బూస్టర్ డోస్ కంటే Omicron ఇన్ఫెక్షన్‌తోనే మెరుగైన ఇమ్యూనిటీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

ABN , First Publish Date - 2022-05-16T22:38:20+05:30 IST

కరోనా మహమ్మారి పీడ ఇంకా విరగడ కాలేదు. ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. భారత్‌లోనూ ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

బూస్టర్ డోస్ కంటే Omicron ఇన్ఫెక్షన్‌తోనే మెరుగైన ఇమ్యూనిటీ.. తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు

న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినా కరోనా (Corona) మహమ్మారి పీడ ఇంకా విరగడ కాలేదు. ప్రపంచంలో ఏదో ఒక మూల కల్లోలం సృష్టిస్తూనే ఉంది. భారత్‌లోనూ ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆసక్తికరమైన ఓ అధ్యయనం వెలువడింది. వ్యాక్సినేషన్ పొందిన తర్వాత ఒమైక్రాన్ సోకినవారిలో కరోనా రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుందని బయటపడింది. బూస్టర్ డోస్ కన్నా మెరుగైన ఇమ్యూనిటీ లభిస్తోందని తేలింది. కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారు బయోఎన్‌టెక్ ఎస్‌ఈ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగింది. వ్యాక్సిన్ పొందిన జనాలకు ఒమైక్రాన్ వేరియెంట్ సోకితే ఉత్తత్తి అయ్యే యాంటీబాడీలు అధికంగా ఉంటున్నాయి. ఎక్కువ కొవిడ్ వేరియెంట్లతో పోరాడగలిగే ఇమ్యూనిటీ ఇలాంటివారిలో కనిపిస్తోందని అధ్యయనకారులు తేల్చారు.


యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇమ్యూనాలజీ డైరెక్టర్, ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న జాన్ వెర్రీ ఈ అధ్యయనాన్ని సమీక్షించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఒమైక్రాన్ సోకితే ఉత్పత్తి అయ్యే రోగనిరోధక శక్తి మరో బూస్టర్ డోసుకు సమానమని అన్నారు. ఇటివల ఒమైక్రాన్ వేరియెంట్ బారినపడ్డవారు బూస్టర్ డోస్ కోసం కొంతకాలం వేచిచూడొచ్చని సలహా ఇచ్చారు. ఒమైక్రాన్ సోకినవారి నాసిక శ్లేష్మంలోనూ యాంటీబాడీలు ఉన్నాయని తెలిపారు. దీంతో శరీరంలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే వైరస్‌ తన సామర్థ్యాన్ని కోల్పోతుందని విశ్లేషించారు. దీంతో ఒరిజినల్ వ్యాక్సిన్ల కంటే ఒమైక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనగల వ్యాక్సిన్‌ ఇవ్వడం ద్వారా మెరుగైన రోగ నిరోధకశక్తిని పొందొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనాల ఇమ్యూనిటీని పెంచేందుకు వేర్వేరు వ్యాక్సిన్లను బూస్టర్ డోస్‌గా ఇవ్వాల్సిన స్థితిలో ఉన్నామని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డేవిడ్ వీస్లెర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.


 ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధ్యయకారులు భరోసా కల్పించారు. బయోఆర్‌ఎక్స్‌ఐఆర్ సర్వర్‌పై అధ్యయనం ప్రీప్రింట్‌ను ప్రచురించారు. కాగా చైనా, ఉత్తరకొరియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మరోసారి కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధ్యయనం వెలుగుచూడడం గమనార్హం. కాగా 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2202 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అత్యధికంగా 513 కేసులు, కేరళలో 428, హర్యానా 302, మహారాష్ట్ర 255, ఉత్తరప్రదేశ్‌లో 153 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-05-16T22:38:20+05:30 IST