Elections: పాత మైసూరుపై బీజేపీ దృష్టి

ABN , First Publish Date - 2022-08-19T18:32:53+05:30 IST

రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని లక్ష్యం పెట్టుకున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టు వ్యూహాలకు పదును పెడుతోంది. ఓ వైపు రాష్ట్ర

Elections: పాత మైసూరుపై బీజేపీ దృష్టి

- కేంద్ర మంత్రులతో కార్యాచరణ 

- పార్టీ బలోపేతానికి వ్యూహాలు


బెంగళూరు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని లక్ష్యం పెట్టుకున్న బీజేపీ అధిష్టానం అందుకు తగ్గట్టు వ్యూహాలకు పదును పెడుతోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలక నేతల ద్వారా కార్యాచరణ సాగిస్తూనే మరోవైపు కేంద్రమంత్రులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రత్యేకించి రాష్ట్రంలో బీజేపీకి వెనుకబడిన ప్రాంతంగా ఉండే పాత మైసూరు జిల్లాలపై కేంద్రమంత్రులు దృష్టి సారించనున్నారు. 2023 ప్రారంభంలోనే శాసనసభ ఎన్నికలు రానున్నాయి. దాదాపు మూడేళ్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలకులు రాష్ట్రంవైపు కన్నెత్తి చూడలేదు. రెండు మూడు సందర్భాలలో మాత్రమే ప్రధాని సైతం రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాష్ట్రానికి అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఉత్తర కర్ణాటక, బెంగళూరు(Bangalore, Karnataka) ప్రాంతాలు, తీరం జిల్లాలతో పోల్చితే మైసూరు ప్రాంత జిల్లాల్లో పార్టీ కొంత బలహీనంగా ఉంది. మైసూరు ప్రాంత జిల్లాలైన మండ్య, చామరాజనగర, మైసూరు, హాసన్‌, రామనగర జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మైసూరులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మంత్రులు పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కనీసం నెలకు మైసూరు ప్రాంతంలో ముగ్గురు, నలుగురు కేంద్రమంత్రులు పర్యటించేలా కసరత్తు సిద్ధమైంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌(Minister Nirmala Sitharaman) ఈ ప్రాంతంలో శనివారం పర్యటించారు. రామనగర జిల్లాలో మారుమూల గ్రామాలకు సైతం కేంద్రమంత్రి జైశంకర్‌ వెళ్లారు. స్థానికులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. కళాశాల విద్యార్థులతోనూ ఆయన ప్రత్యేకించి మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధప్రభావంతో వెనుతిరిగి వచ్చిన మెడికల్‌ విద్యార్థులకు త్వరలోనే న్యాయం చేస్తామని ఇదే సందర్భంలో భరోసా ఇచ్చారు. మైసూరు ప్రాంత జిల్లాల్లో బహిరంగసభలే కాకుండా ఇష్టాగోష్టి, విద్యార్థులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలు కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. కేవలం 2023 శాసనసభ ఎన్నికల దృష్ట్యా కాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని 28 మంది ఎంపీలకుగాను 25 మంది బీజేపీకి చెందినవారే ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి డీకే సురేశ్‌(DK Suresh), రామనగర జిల్లాతో కలుపుకొని బెంగళూరు గ్రామీణ ఎంపీగా వ్యవహరిస్తున్నారు. మండ్య నుంచి స్వతంత్ర ఎంపీగా సుమలత ఉన్నారు. హాసన్‌ ఎంపీగా జేడీఎస్‌ నుంచి ప్రజ్వల్‌ రేవణ్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో మైసూరు ప్రాంతం మినహాయిస్తే మిగిలిన అన్ని స్థానాల్లోనూ బీజేపీకి చెందిన లోక్‌సభ సభ్యులే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతంపైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో ఉండే బీజేపీ నాయకత్వం ఇప్పటికే రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. తరచూ కేంద్రమంత్రులను పంపి మైసూరు జిల్లాల్లో కార్యక్రమాలను కొనసాగించే ఎత్తుగడ వేశారు. ప్రస్తుతానికి కేంద్రమంత్రులు రాష్ట్ర పర్యటన సాగిస్తుండగా రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు కేంద్రంలోని ప్రతిభావంతమైన నాయకులను పర్యటించేలా కార్యక్రమాలు రూపొందించాలని భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎక్కువసీట్లు గెలుపొందేందుకు బీజేపీ భారీ వ్యూహాలకు సిద్ధమైంది. 

Updated Date - 2022-08-19T18:32:53+05:30 IST