వృద్ధండులు

ABN , First Publish Date - 2022-05-25T06:21:20+05:30 IST

వృద్ధండులు

వృద్ధండులు

బెజవాడ మత్తు మాఫియాలోకి వృద్ధులు

వయసు పైబడిన వారితో గంజాయి విక్రయాలు

పోలీసులకు చిక్కితే ఏమీ అనరనే ఆలోచనే..

బ్యాచిలర్‌ పార్టీలకు భారీగా సరఫరా

సత్యనారాయణపురంలో వృద్ధులు

కీలక ప్రాంతాల్లో మహిళలతో అమ్మకాలు 


రెండు రోజుల క్రితం ఇంజనీరింగ్‌ విద్యార్థులు గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. రాత్రి 12 గంటలకు మొదలైన పార్టీ ఒంటిగంట వరకు సాగింది. పార్టీలో విందులు, చిందులు అయ్యాక ఒక్కొక్కరూ హోటల్‌ నుంచి బయటకు వస్తున్నారు. అక్కడే మఫ్టీలో ఉన్న పోలీసులు బయటకు వస్తున్న వారిని పిలిచి ఆరా తీశారు. తనిఖీ చేయగా, ఒక విద్యార్థి జేబులో నుంచి కండోమ్‌ బయటపడింది. ఆ తర్వాత ప్రతి ఒక్కరినీ పోలీసులు తనిఖీ చేశారు. ఒక్కో విద్యార్థి ప్యాంటు జేబులో గోళీల్లాంటి పరిమాణంలో ఉన్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. గంజాయి ఎలా వచ్చిందని పోలీసులు ప్రశ్నించగా, సత్యనారాయణపురంలో ఓ వ్యక్తి పేరు చెప్పారు. పోలీసులు వాకబు చేయగా, విద్యార్థులకు గంజాయి విక్రయించింది ఓ వృద్ధుడని తేలింది.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : విజయవాడలో ‘మత్తు’ మార్గం కొత్త పుంతలు తొక్కుతోంది. యువతకు గంజాయి కిక్‌ను రుచి చూపించి కాసులు వెనుకేసుకోవడానికి అలవాటు పడిన మాఫియా.. పోలీసుల దూకుడుతో రూటు మార్చింది. వృద్ధులకు వల వేయడం మొదలుపెట్టింది. ఏ పనీ లేకుండా ఇళ్లను అంటిపెట్టుకుని ఉన్న వృద్ధులతో విక్రయాలు చేయిస్తోంది. కొనుగోలు చేసిన వారిలో ఎవరైనా పోలీసులకు చిక్కితే మాఫియా పేర్లు బయటకు రాకుండా చేసుకోవడానికి ఇదొక ఎత్తుగడ. ఒకవేళ పోలీసులు వృద్ధులను తీసుకెళ్లినా, లాఠీలకు పనిచెప్పే పరిస్థితి ఉండదు. పెట్టీ కేసు నమోదు చేసి వదిలేస్తారన్న భావనలో మాఫియా నడుస్తోంది. గాంధీనగర్‌లోని హోటల్‌లో 15 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు చేసుకున్న పార్టీలో గంజాయి ఛాయలు బయటపడ్డాయి. ఆ సరుకును సత్యనారాయణపురంలో ఓ వృద్ధుడి నుంచి కొనుగోలు చేసినట్టు విద్యార్థులు వెల్లడించారు. ఆ వృద్ధుడు ఇప్పటికే పలుమార్లు ఈ కేసుల్లో పోలీసులకు దొరికినట్టు సమాచారం. 

కృష్ణానది వద్ద మహిళలు

కృష్ణాతీరం వెంబడి మహిళలు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. పోలీసులు కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న ఫుట్‌ పెట్రోలింగ్‌లో పలువురు మహిళలను అరెస్టు చేశారు. వారంతా చీకటి పడ్డాక తాడేపల్లి నుంచి బయల్దేరి విజయవాడకు వస్తున్నారు. పీఎన్‌బీఎస్‌, రైల్వేస్టేషన్‌, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్టు తేలింది. గంజాయి మాఫియా అమ్మకాల్లో వృద్ధులను లాగడమే కాకుండా, పేదలకు చెందిన మహిళలనూ ఆకర్షిస్తున్నారని సమాచారం. ఇప్పటికే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జక్కంపూడి కాలనీకి చెందిన యామినేని వెంకటేశ్వరమ్మను అరెస్టు చేసి జైలుకు పంపారు. శాంతినగర్‌లో నలుగురు మహిళలు నిత్యం గంజాయి అమ్మకాల్లో మునిగి తేలుతున్నారని ప్రచారం నడుస్తోంది. నగరంలోని మెజారిటీ ప్రాంతాలకు వెంకటేశ్వరమ్మ, ఈ నలుగురు మహిళలు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-05-25T06:21:20+05:30 IST