ఒమైక్రాన్‌ మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం

ABN , First Publish Date - 2021-12-07T18:15:00+05:30 IST

ప్రస్తుతం కొవిడ్‌ కొత్త వైరస్‌ -ఒమైక్రాన్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని తీవ్రత ఎంత? దీని వల్ల ఎంత నష్టం జరుగుతుంది? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు దీనిని అడ్డుకోగలుగుతాయా? వంటి అనేక ప్రశ్నలు రోజూ

ఒమైక్రాన్‌ మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం

ఒమైక్రాన్‌‌తో మనకంత ప్రమాదం లేదు

ఒమైక్రాన్‌తో తీవ్ర లక్షణాలు ఉండవు

కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటివే ఎక్కువ

దక్షిణాఫ్రికాలో నెల రోజుల్లో ఒక్కరూ మరణించలేదు

వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం

మూడో వేవ్‌ పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందదు

‘ఆంధ్రజ్యోతి’తో ఏఐజీ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి


ప్రస్తుతం కొవిడ్‌ కొత్త వైరస్‌ -ఒమైక్రాన్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది.  దీని తీవ్రత ఎంత? దీని వల్ల ఎంత నష్టం జరుగుతుంది? ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు దీనిని అడ్డుకోగలుగుతాయా? వంటి అనేక ప్రశ్నలు రోజూ తలెత్తుతున్నాయి. అయితే ఒమైక్రాన్‌- మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరమంటున్నారు ప్రముఖ పరిశోధకులు, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఛైర్మన్‌, డాక్టర్‌ నాగేశ్వర రెడ్డి. ‘ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధ్యయనాలు, సమాచారం ఆధారంగా చూస్తే- ఒమైక్రాన్‌ వల్ల తీవ్రమైన వ్యాధి లక్షణాలు వచ్చే అవకాశమే లేదు’ అంటున్న  డాక్టర్‌ నాగేశ్వర రెడ్డితో ప్రత్యేక ఇంటర్వ్యూ..


ప్రపంచానికి ఒమైక్రాన్‌ భయం పట్టుకుంది. ఇది అంత ప్రమాదకరమైనదా?

ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం చూస్తే- ఒమైక్రాన్‌ అంత భయంకరమైన వైరస్‌ కాదు. మొదటి సారి ఒమైక్రాన్‌ను గత నెల 9వ తేదీన బొత్స్వానాలో గుర్తించారు. 11వ తేదీన దక్షిణాఫ్రికాలో కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇతర దేశాల్లో కూడా ఈ వైర్‌సను గుర్తించారు. దక్షిణాఫ్రికాలో ఈ కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. నేను దక్షిణాఫ్రికాలో ఉన్న నా స్నేహితులతో మాట్లాడాను. వారు అందించిన సమాచారం ప్రకారం- ఒమైక్రాన్‌ సోకితే- కీళ్లనొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదు. గత నెల రోజుల్లో దక్షిణాఫ్రికాలో ఒక్కరు కూడా మరణించలేదు. దీని ఆధారంగా చూస్తే- ఒమైక్రాన్‌ అంత తీవ్రమైన వైరస్‌ కాదు. 


అసలు ఈ ఒమైక్రాన్‌ ఎలా పుట్టింది?

కొవిడ్‌ వంటి వాటిని ‘ఆర్‌ఎన్‌ఏ వైర్‌సలు’ అంటారు. ఎప్పటికప్పుడు మార్పు చెందినప్పుడే ఇవి మనుగడ సాగించగలుగుతాయి. అందువల్ల వీటిలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటి మార్పులనే మనం ‘మ్యూటేషన్లు’ అంటాం. ఒమైక్రాన్‌లో ఇలాంటి 32 మ్యూటేషన్లు ఉన్నాయి. అంటే వైరస్‌ మారుతోందన్నమాట. ఇలా మారి మారి నెమ్మదిగా ప్రమాదరహితమయిపోతాయి. ఉదాహరణకు 1914లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ ఒక ఉదాహరణ. ఆ సమయంలో ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. అందువల్ల ఈ వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది.


దాదాపు 5 కోట్ల మంది చనిపోయారు. క్రమంగా ఈ వైర్‌సలో మార్పులు వచ్చాయి. 1918 నాటికి ఇది మామూలు ఫ్లూ (జలుబు) వైర్‌సగా మారిపోయింది. ఈ వైరస్‌ ఇప్పటికీ రూపాంతరం చెందుతూ ఉంటుంది. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో దీనిలో వచ్చిన మార్పుల ఆధారంగా కొత్త వ్యాక్సిన్‌లను విడుదల చేస్తూ ఉంటారు. ఈ కోణం నుంచి చూస్తే- ఒమైక్రాన్‌ మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. ఇదొక సహజసిద్ధమైన వ్యాక్సిన్‌. 


ఒమైక్రాన్‌ మనకు ఇతర దేశాల నుంచి వ్యాపించిందా?

