Olympic medalist హాకీ ఆటగాడు Varinder singh కన్నుమూత

ABN , First Publish Date - 2022-06-28T19:48:41+05:30 IST

భారత హాకీ మాజీ ఆటగాడు, 1970వ దశకంలో రైట్-ఆఫ్ ఇండియన్ ప్లేయర్‌గా మంచి పేరు తెచ్చుకున్న వరీందర్ సింగ్ ..

Olympic medalist హాకీ ఆటగాడు Varinder singh కన్నుమూత

చండీగఢ్: భారత హాకీ మాజీ ఆటగాడు, 1970వ దశకంలో రైట్-ఆఫ్ ఇండియన్ ప్లేయర్‌గా మంచి పేరు తెచ్చుకున్న వరీందర్ సింగ్ (Varinder singh) మంగళవారం ఉదయం జలంధర్‌లో కన్నుమూశారు. 75 ఏళ్ల సింగ్ 1972లో మునిచ్ ఒలంపిక్స్ క్యాంస పతకం సాధించిన భారత హాకీ టీమ్‌ సభ్యుడిగా ఉన్నారు. 1947 మే 16న పంజాబ్‌లోని జలంధర్ సమీపంలో ఉన్న ధన్నోవాలి అనే గ్రామంలో ఆయన జన్మించారు. 1973లో వరల్డ్ కప్ వెండి పతకం గెలుచుకున్న హాకీ టీమ్‌లోనూ, 1975 వరల్డ్ కప్ విన్నింగ్ ఇన్నింగ్ హాకీ టీమ్‌లో కూడా ఆయన ఆడారు.


ఇండియన్ హాకీకి తీరని లోటు...

వరందీర్ సింగ్ మృతి పట్ల జలంధర్‌లోని సూర్జిత్ హాకీ అకాడమీ కోచ్ అవతార్ సింగ్ సంతాపం తెలిపారు. వరీందర్ మృతి పంజాబ్ హాకీతో పాటు భారత హాకీకి తీరని లోటని అన్నారు. 1970 దశకంలో దేశంలోని ఉత్తమ  రైట్-ఆఫ్ ప్లేయర్లలో ఆయన ఒకరని, హాకీ క్రీడ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన కోచింగ్ ద్వారా కూడా సేవలందించారని గుర్తుచేసుకున్నారు. పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ హాకీ టీమ్‌కు ఎనిమిదేళ్లగా పైగా కోచ్‌గా పనిచేశారని, 2008 నుంచి పంజాబ్ క్రీడా శాఖ కోచ్‌గా ఉన్నారని, గత ఏడాది ప్రైవేట్ అకాడమీలో చేరారని అవతార్ సింగ్ తెలిపారు.


కాగా, వరీందర్ సింగ్ మృతిపై హాకీ ఇండియా (Hockey India) విచారం వ్యక్తం చేసింది. 1976లో జరిగిన మాంట్రెయల్ ఒలంపిక్స్‌లో సింగ్ ఆడారని, 1974 ఆసియన్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న భారత హాకీ టీమ్‌లోనూ పాలుపంచుకున్నారని హాకీ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది.  2007లో ధ్యాన్ చంద్ జీవితసాఫల్యం అవార్డు (Dhyan Chand lifetime achievement award)ను వరీందర్ సింగ్ అందుకున్నారని గుర్తుచేసింది. ఆయన సాధించిన విజయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాకీ క్రీడాభిమానులు చిరకాలం గుర్తుంచుకుంటారని హాకీ ఇండియా తన సంతాప సందేశంలో తెలిపింది.

Updated Date - 2022-06-28T19:48:41+05:30 IST