Chennai Airportలో అప్రమత్తం

ABN , First Publish Date - 2021-12-02T16:39:55+05:30 IST

ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న ఒమైక్రాన్‌ ప్రభావం రాష్ట్రంపై పడకుండా వుండేలా రాష్ట్ర ఆరోగ్యశాఖ మరింత అప్ర మత్తమైంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా తదితర 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను

Chennai Airportలో అప్రమత్తం

- విదేశీ ప్రయాణికులకు ప్రత్యేక పరీక్షలు

- ఏర్పాట్లలో ప్రభుత్వం


ప్యారీస్‌(చెన్నై): ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న ఒమైక్రాన్‌ ప్రభావం రాష్ట్రంపై పడకుండా వుండేలా రాష్ట్ర ఆరోగ్యశాఖ మరింత అప్ర మత్తమైంది. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికా తదితర 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను విమానాశ్రయాల్లోనే క్షుణ్ణంగా పరీక్షించాకే రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఇందుకోసం విదేశీ ప్రయాణికులను నిశితంగా పరీక్షించేందుకు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక గదులు, ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌ సహా 12 దేశాల నుంచి నడుపుతున్న విమానాల ద్వారా చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబత్తూర్‌ విమానాశ్రయాలకు వచ్చే వారికి ఆయా విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితం వచ్చే వరకు వారు విమానాశ్రయాల్లో ఉండాల్సిందే. 6 గంటలు వేచి వుండి టెస్టులు ముగిసిన అనంతరం ప్రయాణికులు బయటకు వెళ్లవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఒమైక్రాన్‌ వేరియంట్‌పై జారీచేసిన హెచ్చరికల మేరకు రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఈ విధానం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. నేపథ్యంలో, చెన్నై విమానాశ్రయంలో నిబంధనలు విధిగా పాటించేలా ఎయిర్‌పోర్టు అధికారులు, విమాన సంస్థలు చర్యలు చేపట్టారు. మీనంబాక్కం విమానాశ్రయంలో ఒకేసారి 450 ప్రయాణికులు కూర్చునేలా కేటాయించిన ప్రత్యేక గదిలో సీటింగ్‌ కూడా ఏర్పాటైంది. అంతేకాకుండా, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు, శాంపిల్స్‌ సేకరణ, నగదు చెల్లింపుకు ప్రత్యేక వసతులు కల్పించారు. ప్రయాణికులకు అవగాహన కల్పించే విధంగా కరోనా వైరస్‌ నిబంధనలతో కూడిన సమాచార దృశ్యాలను స్ర్కీన్లలో ప్రసారం చేసే చర్యలను విమానాశ్రయ అధికారులు చేపట్టారు.

Updated Date - 2021-12-02T16:39:55+05:30 IST