డొక్కు బస్సులతో బిక్కు బిక్కు

ABN , First Publish Date - 2021-07-25T05:40:30+05:30 IST

బస్సు ప్రయాణం ప్రమాదపుటంచున సాగుతోంది. నడుస్తుండగానే బస్సు చక్రాలు ఊడిపోవడం, మంటలు చెలరేగి బస్సు బుగ్గయిపోవడం నివ్వెరపరుస్తోంది. ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ పరిధిలో చోటుచేసుకున్న రెండు ఘటనలు భద్రతా ప్రమాణాలను ప్రశ్నిస్తున్నాయి.

డొక్కు బస్సులతో బిక్కు బిక్కు

ప్రమాదపుటంచున ప్రయాణికులు
ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ పరిధిలో కాలం చెల్లిన 101 బస్సులు
భద్రతా ప్రమాణాలను ప్రశ్నిస్తున్న బస్సు దగ్ధం ఘటన
అద్దె బస్సుల స్థానంలో పాత బస్సుల వాడకం
ప్రమాదాల నిరోధానికి ఆర్టీసీ అధికారుల అష్టకష్టాలు


వరంగల్‌ అర్బన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 
బస్సు ప్రయాణం  ప్రమాదపుటంచున సాగుతోంది. నడుస్తుండగానే బస్సు చక్రాలు ఊడిపోవడం, మంటలు చెలరేగి బస్సు బుగ్గయిపోవడం నివ్వెరపరుస్తోంది. ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ పరిధిలో చోటుచేసుకున్న రెండు ఘటనలు భద్రతా ప్రమాణాలను ప్రశ్నిస్తున్నాయి.  అయితే ఈ ప్రమాదాలకు కారణాలేంటి? మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆర్టీసీ అధికారులు  అత్యవసర సమావేశంలో సమీక్షిస్తున్నారు. కాలం చెల్లిన బస్సులు ఆర్టీసీలో రాజ్యమేలుతున్నాయన్న ప్రచారం కూడా ఉంది. వీటి వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు రెండు నెలల నుంచి అద్దె బస్సులు సైతం తిరగడం ఆగిపోయాయి. దీంతో అనివార్యంగా ఫిట్‌నె్‌సలేని బస్సులను నడపాల్సి వస్తోందని ఆర్టీసీవర్గాలు  వాపోతున్నాయి.

భయాందోళనలో ప్రయాణికులు
సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ పెట్టింది పేరు. అందుకే లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. కానీ ఈ నడుమ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల వల్ల భయాందోళనలకు గురవుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో బస్సు దగ్ధం సంఘటన తలచుకుంటేనే భయం వేస్తోందని అందులో ప్రయాణించిన ప్రయాణికులు చెబుతున్నారు. ఇదే ప్రమాదం రాత్రి వేళల్లో జరిగితే ఎంత భారీ నష్టం జరిగేదోనని ఆందోళన చెందుతున్నారు.

నష్టంలో..
ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆ తర్వాత ముంచుకొచ్చిన కరోనా మహమ్మారి.. తద్వారా లాక్‌డౌన్‌తో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్థికంగా  చితికి పోవడానికి కారణాలయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో జనజీవనం సాధారణ స్థాయికి వచ్చింది. ప్రయాణాలు మొదలయ్యాయి. మరోవైపు కార్గో సేవలు కూడా ఆర్టీసీని కొంత మేర ఆర్థిక పటిష్టతకు దోహదపడుతోందని అధికారులు అంటున్నారు.. ఇలాంటి సందర్భంలో ఈ ప్రమాదాలు ఇబ్బందికర పరిస్థితులను మరింత పెంచుతున్నాయంటున్నారు..

కాలం చెల్లిన బస్సులు
ఆర్టీసీలో కాలంచెల్లిన బస్సులతో ఆర్టీసీ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. అసలే పాత బస్సులు గతుకుల రోడ్ల మీద మరింత ఇబ్బంది పడుతున్నాయి. వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో 9 డిపోల్లో 101 బస్సులు కాలం చెల్లినవిగా అధికారులు గుర్తించారు. ఇవి 15 లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాయి. ఉద్యోగులు మాత్రం ఇంతకు రెట్టింపు బస్సులు రోడ్డెక్కలేని దుస్థితిలో ఉంటాయని అంటున్నారు. డీలక్స్‌ 17, పల్లెవెలుగు - 69,  సీటీ ఆర్డినరీ 17 కాగా, మొత్తం 101 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించారు. డిపోల వారిగా అయితే వరంగల్‌-1లో 03, వరంగల్‌-2లో 12, హన్మకొండ -23, జనగామ -22, పరకాల -15,  నర్సంపేట -17, తొర్రూర్‌ -03, మహబూబాబాద్‌ -01, భూపాలపల్లి -05 బస్సులు  కాలం చెల్లినవిగా గుర్తించినట్టు సమాచారం. ఆర్టీసీని వెంటాడుతున్న ఆర్థిక దుస్థితి వల్ల కొత్త బస్సులు కొనే సాహసం చేయలేక పోయారు. దీంతో అద్దె బస్సులను ప్రవేశపెట్టారు.  ఆర్టీసీ అద్దె చెల్లించకపోవడంతో రెండు నెలల నుంచి అద్దె బస్సులు యజమానులు నడపడం లేదు. దీంతో మరింత గడ్డు పరిస్థితిని ఆర్టీసీ ఎదుర్కొంటోంది..

బకాయిలు  రూ.10కోట్లు
వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌ 9డిపోల పరిధిలో 384 అద్దె బస్సులు నడుస్తున్నాయి. అద్దె బస్సుల బకాయిలు పేరుకుపోవడంతో బస్సులు నడపడం నిలిపేశారు. అద్దె బస్సుల మీద ఆధారపడిన ఆర్టీసీకి ఇదీ మరింత ఇబ్బందికర పరిస్థితిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత లేకపోవడంతో పాటు కరోనావల్ల ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం లేకపోవడంతో చేతులు ఎత్తేసింది. ఒక్క వరంగల్‌ రీజియన్‌ పరిధిలో అద్దె బస్సుల యజమానులకు చెల్లించాల్సి న డబ్బులు ఏకంగా రూ.10కోట్లు.. నెలనెలా అద్దె చెల్లిస్తేనే బ్యాంకులు, ఫైనాన్స్‌లల్లో ఈఎంఐలు చెల్లించే అవకాశం ఉం టుంది. లేదంటే తాము ఎట్లా చెల్లించేదని వారంటున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు బస్సులను నడిపి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూశామంటున్నారు.. కష్టకాలంలో తమతో పనిచేయించుకుని ఇపుడు తమను బజారున పడేశారని అద్దె బస్సుల యజమానుల సంఘం వరంగల్‌ రీజియన్‌ అధ్యక్షుడు మారిపెల్లి రాంరెడ్డి అంటున్నారు.. అధికారులను, మంత్రులను ఎవరిని కలిసినా తమను పట్టించుకున్న నాథుడే లేడంటున్నారు. ఇప్పటికైనా అద్దె బస్సుల బకాయిలు చెల్లించడం ద్వారా యజమానులను ఆదుకోవడమే కాదు.. ప్రజలకు సురక్షిత ప్రయాణం అందించే అవకాశం ఉంటుందని రాంరెడ్డి అంటున్నారు.

Updated Date - 2021-07-25T05:40:30+05:30 IST