ఒమైక్రాన్‌ డబుల్‌ సెంచరీ

ABN , First Publish Date - 2021-12-22T10:08:54+05:30 IST

దేశంలో ఒమైక్రాన్‌ కేసులు 200 దాటాయి. మంగళవారం మహారాష్ట్రలోనే 11 కేసులు నమోదయ్యాయి. దేశంలో సోమవారం వరకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌లు 161 ఉన్నాయి. అయితే, ఢిల్లీలో

ఒమైక్రాన్‌ డబుల్‌ సెంచరీ

  • దేశంలో 200 దాటిన కొత్త వేరియంట్‌ కేసులు
  • ఢిల్లీలో ఒక్క రోజులో 26 పాజిటివ్‌లు నమోదు
  • మహారాష్ట్ర కేసుల్లో 81ు టీకా పొందిన వారే
  • కర్ణాటకలో కొత్త సంవత్సర వేడుకలపై నిషేధం
  • రాష్ట్రంలో మరో నాలుగు ఒమైక్రాన్‌ కేసులు
  • అమెరికాను కుదిపేస్తున్న ఒమైక్రాన్‌.. ఒకరు మృతి


న్యూఢిల్లీ, డిసెంబరు 21: దేశంలో ఒమైక్రాన్‌ కేసులు 200 దాటాయి. మంగళవారం మహారాష్ట్రలోనే 11 కేసులు నమోదయ్యాయి.  దేశంలో సోమవారం వరకు ఒమైక్రాన్‌ పాజిటివ్‌లు 161 ఉన్నాయి. అయితే, ఢిల్లీలో ఒక్క రోజే 26 కేసులు రావడంతో సంఖ్య భారీగా పెరిగింది. దేశ రాజధానిలో మొత్తం కేసులు 54కు పెరిగాయి. లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రి, మరో ప్రైవేటు ఆస్పత్రిలో పదిమంది చొప్పున చేరారు. సోమవారం వరకు దేశంలోని 11 రాష్ట్రాల్లో ఒమైక్రాన్‌ కేసులుండగా.. తాజాగా మరో రాష్ట్రంలో కేసు నమోదైంది. 77 మంది కోలుకున్నారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం వరకు మహారాష్ట్రలో నమోదైన 54   కేసుల్లో 81 శాతం (44 శాతం) బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లే (టీకా పూర్తిగా పొందినవారు).  ఒమైక్రాన్‌ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు పార్టీలు, సామూహిక కార్యక్రమాలపై కర్ణాటక నిషేధం విధించింది. 


వార్‌ రూమ్‌లను సిద్ధం చేసుకోండి

ఒమైక్రాన్‌  పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.  దీనిని అరికట్టేందుకు వార్‌ రూమ్‌లను సిద్ధం చేసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాశారు. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. వైరస్‌ నియంత్రణ కోసం అవసరమైతే నైట్‌ కర్ఫ్యూలు పెట్టాలని, జనం ఎక్కువగా పోగయ్యే కార్యక్రమాలపై నియంత్రణ విధించాలని.. కార్యాలయాలు, ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రజల సంఖ్యపై పరిమితులు విధించాలని సూచించారు.


సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటో ఉంటే..?

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ చిత్రాన్ని ముద్రించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. పనికిమాలిన పిటిషన్‌ వేసి విలువైన కాలాన్ని వృథా చేశారంటూ పిటిషనర్‌ పీటర్‌ మ్యాలిపరంపిల్‌కు రూ. లక్ష జరిమానా విధించింది. ‘‘ప్రధాని దేశానికి నాయకుడు. సర్టిఫికెట్‌పై ప్రధాని చిత్రం ఉంటే తప్పేంటి? ఆయన ఫోటో ఉన్నంత మాత్రాన కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను పౌరులు తమతో తీసుకెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరంలేదు’’ అని న్యాయమూర్తి జస్టిస్‌ పి.వి. కున్హికృష్ణ తెలిపారు.


పిల్లలకు టీకా ఇప్పుడే వద్దు

 ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు కొవిడ్‌ టీకా ఇవాల్సిన అవసరం లేదని టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా కమిటీ(ఎన్‌టీఏజీఐ) సభ్యుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ ములియిల్‌ అన్నారు. ఇదే సంగతిని కేంద్ర ప్రభుత్వానికి తెలిపామని వివరించారు. కాగా.. కొవిషీల్డ్‌ రెండు డోసుల వల్ల వచ్చే యాంటీ బాడీల రక్షణ 3 నెలల తర్వాత తగ్గిపోతోందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. స్కాట్‌లాండ్‌లో ఈ టీకా తీసుకున్నవారిలో 20 లక్షల మంది, బ్రెజిల్‌లో 4.2 కోట్ల మంది సమాచారాన్ని విశ్లేషించిన మీదట బూస్టర్‌ డోసులు అవసరమని తేలిందని  పరిశోధకుల్లో ఒకరైన గ్లాస్గోవర్సిటీ(యూకే) ప్రొఫెసర్‌ కటికిరెడ్డి శ్రీనివాస విఠల్‌ తెలిపారు.

Updated Date - 2021-12-22T10:08:54+05:30 IST