రూ. 100 నోట్ల రద్దు వార్తలో నిజమెంత?.. ఆర్‌బీఐ ఏమంటోంది?

ABN , First Publish Date - 2021-01-24T01:09:18+05:30 IST

భారతీయ రిజర్వు బ్యాంకు పాత నోట్లు అయిన రూ. 100, రూ. 10, రూ. 5 నోట్లను వెనక్కి తీసుకుంటోందన్న వార్త

రూ. 100 నోట్ల రద్దు వార్తలో నిజమెంత?.. ఆర్‌బీఐ ఏమంటోంది?

న్యూఢిల్లీ: పాత రూ. 100, రూ. 10, రూ. 5 నోట్లను భారతీయ రిజర్వు బ్యాంకు  వెనక్కి తీసుకోబోతోందన్న వార్త గత రెండు రోజులుగా తెగ చక్కర్లు కొడుతోంది. మార్చి, ఏప్రిల్ నాటికి చెలామణి నుంచి వీటిని పూర్తిగా తప్పించాలని ఆర్‌బీఐ నిర్ణయించినట్టు ఇటు ప్రధాన మీడియాలోను, అటు సోషల్ మీడియాలోనూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీంతో ప్రజలు మరోమారు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి నుంచే ఆయా నోట్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. జనాలను ఇంతగా భయపెడుతున్న వార్త ఎలా పుట్టిందో కానీ, ఆర్‌బీఐ నుంచి మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.  


డిస్ట్రిక్ట్ లెవల్ సెక్యూరిటీ కమిటీ (డీఎల్‌ఎస్‌సీ), డిస్ట్రిక్ట్ లెవల్ కరెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ (డీఎల్ఎంసీ) సమావేశంలో ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) బి మహేశ్ మాట్లాడుతూ.. రూ. 100, రూ. 10, రూ. 5 పాత కరెన్సీ నోట్లను మార్చి, ఏప్రిల్ నాటికి చెలామణి నుంచి తప్పించాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్టు చెప్పారని పలు మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.  కాగా,  ఇప్పటికే పాత నోట్ల స్థానంలో  రూ. 100, రూ. 10, రూ. 5 నోట్ల స్థానంలో కొత్త నోట్లు రావడం గమనార్హం. 


 

మరోవైపు, 10 రూపాయల నాణేన్ని తీసుకొచ్చి 15 ఏళ్లు అయింది. ఈ నాణేన్ని రద్దు చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో వ్యాపారులు ఈ నాణేన్ని తీసుకునేందుకు ఇప్పటికీ అంగీకరించడం లేదు. ఈ విషయంలో రిజర్వు బ్యాంకు పలుమార్లు వివరణ ఇచ్చింది. పది నాణేలను తీసుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.


అయినప్పటికీ, ఇప్పటికీ పది నాణేన్ని తీసుకునేందుకు ఎవరూ అంగీకరించడం లేదు. రిజర్వు బ్యాంకుకు ఇప్పుడిదో పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇప్పుడు పాత నోట్లను చెలామణి నుంచి తొలగిస్తున్నట్టు వస్తున్న వార్తలు జనాన్ని మరింత గందరగోళం లోకి నెట్టేశాయి. ఆర్‌బీఐకి ఇప్పుడు ఇది మరో కొత్త తలనొప్పిగా మారింది.

Updated Date - 2021-01-24T01:09:18+05:30 IST