అమ్మకం విషయంలో న్యాయవివాదం ఏర్పడగా, ఇరుపార్టీల్లోని ఒక వ్యక్తి తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటున్నారు. అందుకనుగుణంగా హోటల్‌ను  కూల్చేందుకు సిద్ధమై,  జేసీబీలతో పాటు పేల్చివేతలకు పాల్పడినట్టు  చెప్పుకుంటున్నారు.  జేసీబీల ద్వారా నిర్మూలించడం సాధ్యం కాదని తెలియడంతో ఏకంగా పేలుడు పదార్థాలను ఉపయోగించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

పేలుడు జరగలేదా..?

స్థానిక యువకులు మాత్రం బ్లాస్టింగ్‌ వల్లనే కూల్చివేతల సమయంలో భారీ శబ్దం వినిపించిందని, దీని వల్ల కొందరికి గాయాలు సైతం అయ్యాయని చెబుతున్నారు. కూల్చివేత పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన కొంత మంది యువకులతో పాటు స్టేషన్‌ ఘన్‌పూర్‌, చిల్పూరు మండలాలకు చెందిన కూలీలు గాయపడినట్టు సమాచారం. ఇదిలా ఉండగా పోలీస్‌ అధికారులు మాత్రం బ్లాస్టింగ్‌ జరగలేదని కరాఖండిగా చెబుతున్నారు. కూల్చివేత ఆదేశాలతో పాటు, పోలీస్‌ రక్షణ కూడా సదరు వ్యక్తికి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి అంతటి పకడ్బందీ ఆదేశాలు ఉన్నప్పుడు కూల్చివేతలు ఎందుకు ఆపారన్న సందేహాలు తలెత్తుతున్నాయి.  హడావుడిగా కూల్చివేయాలన్న ఆలోచనలతోనే బ్లాస్టింగ్‌ చేసినట్లు సమాచారం.

టీఆర్‌ఎస్‌ పెద్దల హస్తం.. ?
ఎలాంటి వివాదాలైనా  అధికార పార్టీ నేతల కనుసైగ లేకుండా జరగడం లేదన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఈ హోటల్‌ భవనం విషయంలోనూ  తప్పనిసరిగా అధికార పార్టీ నేతల హస్తం ఉందన్న చర్చ జరుగుతోంది. కూల్చివేతల వల్ల గాయాలైన వారికి ప్రాథమిక చికిత్సను అందించి,  హుటాహుటిగా  ఇళ్ళకు పంపించారని సమాచారం. ఒక వేళ బ్లాస్టింగ్‌ జరగక పోయినప్పటికీ కూల్చివేతలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం కనిపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. పేల్చివేతలు జరగనే లేదంటున్న పోలీస్‌ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-07-05T05:57:11+05:30 IST