రాష్ట్ర ఆర్థికంలో ప్రతిష్ఠంభన!

ABN , First Publish Date - 2022-05-06T08:08:44+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిష్ఠంభన నెలకొంది. అటు అప్పులు పుట్టక, ఇటు వ్యయ భారం పెరిగి ప్రభుత్వం సతమతమవుతోంది. రాబడిని.. పథకాలు, కార్యక్రమాలకు..

రాష్ట్ర ఆర్థికంలో ప్రతిష్ఠంభన!

అప్పులు పుట్టవాయె.. పథకాలు ఆగవాయె

16 జిల్లాల ఉద్యోగులకు అందని వేతనాలు

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో

రూ.13 వేల కోట్ల అప్పునకు ప్రతిపాదనలు

కేంద్రం వివరాలు కోరడంతో నిలిచిన అప్పులు


హైదరాబాద్‌, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిష్ఠంభన నెలకొంది. అటు అప్పులు పుట్టక, ఇటు వ్యయ భారం పెరిగి ప్రభుత్వం సతమతమవుతోంది. రాబడిని.. పథకాలు, కార్యక్రమాలకు సర్దుబాటు చేయాలో, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, పాత అప్పుల వడ్డీలకు కేటాయించాలో తెలియక అయోమయంలో ఉంది. ఈసారి బడ్జెట్‌ను సైతం భారీగా రుణాలపై ఆధారపడి ప్రతిపాదించడంతో ఈ సమస్య నెలకొంది. రుణాలపై కేంద్రం ఆరా తీస్తుండడం, ఏప్రిల్‌ గడిచినా.. బహిరంగ మార్కెట్‌ నుంచి పైసా అప్పు పుట్టకపోవడంతో ఖజానా విలవిల్లాడుతోంది. ఉద్యోగులకు జీతాల చెల్లింపులో తంటాలు పడాల్సి వస్తోంది. 33 జిల్లాలకుగాను గురువారం వరకు 17 జిల్లాల ఉద్యోగులకే జీతాలిచ్చారు. అప్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.


ఎందుకీ దుస్థితి? 

రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల మార్కెట్‌ రుణాలు తీసుకోవడం సర్వసాధారణం. కేంద్ర ప్రభుత్వ అనుమతితో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ద్వారా సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి రాష్ట్ర అభివృద్ధి రుణాల(ఎస్‌డీఎల్‌) పేరిట వీటిని సేకరిస్తుంటాయి. కానీ, ఈసారి కేంద్రం మెలిక పెట్టింది. రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేసి.. వాటితో ఉచిత పథకాలను అమలు చేస్తూ క్రమేణా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితిని ఉటంకించింది. దీనికితోడు రాష్ట్రాల అప్పులు, ఉచిత పథకాలపై ప్రధాని మోదీకి సీనియర్‌ అధికారులు వివరించడంతో అప్రమత్తమైన కేంద్రం వెంటనే వివరాలు కోరింది. బడ్జెట్‌కు లోబడి తీసుకుంటున్న రుణాలు ఎంత..? బడ్జెటేతర రుణాలు ఎంత..? వివిధ కార్పొరేషన్ల పేర తీసుకుంటున్న గ్యారంటీ రుణాలు ఎంత? వేటికి వ్యయం చేస్తున్నారు? తెలపాలని కోరింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం వివరాలు పంపించింది. మొదటి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో మొత్తం రూ.13 వేల కోట్ల అప్పు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి ప్రతిపాదించింది. కానీ, వీటికి కేంద్రం అనుమతి లభించడం లేదు. అలా.. ఏప్రిల్‌లో రూ.3 వేల కోట్ల రుణం రాకుండా పోయింది. మేలో మూడు దఫాలుగా రూ.8 వేల కోట్లు తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఈ నెల 2న తీసుకోవాల్సిన రూ.3 వేల కోట్లు రాలేదు. జూన్‌లో రెండుసార్లు రూ.వెయ్యి కోట్లు చొప్పున తీసుకోవాల్సి ఉంది. అంటే.. త్రైమాసికంలో నిర్దేశిత రూ.13వేల కోట్ల రుణంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లకు గడువు మీరిపోయింది. మిగిలిన కాలానికి రూ.7 వేల కోట్లయినా పుడతాయా? అంటే.. తెలియని పరిస్థితి నెలకొంది.


