చేప వయస్సు 226 ఏళ్లు.. వాళ్ల అమ్మమ్మ ఇచ్చిందట!

ABN , First Publish Date - 2021-02-25T15:32:03+05:30 IST

226 ఏళ్లు బతికిన చేప. మీరు చదివింది సరిగ్గానే. ఆ చేప అక్షరాల 226 ఏళ్లు జీవించింది.

చేప వయస్సు 226 ఏళ్లు.. వాళ్ల అమ్మమ్మ ఇచ్చిందట!

226 ఏళ్లు బతికిన చేప. మీరు చదివింది సరిగ్గానే. ఆ చేప అక్షరాల 226 ఏళ్లు జీవించింది. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి. మనిషి జీవితకాలం 100 ఏళ్లు అంటారు. తాబేలు 300 ఏళ్లకు పైన బతుకుతుందని చెబుతారు. ఇక శునకాల విషయానికి వస్తే 15 ఏళ్ల వరకు జీవిస్తాయి. కానీ చేప వయస్సు అంత ఉండదు అనే కదా మీ అనుమానం. సాధారణంగా చేపలలో కొన్ని 3-5 ఏళ్లు జీవిస్తే, అత్యధిక కాలం వెల్స్ క్యాట్ ఫిష్ 60 ఏళ్లు జీవిస్తుంది. ఇక చిత్రంలో కనిపిస్తున్న ‘కోయి’ జాతి చేపల జీవిత కాలం 40 ఏళ్లు. అయితే ఇక్కడ ఉన్న చేప రికార్డులను తిరగరాసింది. 226 ఏళ్లు జీవించింది. 


దీనిపేరు హనాకో. డాక్టర్ కోమెయి కోషిహరా దీన్ని పెంచుకునేవారు. 1751లో పుట్టిన ఇది... 1970ల వరకు జీవించింది. నగోయా మహిళా కళాశాల ప్రెసిడెంట్ అయిన కోషిహరా ఈ చేప గురించి తొలిసారి 1966లో ప్రపంచానికి తెలిపారు. నిప్పన్ హోసో క్యోకాయ్ రేడియో స్టేషన్‌లో మాట్లాడిన ఆయన.. తన కాలేజ్‌లో జంతువులపై పరిశోధనలు చేసే ప్రొఫెసర్ మసయూకి అమానో సాయంతో చేప వయస్సు తెలుసుకున్నట్టు చెప్పారు. హనాకో బరువు 7.5 కేజీలు కాగా, పొడవు 70 సెం.మీ. హనాకోను మరొక చేపతో పోల్చి చూడగా..  రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించగా... దాని వయస్సు బయటపడిందన్నారు. జంతుశాస్త్రంలో ఎక్స్‌పర్ట్ అయిన మసయూకీ... హనాకో గురించి పక్కాగా వివరాలు సేకరించారని తెలిపారు. తన అమ్మమ్మ దీన్ని తనకు ఇచ్చిందని, ఆమెకు ఆమె అత్తగారు ఇచ్చారని చెప్పారు. వాళ్ల పూర్వీకుల నుంచి దీన్ని పెంచుకుంటున్నారని... జాగ్రత్తగా చూసుకోమని సూచించిందని అన్నారు. అంతేగాక ఇది తనకు మంచి స్నేహితురాలని ఆనాటి తన రేడియో ప్రసంగంలో తెలిపారు. ఆ తర్వాత కొన్నేళ్లకు అది మరణించింది. ఈ రేడియో వార్త... తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చి... అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. 


జపాన్ వాస్తు శాస్త్రం ‘ఫెంగ్ షూయ్’ ప్రకారం కోయి చేపను అదృష్టానికి సూచికగా చెబుతుంటారు. బుద్ధిజంలో ధైర్యానికి మారు పేరు. 

Updated Date - 2021-02-25T15:32:03+05:30 IST