కొవిడ్‌ సమస్యలపైనే...

ABN , First Publish Date - 2021-05-11T04:59:38+05:30 IST

సోమవారం కలెక్టర్‌ టెలీ స్పందనకు వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 మంది తమ సమస్యలు విన్నవించుకున్నారు.

కొవిడ్‌ సమస్యలపైనే...
టెలీ స్పందనలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

టెలీ స్పందనకు వినతుల వెల్లువ

చర్యలు తీసుకున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

(కలెక్టరేట్‌)

కొవిడ్‌తో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతుంటే అధికంగా వసూలు చేస్తున్నారు. బెడ్ల కృత్రిమ కొరత సృష్టించి దోచుకుంటున్నారు. వ్యయ ప్రయాసలకు గురవుతున్నాం. దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలి.

కరోనా నిర్థారణ పరీక్షలకు సంబంధించి సకాలంలో ఫలితాలు రావడం లేదు. రోజుల తరబడి జాప్యం జరుగుతోంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. త్వరితగతిన ఫలితాలు వచ్చేలా చూడాలి.

వ్యాక్సిన్‌ కోసం పడిగాపులు కాస్తున్నాం. మండలంలో ఏదో ఒక కేంద్రంలో మాత్రమే ఇవ్వడంతో వ్యయప్రయాసలకు గురవుతున్నాం. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టాలి.  ఇలా సోమవారం కలెక్టర్‌ టెలీ స్పందనకు వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 24 మంది తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఇందులో కరోనా సమస్యలనే ఎక్కువ మంది ప్రస్తావించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో అక్రమ వసూళ్లు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో జాప్యం, మొదటి డోసు వేసుకున్నవారికి రెండో డోసు వేయకపోవడం, కొవిడ్‌ పరీక్షలు చేసుకున్నాక ఫలితాలకు రోజుల తరబడి జాప్యం జరుగుతుండడం వంటి సమస్యలను అర్జీదారులు ఏకరవు పెట్టారు. ప్రధానంగా వ్యాక్సిన్‌ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని..పీహెచ్‌సీల పరిధిలో గ్రామాల వారీగా వేయాలని ఎక్కువ మంది అభ్యర్థించారు. గడువు సమీపిస్తున్నా రెండో డోసు వేయడం లేదని మరికొంత మంది ప్రస్తావించారు. సమస్యలపై కలెక్టర్‌ స్పందించారు. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేయాలని జేసీ మహేష్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వసూళ్లపై కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే ఆస్పత్రికి ఒక నోడల్‌ అధికారిని నియమించినట్టు తెలిపారు. వారు స్పందించకపోతే జేసీ మహేష్‌కుమార్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులపై మరింత పర్యవేక్షణ, నిఘా పెంచాలని జేసీని ఆదేశించారు. నిర్థారణ పరీక్షల ఫలితాల్లో జాప్యాన్ని నియంత్రించాలని...24 గంటల్లో ఫలితాలు వచ్చేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కొవిడ్‌ ప్రత్యేకాధికారి సత్యనారాయణ, జేసీ మహేష్‌కుమార్‌, డీఆర్వో గణపతిరావు పాల్గొన్నారు. 

 విధులకు మాస్క్‌తో రండి

జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులంతా తమ కార్యాలయాల్లో విధులకు హాజరైనప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం, సీట్ల మధ్య భౌతిక దూరం పాటించడం వంటి చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉన్న రెవెన్యూ, విద్యా, ట్రెజరీ కార్యాలయాలను ఆయన సోమవారం పరిశీలించారు. ఉద్యోగులు మాస్క్‌లు వినియోగిస్తున్నారా? శానిటైజర్‌ వాడుతున్నారా? లేదా? అనేది పరిశీలించారు. మాస్క్‌ లేనిదే ప్రవేశం లేదని నోటీస్‌ బోర్డులో పెట్టాలని సూచించారు. ఉద్యోగులంతా వ్యాక్సిన్‌ వేసుకోవాలన్నారు. కొవిడ్‌ దృష్ట్య్టా బయోమెట్రిక్‌ హాజరు సెస్పెండ్‌ చేశామని చెప్పారు. సమావేశాలకు ప్రత్యక్షంగా పిలవకుండా టెలీకాన్ఫరెన్సులు నిర్వహించాలని ఆదేశించారు. దివ్యాంగులు, గర్భిణులైన ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డీఆర్‌వో గణపతిరావు, డీఈవో నాగమణి ఉన్నారు. 

నిష్పక్షపాతంగా ఆరోగ్య మిత్రల సేవలు

జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు యాజమాన్యాల పక్షాన కాకుండా రోగుల పక్షాన నిలబడి నిష్పక్షపాతంగా సేవలందించాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు.  ఆరోగ్య మిత్రలతో  సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు సేవలందించడంలో మిత్రల పాత్ర చాలా కీలకమని, వారంతా యాజమాన్యాలకు కొమ్ము కాయకుండా రోగుల తరఫున పనిచేయాలని ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అదనపు డబ్బులు వసూలు చేయకుండా చూడాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఏ ఆసుపత్రిలో అయినా ఎలాంటి సమస్య ఉన్నా.. అవకతవకలు జరిగినా నేరుగా తనని సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో జేసీ మహేష్‌కుమార్‌, జిల్లా వైద్యాధికారి రమణకుమారి, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ కర్త అప్పలరాజు తదితరులు ఉన్నారు.




Updated Date - 2021-05-11T04:59:38+05:30 IST