Bihar: 20 ఏళ్లుగా పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే.. నేపాల్ సరిహద్దులో అదుపులోకి!

ABN , First Publish Date - 2022-08-19T21:56:05+05:30 IST

బీహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ(Ranjan Tiwary) కోసం 20 సంవత్సరాలుగా వెతుకుతున్న పోలీసుల

Bihar: 20 ఏళ్లుగా పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే..  నేపాల్ సరిహద్దులో అదుపులోకి!

మోతిహరి: బీహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ(Ranjan Tiwary) కోసం 20 సంవత్సరాలుగా వెతుకుతున్న పోలీసుల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులపై  కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ నిందితుడిగా ఉన్నారు. ఆయన తలపై రూ. 25 వేల రివార్డు కూడా ఉంది. ఆయన కోసం రెండు దశాబ్దాలుగా అలుపెరగకుండా గాలిస్తున్న పోలీసులకు ఎట్టకేలకు ఆయన ఇండియా-నేపాల్ సరిహద్దులోని రక్సౌల్‌(Raxaul)లో పట్టుబడ్డారు. ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులతో కూడిన బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. 


బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లా గోవింద్‌గంజ్ మాజీ ఎమ్మెల్యే అయిన రంజన్ తివారీ 1998లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌(Gorakhpur)లో పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం పరారైన ఆయన ఆచూకీ అంతుచిక్కుకుండా పోయింది. అయితే యూపీ పోలీసులు మాత్రం రెండు దశాబ్దాలుగా ఆయన కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆచూకీ చెప్పిన వారికి రూ. 25వేల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ తెలియరాలేదని ఈస్ట్ చంపారన్ ఎస్పీ కుమార్ ఆశిష్ తెలిపారు. రంజన్ తివారీ తాజాగా భారత్-నేపాల్ సరిహద్దులో పట్టుబడినట్టు చెప్పారు. ప్రాథమిక లాంఛనాలు పూర్తిచేసిన అనంతరం ఆయనను యూపీ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. రంజన్ తివారీ రక్సౌల్ మీదుగా కఠ్మాండు పారిపోవాలని ప్లాన్ చేశారని రక్సౌల్ ఎస్పీ చంద్ర ప్రకాశ్ తెలిపారు.

Updated Date - 2022-08-19T21:56:05+05:30 IST