వారసత్వ సంపదకు ఎసరు

ABN , First Publish Date - 2022-07-03T06:39:57+05:30 IST

బీచ్‌రోడ్డులో వారసత్వ సంపదగా గుర్తించి, అభివృద్ధి చేసిన పాత మునిసిపాలిటీ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంగా మార్చేయాలని నిర్ణయించారు.

వారసత్వ సంపదకు ఎసరు

పాత మునిసిపల్‌ కార్యాలయ భవనంలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ కార్యాలయం

వారసత్వ సంపదగా గుర్తించి  రెండేళ్ల క్రితం స్మార్ట్‌ సిటీ నిధులు కేటాయింపు

రూ.7.2 కోట్లతో కొత్త హంగులు

అందులో ఇప్పుడు శిక్షణలు, సమావేశాలు

ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచన చేయాలని నగరవాసుల సూచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


బీచ్‌రోడ్డులో వారసత్వ సంపదగా గుర్తించి, అభివృద్ధి చేసిన పాత మునిసిపాలిటీ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయంగా మార్చేయాలని నిర్ణయించారు. దాదాపు 120 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ భవనాన్ని భావితరాలకు వారసత్వ సంపదగా ఇవ్వాలని జీవీఎంసీ స్మార్ట్‌ సిటీ పథకం కింద సుమారు ఏడు కోట్ల రూపాయలు వెచ్చించింది. దాంతో ఈ పురాతన భవనం కొత్త రూపు సంతరించుకుంది. విశాఖ మ్యూజియంలా దీనిని కూడా కళా ప్రదర్శనలకు, ఫొటో ప్రదర్శనలకు వేదికగా మార్చాలని భావించారు. అది కార్యరూపం దాల్చక ముందే ప్రభుత్వ పెద్దలు దీనిని ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఏపీహెచ్‌ఆర్‌డీఐ) ప్రాంతీయ కార్యాలయానికి ఇవ్వాలని నిర్ణయించారు. వారికి అవసరమైన ఫర్నీచర్‌, ఇతర సదుపాయాలన్నీ సమకూర్చాలని వీఎంఆర్‌డీఏను ఆదేశించారు. దీని కోసం రూ.80 లక్షలతో టెండర్లు ఆహ్వానించారు. ఆ పనులన్నీ పూర్తయితే, వారసత్వ భవనం ఓ సాధారణ ప్రభుత్వ కార్యాలయంగా మారిపోతుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ, అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతి సంపదగా గుర్తించి, రూ.ఏడు కోట్లతో అభివృద్ధి చేసిన రెండేళ్లకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


బొబ్బిలి రాజుల హయాంలో...

విశాఖపట్నం బీచ్‌రోడ్డులో సుమారుగా 1,150 చ.మీ. స్థలంలో 1893లో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనికి బొబ్బిలి రాజులు అప్పట్లో రూ.50 వేలు అందజేశారు. నిర్మాణంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కింగ్‌జార్జి ఆస్పత్రి, కలెక్టరేట్‌ భవనాల్లా దీనిని కూడా రాళ్లతో నిర్మించారు. ఇందులో పై అంతస్థుకు అవసరమైన చెక్క మెట్లను ఇంగ్లండ్‌లో తయారుచేయించి, తీసుకువచ్చారు. నిర్మాణం పూర్తి చేసుకున్నాక మార్చి 8, 1904లో భవనాన్ని ప్రారంభించారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఇక్కడికి మహాత్మాగాంధీ వచ్చారని చెబుతారు. కాలక్రమంలో దానిని వైజాగపటం మునిసిపల్‌ కార్యాలయంగా వినియోగించారు. ఆశీల్‌మెట్ట జంక్షన్‌లో జీవీఎంసీ కార్యాలయం నిర్మించేంత వరకు మునిసిపల్‌ కార్యాలయంలోని బీచ్‌ రోడ్డులోని ఆ భవనంలోనే ఉండేది. కాలక్రమంలో పాడుబడిపోయింది. దాంతో అధికారులు పక్కనే వున్న టౌన్‌హాలులా వారసత్వ సంపదగా గుర్తించి కాపాడాలని నిర్ణయించారు. స్మార్ట్‌ సిటీ పథకం నిధులతో పైకప్పును మంగళూరు టైల్స్‌తో, కింద వుడెన్‌ ఫ్లోరింగ్‌, కిటికీలు అన్నింటికీ కొత్త హంగులు అద్దారు. ఒకటి, రెండుసార్లు సినిమా షూటింగ్‌లకు కూడా అద్దెకు ఇచ్చారు. ప్రజలు, పర్యాటకుల సందర్శనకు అనుమతిస్తే బాగుంటుందని పలువురు సీనియర్‌ సిటిజన్లు సూచించారు. చివరికి దానిని ప్రభుత్వ కార్యాలయంగా మార్చడానికి యత్నిస్తున్నారు. దీనిపై పునరాలోచన చేయాలని నగరంలో పలువురు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-07-03T06:39:57+05:30 IST