ఒమైక్రాన్‌ ఎప్పటి నుంచి వ్యాపిస్తోందనే విషయం మనకు తెలియదు. కానీ గత నెల మాత్రమే దీనిని గుర్తించగలిగారు. దీనికి ఒక కారణముంది. కొవిడ్‌ వైర్‌సలకు రకరకాల యాంటీజెన్‌లు ఉంటాయి. ఇప్పటి దాకా వచ్చిన వైర్‌సలలో ‘ఎన్‌’, ‘ఈ’ యాంటీజెన్‌లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎక్కువ ఆర్టీపీఆర్‌ఎస్‌ కిట్‌లు ఈ రెండింటిని మాత్రమే గుర్తిస్తాయి.  ‘ఎస్‌’ యాంటీజెన్‌ను గుర్తించలేదు.  ఒమైక్రాన్‌లో ‘ఎస్‌’ యాంటీజెన్‌ కూడా ఉంది కాబట్టి జన్యుపరీక్షల ద్వారా దీనిని నిర్ధారించటానికి సమయం పట్టింది. అందువల్ల ఇది ఇతర దేశాల నుంచి వ్యాప్తి చెందిందా? అనే విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరు.


ఇది చాలా కాలం నుంచి వ్యాప్తిచెందుతూ ఉండవచ్చు. కానీ దాన్ని మనం గుర్తించకపోవచ్చు. ఉదాహరణకు ‘స్పానిష్‌ ఫ్లూ’ అనేది స్పెయిన్‌లో పుట్టలేదు. అక్కడ ఎక్కువ మందిని ప్రభావితం చేసింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా తెలివిగా- కొవిడ్‌ వైర్‌సలకు గ్రీకు వర్ణమాలలో ఉన్న అక్షరాల పేర్లను పెడుతోంది. దీని వల్ల ఒక ప్రాంతానికి చెడ్డపేరు వచ్చే అవకాశముండదు.


అన్ని ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు ఒమైక్రాన్‌ను గుర్తించలేవన్నారు కదా... మరి ఇది పెద్ద సమస్య కదా...

మన దేశంలో మూడు కంపెనీలకు చెందిన ఆర్టీపీసీఆర్‌ కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక కంపెనీ కిట్‌ మాత్రమే ఒమైక్రాన్‌ను గుర్తించగలుగుతుంది. ఒమైక్రాన్‌ వ్యాప్తి చెందుతోందని భావిస్తే- ఈ కిట్‌లనే ఎక్కువగా వాడటం మొదలుపెడతారు. నా ఉద్దేశంలో అది పెద్ద సమస్య కాదు. 


ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనికొస్తాయా?

లేదు. పనికి రావు. దీనికి కొత్త వ్యాక్సిన్‌ రూపొందించాల్సిందే. భవిష్యత్తులో మరొక మ్యుటేషన్‌ వస్తే దానికి తగిన వ్యాక్సిన్‌ను రూపొందించవలసి ఉంటుంది. అయితే ఒమైక్రాన్‌ తీవ్రత ఎక్కువగా లేదు కాబట్టి దీని వల్ల పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు.


మూడో వేవ్‌ వచ్చే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి కదా..

ప్రస్తుతం 90ు ప్రజల్లో యాంటీబాడీలు ఉన్నాయి కాబట్టి మూడో వేవ్‌ పూర్తి స్థాయిలో వ్యాప్తి చెందదు. గత ఏడాది 20 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు ఉన్నాయి కాబట్టి రెండో వేవ్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. 


బూస్టర్‌ డోస్‌లపై కూడా కొంత అస్పష్టత ఉంది. రెండో డోసులు అయినవారు బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే మంచిదేనా?

తప్పకుండా బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలి. మా ఆసుపత్రి (ఏఐజీ)లో చేసిన అధ్యయనాల్లో ఆరు నెలలకు యాంటీ బాడీల సంఖ్య తగ్గిపోతోంది. అందువల్ల బూస్టర్‌ డోస్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. బూస్టర్‌ డోస్‌ తప్పనిసరి కాదని కొందరు వాదిస్తున్నారు. శరీరంలో ఉండే ‘టీ’ సెల్స్‌ వల్ల ఇమ్యూనిటీ వస్తుందనేది వారి వాదన. అయితే ఇజ్రాయెల్‌లో జరిపిన అధ్యయనాలు ఈ వాదన సరికాదని చెబుతున్నాయి.


ఇజ్రాయెల్‌లో ప్రజలందరూ వ్యాక్సిన్‌లు వేయించుకున్నారు. ఈ మధ్య కాలంలో కొందరు బూస్టర్‌ డోస్‌లు కూడా వేయించుకున్నారు. ఇటీవల ఆ దేశంలో కూడా మళ్లీ వైరస్‌ సోకుతోంది. తాజాగా చేసిన అధ్యయనాల్లో బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నవారిలో తీవ్రత తక్కువ ఉంది. ఇలాంటి అధ్యయనాన్నే మన దేశంలో ఐసీఎంఆర్‌ చేసింది. 


