ఇదేందయ్యా ఇది... ఈమె వయసు ఆరేళ్లేనట!

ABN , First Publish Date - 2022-05-15T16:23:45+05:30 IST

ఇదేందయ్యా ఇది... ఈమె వయసు ఆరేళ్లేనట!

ఇదేందయ్యా ఇది... ఈమె వయసు ఆరేళ్లేనట!

  • ఏడాదిన్నరగా ఫించన్‌ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు
  • హౌస్‌హోల్డ్‌ సర్వేలో తప్పుగా నమోదు చేసిన వైనం
  • అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం శూన్యం

ఎన్టీఆర్ జిల్లా/చల్లపల్లి : అరవై ఏడేళ్ల వృద్ధురాలి వయసు ఆరేళ్లుగా (Six Years) హౌస్‌హోల్డ్‌ సర్వేలో తప్పుగా నమోదు చేయటంతో ఈమెకు ఫించన్‌ (Pension) నిలిపివేశారు. ఏడాదిన్నరగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. వృద్ధురాలి వేలిముద్రలు, ఐరిస్‌ పడకపోవటంతో సర్వేలో వయసును సరిచేసే అవకాశం లేక అధికారులు మిన్నకుండగా, జరిగిన తప్పును సరిచేసి పింఛన్‌ మంజూరు చేయాలంటూ వృద్ధురాలు వేడుకుంటోంది. కలెక్టర్‌ను కలిసే అవకాశం లేకపోగా, ఎమ్మెల్యే, ఎంపీలకు (Mla, MP) సమస్య విన్నవించినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు కొండపల్లి నాంచారమ్మ భర్త చనిపోయి ఏడాదిన్నర అవుతోంది. 


వితంతు పెన్షన్‌ వెంటనే వచ్చే అవకాశం ఉన్నా హౌస్‌ హోల్డ్‌ సర్వే లాగిన్లో నాంచారమ్మ వయసు కేవలం ఆరేళ్లుగా నమోదు చేయటం అవరోధంగా మారింది. హౌస్‌హోల్డ్‌ సర్వే సరిచేసేందుకూ, ఆధార్‌ ఈకేవైసీ చేసేందుకూ నాంచారమ్మ కళ్లు సరిగా కనబడకపోవటం, వేలిముద్రలు పడకపోవటంతో సమస్య పరిష్కారం కావటంలేదు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులైనా పరిష్కారం చూపుతారని వారిని స్వయంగా కలిసి విన్నవించినా న్యాయం జరగలేదని వాపోతోంది. సర్వే నమోదులో నిర్లక్ష్యం కారణంగా వృద్ధురాలికి ఏడాదిన్నరగా పింఛన్‌ నిలిచిపోయింది.


వేలిముద్రలు పడకపోయినా వలంటీరు వేలిముద్రలతో రేషన్‌ ఇచ్చిన విధంగా సచివాలయ అధికారుల వేలిముద్రల ఆధారంగానో, మరో ప్రత్యామ్నాయ మార్గాలతోనైనా హౌస్‌హోల్డ్‌ సర్వేలో వయసు సరిచేసే అవకాశం ఇస్తేనే గానీ వృద్ధురాలికి ఫించన్‌ మంజూరయ్యే అవకాశం లేదు. ఆ దిశగా ఉన్నతాధికారులు తగుచర్యలు తీసుకుని ఫించన్‌ మంజూరయ్యేలా చూడాలని వృద్ధురాలు నాంచారమ్మ విజ్ఞప్తి చేస్తోంది. వృద్ధురాలి సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, గ్రామ కార్యదర్శులు చెబుతున్నారు.

Updated Date - 2022-05-15T16:23:45+05:30 IST