కిళ్లీ, సోడా, బీడీ వర్తక సంఘ భవనం
ప్రభుత్వ కార్యాలయాలకు శిథిల భవనమా!
కొత్త జిల్లాకు కార్యాలయాల ఏర్పాటు ప్రహసనమేనా
తలుపులే లేని కిళ్లీ, సోడా, బీడీ వర్తక సంఘం భవనంలో కార్యాలయాలు
డెడ్‌లైన్ వారం.. భవనాలే దూరం
ఉగాదికి అందుబాటులోకి వచ్చేనా?
గట్టిగా గాలివాన వస్తే కూలిపోయేట్టున్న ఈ భవనంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారట. ప్రభుత్వం కూల్చివేయాల్సిన శిథిల భవనాల జాబితా సిద్ధం చేస్తే దానిలో ముందుగా చోటుచేసుకునే భవనం ఇదే. కానీ అదేమి దౌర్భాగ్యమో! మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడనున్న కృష్ణాజిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్నే ఎంచుకున్నారు అధికారులు. బందరు కిళ్లీ, సోడా, బీడీ వర్తక సంఘ భవనం ఇది. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఈ భవనానికి తలుపులు లేవు.. కిటికీలకు ఊచలు కూడా లేవు. విద్యుత్ సౌకర్యం లేదు.. ఏ క్షణాన కూలిపోతుందో తెలియదు. కూల్చివేయాల్సిన ఈ భవనానికి మరమ్మతులు చేస్తారట. అదీ ఇద్దరు కార్పెంటర్లతో.. ఎంత ఖర్చు చేస్తారు? పనులు ఎన్ని రోజులు చేస్తారు? అంతా చేసినా ఎప్పుడు కూలిపోతుందో తెలియని భవనంలో ఏ ధైర్యంతో విధులు నిర్వర్తిస్తారు? అధికారులకే తెలియాలి.
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడనున్న కృష్ణాజిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ప్రహసనంగా మారింది. వారంలో జిల్లా విభజన జరగనుంది. కార్యాలయాలను సిద్ధం చేసుకునేందుకు అధికారులు ఇచ్చిన గడువు కూడా దగ్గరకొచ్చేసింది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు మాత్రం అడుగులు ముందుకు పడటంలేదు. వివిధ శాఖలకు కార్యాలయాల ఏర్పాటు నత్తకే నడకలు నేర్పుతున్న చందంగా మారింది. మరో వారంలో జిల్లా విభజన జరగనుండగా కార్యాలయాలకు భవనాలు సమకూర్చడం, అందులో పరిపాలనా కార్యకలాపాలు నడిచేలా ఏర్పాట్లు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. నూతన కార్యాలయాల ఏర్పాటును కాగితాల్లో చూపి ఉన్నతాధికారులు మిన్నకుండిపోయారు. తీరా చూస్తే వాటిలో అత్యధికం శిథిల భవనాలే. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా విజయవాడలోనే ఉన్నాయి. విభజన తరువాత అయినా ఉద్యోగులు మచిలీపట్నం తరలివస్తారా? లేక అక్కడే నివాసం ఉండి, పరిపాలన కొనసాగిస్తారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.
పాత భవనంలో కార్యాలయాలు
మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడనున్న కృష్ణాజిల్లాకు పలు ప్రభుత్వ కార్యాలయాలను నోబుల్ కళాశాల ఎదురుగా ఉన్న బందరు కిళ్లీ, సోడా, బీడీ వర్తక సంఘ భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ భవనంలో ఉన్న గదులకు దర్వాజాలు తప్ప తలుపులు లేవు. కిటీకీలకు రెక్కలు, ఇనుప చువ్వలు కూడా లేవు. వరండా గోడకు ఉన్న ఇనుప గ్రిల్ తుప్పుపట్టి ఊడిపోయి ఉంది. గదుల్లోని ఫ్లోర్‌కు వేసిన నాపరాళ్లు పగిలిపోయి, లేచిపోయాయి.
ఇద్దరు కార్పెంటర్లతో పనులు
ఈ భవనంలో శుక్రవారం ఇద్దరంటే ఇద్దరు కార్పెంటర్లు పనిచేస్తూ కనిపించారు. గదులను కార్యాలయాలకు అనుకూలంగా సిద్ధం చేసేందుకు ఎలాంటి మెటీరియల్ అక్కడ లేదు. విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అక్కడక్కడా నూతన విద్యుత్ బోర్డులను ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడ ఏర్పాటు చేసే కార్యాలయాలు ఇవే
1962లో నిర్మించిన బందరు కిళ్లీ, సోడా, బీడీ వర్తక సంఘ భవనంలో జిల్లా పౌర సంబంధాలశాఖ డీడీ, ఉద్యానశాఖ ఏడీ, సెరీకల్చర్ ఏడీ, భూగర్భ గనులు, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, అటవీశాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం, జిల్లా పరిశ్రమల శాఖకు సంబంధించిన కార్యాలయాలకు గదులను కేటాయిస్తూ పేపరుపై బోర్డులను ఏర్పాటు చేసి గోడకు అతికించారు. ఈ గదులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలంటే ఎంత వేగంగా చేసినా, కనీసం రెండు, మూడు నెలలకుపైనే సమయం పడుతుంది.
మచిలీపట్నంలో ఉన్న కార్యాలయాలు ఇవీ..
కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ, పౌరసరఫరాలశాఖ, పంచాయతీశాఖ, బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలు, ట్రెజరీ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక, వ్యవసాయ శాఖలు, జిల్లా పరిషత్, సర్వశిక్ష, సహకార శాఖ, జిల్లా ఆడిట్ కార్యాలయాలు ఉన్నాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని ఆంధ్రా జాతీయ కళాశాల ప్రాంగణంలో, ఆత్మ పీడీ కార్యాలయాన్ని కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో, మైక్రో ఇరిగేషన్ కార్యాలయాన్ని మచిలీపట్నం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు కార్యాలయాన్ని ఆ శాఖ కార్యాలయంలో, నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని ఆ శాఖ డీఈ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయ అధికారి కార్యాలయాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో, డ్వామా పీడీ కార్యాలయాన్ని శ్రమశక్తి భవనంలో, జిల్లా రిజిస్ర్టార్ కార్యాలయాన్ని సమీపంలో ఉన్న మునిసిపల్ కమిషనర్ గెస్ట్‌హౌస్‌లో, పోర్టు రోడ్డులోని శిశు గృహ భవనంలో మెప్మా పీడీ, ఐసీడీఎస్ పీడీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఉద్యోగుల విభజనపై విధివిధానాలేవి?
జిల్లాల విభజన జరిగితే ఉద్యోగుల విభజన తప్పనిసరి. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి విధివిధానాలు తమకు అందలేదని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల విభజన జనాభా ప్రాతిపదికన ఉంటుందని మాత్రమే చెబుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు కొందరు విజయవాడలో ఉండాలా? మచిలీపట్నం రావాలా? అనే సందిగ్ధంలోనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు అధిక శాతం ఉద్యోగులు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. అదే నిజమైతే మరి కృష్ణాలో పాలనతీరు ఎలా ఉంటుందనే సందేహాలూ ఉన్నాయి.
గ్రామీణ నీటిసరఫరా విభాగం ఎస్ఈ కార్యాలయానికి కేటాయించిన గదుల దుస్థితి