పతనం అంచున ఓలీ సర్కారు!

ABN , First Publish Date - 2020-07-06T07:08:33+05:30 IST

నేపాల్‌ రాజకీయం ముదిరి పాకాన పడింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాని కేపీశర్మ ఓలీ, ఆయనను అధికారంనుంచి తప్పించేందుకు మాజీ ప్రధాని ప్రచండ వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులతో రసకందాయంలో పడింది...

పతనం అంచున ఓలీ సర్కారు!

  • నేపాల్‌ ప్రధానిపై సొంత పార్టీలోనే అసంతృప్తి 
  • నేటి పార్టీ భేటీలో తేలిపోనున్న ఓలీ భవితవ్యం

కఠ్మాండూ, జూలై 5: నేపాల్‌ రాజకీయం ముదిరి పాకాన పడింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాని కేపీశర్మ ఓలీ, ఆయనను అధికారంనుంచి తప్పించేందుకు మాజీ ప్రధాని ప్రచండ వేస్తున్న ఎత్తుకు పై ఎత్తులతో రసకందాయంలో పడింది. ప్రధానిపై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొంది. సోమవారం జరగనున్న నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో ఓలీ భవితవ్యం తేలిపోనుంది. వివాదస్పద నిర్ణయాలతో ఓలీ వ్యతిరేకత మూటగట్టుకున్నారు.


కరోనా కట్టడిలో సరిగా వ్యవహరించలేకపోవడం, సంప్రదాయ మిత్రదేశంగా ఉన్న భారత్‌తో తగాదా పెట్టుకునేలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన మాటే నెగ్గాలన్న పట్టుదలతోనూ ఓలీ వ్యవహరించడంమే సంక్షోభం ఇంత ముదరడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఓలీ, ప్రచండ కలిసి 2018లో నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీని స్థాపించారు.   ఒప్పందం ప్రకారం వారు రెండున్నరేళ్ల చొప్పున అధికారం పంచుకోవాలి. మొదటగా ఓలీ అధికారం చేపట్టారు. తర్వాత 2019లో మరో ఒప్పందం చేసుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో పార్టీని ప్రచండ నడపాలని, పూర్తికాలం ఓలీనే ప్రధానిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఓలీ ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పార్టీపై కూడా పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రచండ వర్గం ఆరోపిస్తోంది. అందువల్ల 2018 ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు అయ్యాక ఓలీ తప్పుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.


ఓలీ అధికారం చేపట్టిన తర్వాత ఆయన వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. భారత భూభాగాలైన లిపులేఖ్‌, లింపియధురా, కాలాపానీలను తమ భూభాగాలుగా చూపిస్తూ మ్యాపులు విడుదల చేశారు. అంతేకాక నేపాల్‌లో కల్లోలం సృష్టించేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేశారు. వాస్తవానికి ఓలీ భవితవ్యం శనివారమే తేలిపోవాల్సి ఉంది. కానీ ఆరోజు జరగాల్సిన నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యనిర్వాహకవర్గ భేటీ సోమవారానికి వాయిదా పడింది. తనపై జరుగుతున్న కుట్రను సమర్థంగా ఎదుర్కొంటామని ఓలీ తెలిపారు. 


Updated Date - 2020-07-06T07:08:33+05:30 IST