ఇప్పటికీ 50 శాతం మంది రెండో డోస్‌ వేయించుకోలేదు కదా... అలాంటి పరిస్థితుల్లో బూస్టర్‌ డోస్‌ అంటే సమస్యలు రావా?

నా ఉద్దేశంలో ఒక వైపు రెండో డోస్‌ వేస్తూనే... మరో వైపు బూస్టర్‌ డోస్‌ను కూడా అందించాలి. మనకు ఆ సామర్థ్యం కూడా ఉంది. మన వద్ద ప్రజలందరికీ సరిపడిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఎక్కువ కాలం వాటిని ఉపయోగించకపోతే ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయి పనికిరాకుండా పోయే అవకాశముంది.  60 ఏళ్లు దాటిన వారికి... బీపీ, షుగర్‌ ఉన్నవారికి... మెడికల్‌ సిబ్బందికి వెంటనే బూస్టర్‌ డోస్‌లు వేయటం మొదలుపెట్టాలి. 


బూస్టర్‌ డోస్‌గా ఏ వ్యాక్సిన్‌ వేయుంచుకోవాలనే విషయంపై కూడా అస్పష్టత ఉంది కదా..

నా ఉద్దేశంలో మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ ఉత్తమం. అంటే గతంలో కోవిషీల్డ్‌ తీసుకున్నవారు.. ఈ సారి కోవ్యాక్సిన్‌ తీసుకోవాలి. దీనిపై కూడా మేము సమగ్ర అధ్యయనం చేశాం. రెండు వ్యాక్సిన్‌లు తీసుకోవటం వల్ల యాంటీబాడీల సంఖ్య పెరుగుతుందని తేలింది. 


ఎమ్‌.వి.వి.టి నిమయాలు

కొవిడ్‌ను నివారించటానికి మేము ఒక సూత్రాన్ని ప్రతిపాదించాం. దీనిని ఎంవీవీటీ అంటున్నాం...


మాస్క్‌ (ఎం)  తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి

వ్యాక్సినేషన్‌ (వి)  తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకోవాలి

వెంటిలేషన్‌ (వి)  ఇంట్లో గాలి, వెలుతురు చొరబడేలా చూసుకోవాలి

టెస్ట్‌ (టి) అనుమానం కలిగిన వెంటనే పరీక్ష చేయించుకోవాలి


అందుకే తక్కువ తీవ్రత

ఇటీవల దక్షిణాఫ్రికాలో మురుగు నీటిపై ఒక అధ్యయనం చేశారు. గతంలో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు - ఈ మురుగునీటిలో ఆర్‌ఎన్‌ఏ కణాల వ్యర్థాల సంఖ్య ఎక్కువగా ఉంది. గత నెల రోజుల్లో ఒమైక్రాన్‌ బయటపడిన  తర్వాత ఈ మురుగునీటిలో వ్యర్థాల సంఖ్య పెరిగింది. కానీ కేసుల సంఖ్య అంటే... ప్రజల నుంచి వ్యర్థాలు వస్తున్నాయి కానీ వారిపై ఇది తీవ్రమైన ప్రభావం చూపించటం లేదని అర్థం.


మనం గట్టివాళ్లమే!

జన్యువులపై ఇది ఎటువంటి ప్రభావం చూపదు. అంటే తల్లికి వచ్చినా- పిల్లలకు ఇది రాదు. అంతే కాకుండా మన భారతీయుల్లో ‘టి ఎస్‌ఎ్‌సఆర్‌ఎస్‌’ అనే జన్యువు ఉంటుంది. ఈ జన్యువు మనలో శతాబ్దాల నుంచీ ఉండిపోయింది. ఈ జన్యువు వల్లే కొవిడ్‌ ప్రభావం తీవ్రత మన మీద చాలా తక్కువ. కాబట్టే ప్రపంచవ్యాప్త మరణాలతో పోలిస్తే మన దేశంలో కొవిడ్‌ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. అమెరికాతో పోలిస్తే మన దేశంలో 30 శాతం తక్కువ. 


వచ్చే రెండు  వారాలు కీలకం

ఒమిక్రాన్‌ గురించిన కొన్ని అంశాల పట్ల అవగాహనకు మరో రెండు వారాల సమయం పడుతుంది. ఆ అంశాలు ఏవంటే...


ఈ వైరస్‌ ఎంత ప్రమాదకారి? 

ఉపయోగిస్తున్న యాంటీబాడీలను ఇది న్యూట్రలైజ్‌ చేస్తుందా?

వ్యాక్సిన్‌ న్యూట్రలైజ్‌ అవుతుందా?

వ్యాధి తీవ్రత ఎంత?


ఇంటర్వ్యూ: సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2021-12-07T18:15:00+05:30 IST