కోరిక తీర్చలేదనే..

ABN , First Publish Date - 2021-05-09T05:42:39+05:30 IST

కామవాంఛ తీర్చాలని..

కోరిక తీర్చలేదనే..
వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాస్‌

వృద్ధురాలి హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో దారుణం

వివరాలు వెల్లడించిన కారేపల్లి రూరల్‌ సీఐ శ్రీనివాస్‌


కారేపల్లి(ఖమ్మం): కామవాంఛ తీర్చాలని ఒత్తిడి చేసినా.. అందుకు అంగీకరించకపోవడంతో ఓ వృద్ధురాలిని ఓ కామాంధుడు దారుణంగా హత మార్చిన సంఘటన ఇది. ఈ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె శరీరభాగాలను ముక్కలు చేసి.. పలు ప్రాంతాల్లో పడేసిన ఆ నరహంతకుడిని, అతడికి సహకరించిన భార్య, కుమారుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ దారుణఘటనకు సంబంధించిన వివరాలను కారేపల్లి రూరల్‌ సీఐ బాణాల శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భజ్యాతండాకు చెందిన అజ్మీర నాజీ(70) కారేపల్లి బస్టాండ్‌ సెంటర్లో యాచిస్తూ జీవిస్తోంది. ఆ వృద్ధురాలిపై కన్నేసిన కారేపల్లికి చెందిన 40ఏళ్ల వయసున్న అదెర్ల ఉపేందర్‌.. మద్యం తాగిస్తానని నమ్మబలికి ఆమెను మోటర్‌సైకిల్‌పై ఎక్కుంచుకుని కారేపల్లి మండల కేంద్రంలోని పితీరికుంట సమీపంలోని డొంకలోకి తీసుకెళ్లాడు.


మద్యం తాగించిన తరువాత తన కోరిక తీర్చాలని వత్తిడి చేశాడు. అందుకు ఆ వృద్ధురాలు అంగీకరించకుండా కేకలు వేయడం ప్రారంభించింది. దీంతో నిందితుడు ఉపేందర్‌ పక్కనే ఉన్న కర్రతో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. ఆ తర్వాత తన కుమారుడు కేశవరావును సంఘటన స్థలానికి పిలిపించి.. సదరు వృద్ధురాలు తనకు డబ్బులు ఇవ్వాలని, వాటిని అడిగితే తనపై దాడి చేయబోయిందని, దాంతో తాను కొట్టానంటూ ఆమెను మళ్లీ మోటర్‌సైకిల్‌పై తీసుకుని ఉపేందర్‌ ఇంటికి తీసుకవచ్చి గదిలో బంధించారు. కానీ రాత్రి సమయంలో వృద్ధురాలు పెద్దగా కేకలు వేస్తే తమగుట్టు ఎక్కడ బయట పడుతుందోనని భావించిన ఉపేందర్‌ వృద్ధురాలు ధరించిన చీరతోనే ఉరివేసి హతమార్చాడు. అయితే ఈ లోపు జరిగిన విషయాన్ని కేశవరావు.. తన తల్లి అనసూర్యకు తెలిపాడు. ఆమె కూడా విషయాన్ని దాచి ఉంచింది.


మరుసటి రోజు ఉదయం ఉపేందర్‌.. నాజీ కాళ్లుచేతులను గొడ్డలితో నరికి సంచిలో వేసుకుని మండల కేంద్రానికి 30కిలోమీటర్ల దూరంలోని ఈట్యాతండావద్ద ఓరైతు పత్తిచేలో చెత్తవేసి, అందులో వృద్ధురాలి కాళ్లుచేతులు వేసి మంటపెట్టి కాల్చి ఇంటికి తిరిగి వచ్చాడు. తలను వేరుచేసి బ్యాగులో పెట్టుకుని ఖమ్మం పట్టణానికి సమీపంలోని వైఎస్‌ఆర్‌ నగర్‌వద్ద గల ఎన్నెస్పీ కెనాల్‌లో నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో పడేసి ఇంటికి వచ్చాడు. అయితే నాజీని హత్యచేసి రెండు రోజులు కావడం, మొండెం అక్కడే ఉండటంతో ఇంటిపరిసరాల్లో దుర్వాసన వచ్చింది. దీంతో చుట్టుపక్కలవారు ఉపేందర్‌ కుటుంబసభ్యులను ప్రశ్నించగా.. రాత్రి అడవిపందిని ఇంటికి తీసకవచ్చానని చీకటి పడ్డాక ఊరికి దూరంగా పడేస్తామని గ్రామస్థులకు చెప్పారు. ఇక 26వతేదీ రాత్రి 8గంటల ప్రాంతంలో నాజీ మొండాన్ని పడవేసేందకు తన కుమారుడు కేశవరావును వెంటరావాలని ఉపేందర్‌ కోరాడు.


అందుకు అతను అంగీకరించకపోవడంతో వారిఇంటికి ఎదురుగా ఉన్న వ్యక్తిని సాయం కోరాడు. అడవి పంది వాసన వస్తోంది దూరంగా పడవేసి వద్దాం అని ఉపేందర్‌ కోరగా.. ఆ ఇద్దరూ కలిసి మద్యం తాగి.. అనంతరం మోటర్‌ సైకిల్‌పై బస్తాలో కట్టి ఉంచిన నాజీ మెండాన్ని మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం రైల్వేస్టేషన్‌కు సమీపంలో తీసుకవెళ్ళారు. తాను వెంట తీసుకెళ్లిన వ్యక్తిని దూరంగా వెళ్లమని చెప్పిన ఉపేందర్‌.. బస్తాలో ఉన్న మొండాన్ని బయటకు తీసి రైలు పట్టాలపై పడేశాడు. అప్పటికే ఆ దృశ్యాలను దూరం నుంచి గమనించిన తోడుగా వచ్చిన వ్యక్తి.. తాము తీసుకవచ్చింది పంది కళేబరం కాదని.. మహిళ శవంగా గుర్తించాడు. ఉపేందర్‌తో దీని గురించి ఏమీ మాట్లాడకుండా మోటర్‌ సైకిల్‌పై కారేపల్లి వచ్చిన అనంతరం ఆందోళనకు గురైన సదరు వ్యక్తి.. జరిగిన విషయాన్ని ఓ మిత్రుడికి వివరించాడు.


ఆ మిత్రుడు సలహాతో అదే రోజు రాత్రి పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ఈ క్రమంలో కారేపల్లి క్రాస్‌రోడ్డులో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అదెర్ల ఉపేందర్‌, అతడికి సహకరించిన అతని భార్య, అనసూర్య, కుమారుడు కేశవరావును శనివారం అరెస్టుచేసి కోర్టుకు రిమాండ్‌ చేసిన్నట్టు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో కారేపల్లి ఎస్‌ఐ సురేష్‌, ట్రెయినీ ఎస్‌ఐ వీరప్రసాద్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-05-09T05:42:39+05:30 IST