కోడిపుంజు కూస్తోందంటూ కోర్టుకెక్కారు.. దీనికేనా అని ఆశ్చర్యపోకండి.. అసలు విషయం తెలిస్తే..

ABN , First Publish Date - 2022-08-23T16:02:49+05:30 IST

కోడిపుంజు(Cock) అన్నాక కూయక మానుతుందా? పులి(Tiger) అన్నాక గర్జించక మానుతుందా? ఇంతోసి దానికి కోర్టు మెట్లెక్కాలా?

కోడిపుంజు కూస్తోందంటూ కోర్టుకెక్కారు.. దీనికేనా అని ఆశ్చర్యపోకండి.. అసలు విషయం తెలిస్తే..

కోడిపుంజు(Cock) అన్నాక కూయక మానుతుందా? పులి(Tiger) అన్నాక గర్జించక మానుతుందా? ఇంతోసి దానికి కోర్టు(Court) మెట్లెక్కాలా? అని టైటిల్ చూసి ఆశ్చర్యపోకండి. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు. ఇప్పటికీ ఊళ్లలో కోడిపుంజు కూస్తే నిద్ర లేస్తారు జనం. కానీ ఈ కేసు పెట్టిన వృద్ధ దంపతులుం(Old Couple)డే ఏరియాలో మాత్రం కోడిపుంజు కూతకు ఎవరూ నిద్రన్నది లేక ఇబ్బంది పడుతున్నారు. అసలు ఈ కోడిపుంజు దెబ్బకు ఇళ్లకు ఇళ్లే ఖాళీ చేసి వెళ్లిపోతున్నారంటే నమ్మండి. అమ్మ కోడో.. ఇంత చేసిందా? అని ఆశ్చర్యపోకండి. ఈ కోడిపుంజు కూత రేంజ్ ఏంటో తెలిస్తే మరోసారి ముక్కున వేలేసుకుంటారు.


అసలు ఇంత చెబుతున్న కోడిపుంజు ఎక్కడుంది.. అంటారా? జర్మనీ(Germany)లో. జర్మనీకి చెందిన వృద్ధ దంపతులు ఫ్రెడ్రిక్, జుటాలు ఈ కోడిపుంజుతో పడలేక విసిగి వేసారిపోయి కోర్టు మెట్లెక్కారు. అంతేనా కోడి కూతను రికార్డ్ చేసి మరీ.. బెంచ్ ముందుంచారు. ఈ కోడిపుంజు దెబ్బకు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి వివరాలను సైతం కోర్టుకు వివరించారు. కోడిపుంజు అదే పనిగా కూస్తూ తమను ఇబ్బందిపెడుతోందని కోర్టుకు విన్నవించుకున్నారు. 


కోడిపుంజు అంటే ఏదో తెల్లవారుజామున 4-5 సార్లు కూసేసి ఊరుకుంటుంది. ఆ మాత్రానికే కేసు పెట్టాలా? వీళ్ల అతి అన్నారం సంత కెళ్లా..! అనిపిస్తోంది కదూ. కానీ ఆ కోడి ఏదో తెల్లవారుజామున నాలుగైదు సార్లు కూసేసి ఊరుకోదట.. అదే పనిగా రోజుకు 200 సార్లు కూస్తుందట. ఇక ఆ సౌండ్ కూడా 80 డెసిబెల్స్‌ రేంజ్‌లో ఉంటుందట. అంటే మోత మోగిపోతుందన్న మాట. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే సాయంత్రం గూట్లోకి చేరేంత వరకూ అదే పనిగా కూస్తూనే ఉంటుందట. 


పాపం.. పెంచుకుంటున్న వాళ్లేమో కోడిపుంజుని వదులుకోలేరు. అలాగని చూస్తే పక్కింటి వాళ్లు భయపడిపోతున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి పెంచుకుంటున్న వాళ్లది. తలుపు తీసుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చొందామన్న కోడి కూతకు భయపడి తలుపులు కూడా తీయలేక పోతున్నారట ఫ్రెడ్రిక్, జుటా దంపతులు. కానీ ఎన్నాళ్లని ఇలా? ఫైనల్‌గా కోడో.. తామో తేల్చుకోవాలనుకున్నారు. 


కోడి పెట్టే కూతను రికార్డు చేసి కోర్టు ముందుంచారు. అంతేకాదు.. దాని దెబ్బకు కొంతమంది చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయిన వారి వివరాలను సైతం సేకరించి కేసులో ప్రస్తావించారు. కేసు లెమ్గో జిల్లా జడ్జి ముందుకు త్వరలో రానుంది. ఈ న్యూస్ కాస్తా వైరల్ అవడంతో.. లెమ్గో జడ్జి ఏం తీర్పు చెబుతారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Updated Date - 2022-08-23T16:02:49+05:30 IST