అప్పులను నమ్ముకుని భారీ బడ్జెట్‌

2022-23 ఆర్థిక సంవత్సరానికి.. ప్రభుత్వం అప్పులను నమ్ముకునే రూ.2.56 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఇందులో దళిత బంధు కు రూ.17,700 కోట్లు, రైతు బంధుకు రూ.14,800 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.11,728 కోట్లు, మన ఊరు- మన బడికి రూ.3 వేల కోట్లకు పైగా కేటాయించింది. కేంద్ర గ్రాంట్లు, రాష్ట్ర రాబడులపై ఆధారపడి ఇంత పెద్ద బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. అందుకే అప్పులను నమ్ముకుంది. ఈసారి మార్కెట్‌ రుణాల కింద రూ.53,970 కోట్లు, గ్యారంటీ రుణాల కింద రూ.12,198 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్‌ రుణాలు రూ.53 వేల కోట్లలో ఇప్పటికే రూ.6వేల కోట్లు చేజారిపోయాయి. మిగతావాటికి కేంద్రం అడిగిన వివరాలన్నింటినీ అందించాల్సిందే. ప్రభుత్వం ఆ వివరాలను సక్రమంగా అందించిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. 


ఆర్థికానికి కటకట

రుణ సమీకరణకు కేంద్రం నుంచి ఆటంకాలు ఎదురవుతుండడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిష్ఠంభన నెలకొంది. పథకాలు, వేతనాలు, పింఛన్లు, వడ్డీలకు నిధులు సర్దడం ఇబ్బందిగా మారింది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.2,500 కోట్లు, సర్వీసు పింఛనర్లకు రూ.1,166 కోట్లు, వడ్డీలకు రూ.1,700 కోట్లు చెల్లిస్తుంది. వివిధ పథకాలకు మరో రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లు సర్దుబాటు చేయాలి. అంటే, నెలవారి వ్యయం రూ.13 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు. రాబడులు కూడా అప్పులను కలుపుకొని ఇంతే స్థాయిలో ఉంటాయి. అప్పులు పుట్టకపోతే ప్రభుత్వంపై భారం పెరుగుతోంది. ఇప్పు డిదే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్‌, మేలో రూ.6 వేల కోట్ల లోటు ఏర్పడింది.


అంతా బహిరంగమే అంటున్న ఆర్థిక శాఖ

ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి అప్పులు తెస్తున్నామని.. వాటి వివరాలను కేంద్రానికి సమగ్రంగా నివేదించామని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం జీఎ్‌సడీపీలో 25 శాతానికి అప్పులు మించవద్దని.. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మేరకే అప్పులు తెచ్చామంటున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా 25 శాతానికి మించకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పాయి. అయితే, కేంద్రం మాత్రం గ్యారంటీ అప్పులను కూడా ఇందులో కలిపి ప్రశ్నిస్తోంది. బడ్జెట్‌ రుణాలను పరిశీలిస్తే ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి ఉంటున్నాయని, వివిధ కార్పొరేషన్లకు ఇప్పించే గ్యారంటీ రుణాలను కలుపుకొంటే నిబంధనలు దాటిపోతున్నాయని పేర్కొంటోంది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మితిమీరి అప్పులు చేస్తున్నట్లు అర్థమవుతోందని, ఇలా గ్యారంటీ రుణాలను దేనికి వినియోగిస్తున్నారు? అవి ఉత్పాదక రంగానికి ఉపయోగపడుతున్నాయా? అని ప్రశ్నిస్తోంది. కాగా, అప్పులు ‘ఓపెన్‌ డాక్యుమెంట్‌’ అని, ఎప్పటికప్పుడు ‘కాగ్‌’కు సమర్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాపరికం లేకుండా కేంద్రం అడిగిన వివరాలను ఇటీవలే సమర్పించామని వివరించాయి. అయితే, ఏమేం వివరాలను కేంద్రం అడిగింది, రాష్ట్రం ఏమి సమర్పించింది అన్నది తెలియాల్సి ఉంది.

Read more