ముందస్తు బాటలో

ABN , First Publish Date - 2021-07-27T06:23:00+05:30 IST

పదవీ కాలం ముగియకుండానే సీఎం కేసీఆర్‌ గతంలో తొమ్మిది నెలలు ముందుగానే 2018లో సాధారణ ఎన్నికలకు వెళ్లారు.

ముందస్తు బాటలో

 ఎమ్మెల్యేలుగానే బరిలో ఉంటామంటున్న ఉత్తమ్‌, కోమటిరెడ్డి
 ఉమ్మడి జిల్లాలో మంత్రి జగదీ్‌షరెడ్డి విస్తృత పర్యటనలు
 నిర్మాణం, పోరాటాలపై కామ్రేడ్ల నజర్‌
 నేడు చండూరులో షర్మిల దీక్ష

నల్లగొండ, జూలై 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
పదవీ కాలం ముగియకుండానే సీఎం కేసీఆర్‌ గతంలో తొమ్మిది నెలలు ముందుగానే 2018లో సాధారణ ఎన్నికలకు వెళ్లారు. దీంతో వచ్చే శాసనసభ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు తొమ్మిది నెలలు ముందుగానే అంటే 2023లో నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా 2024లో నిర్వహించే జమిలి ఎన్నికలకు దూరంగా ఉండాలనేది గులాబీ బాస్‌ వ్యూహం. రాష్ట్రంలో శాసనసభ గడువు ముందుగానే ముగుస్తున్నా, జమిలి ఎన్నికలకు వెళ్లేందుకే బీజేపీ మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో మరోమారు ముందస్తు ఎన్నికలు నిర్వహించకుండా నిలువరించాలని బీజేపీ చూస్తోంది. అయితే జమిలి ఎన్నికలకు దూరంగా ఉండాలంటే మరో ఐదు నెలలు ముందుగానే సీఎం కేసీఆర్‌ సాధారణ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే సాధారణ ఎన్నికలు ఏడాదిన్నరలోపు అంటే 2022-23 మధ్యలో ఉంటాయన్న చర్చ రాజకీయ పార్టీల్లో మొదలైంది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల అధ్యక్షులు వారివారి స్థాయిల్లో కార్యక్రమాలను వారం రోజులుగా ముమ్మరం చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా రాజకీయ సందడి కనిపిస్తోంది.
ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డి అసెంబ్లీ బరిలోనే!
వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే బరిలో ఉంటానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందస్తుగా ప్రకటించారు. నియోజకవర్గ పార్టీ శ్రేణులు ఏ మాత్రం అధైర్య పడాల్సిన పనిలేదని, ఇకపై నిత్యం అందుబాటులో ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలను ఎదుర్కొంటానని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. అంటే వచ్చే ఎన్నికలకు పని మొదలుపెట్టినట్టేనని ఆయన పరోక్షంగా చెప్పారు. ఉత్తమ్‌ ప్రకటనకు ఒకరోజు ముందే నల్లగొండ జిల్లా కేంద్రంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇకనుంచి వారంలో రెండు రోజులు నల్లగొండలో అందుబాటులో ఉంటాన ని ఆ సందర్భంగా కోమటిరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలో అందుబాటులో ఉంటే నకిరేకల్‌ నుంచి దేవరకొండ వరకు కాంగ్రెస్‌ కార్యకర్తలను కలుసుకునే అవకాశం ఉంటుందని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. ఉత్తమ్‌సాక్షిగా, నల్లగొండలోనే ఉంటానని వెంకట్‌రెడ్డి ప్రకటించగా,ఆయన సైతం చిరునవ్వుతో స్వాగతించారు. అంటే వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఉత్తమ్‌ హుజూర్‌నగర్‌, వెంకట్‌రెడ్డి నల్లగొండ నియోజకవర్గ కేంద్రంగా పనిచేస్తామని చెప్పకనే చెప్పారు.
మంత్రి జగదీ్‌షరెడ్డి విస్తృత పర్యటనలు
మంత్రి జగదీ్‌షరెడ్డి ఉమ్మడి జిల్లాలో కొంత కాలంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరోనా ఉధృతంగా ఉన్న కాలంలోనూ తగిన జాగ్రత్తలతో ప్రణాళికాబద్ధంగా ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పల్లె, పట్టణ ప్రగతి, రేషనకార్డుల పంపిణీ అంతకుముందు ధాన్యం కొనుగోలుపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షలు, కరోనా వైద్య సేవల తీరును పరిశీలించేందుకు మూడు జిల్లాలో ఆస్పత్రుల సందర్శన వంటి వరుస కార్యక్రమాలు నిర్వహించారు. మరోవైపు జిల్లా ఎమ్మెల్యేల అందరితో కలిసి ప్రగతి భవనకు వెళ్లడం, భవిష్యత్తునేత కేటీఆర్‌ను కలవడం, తామంతా ఏకతాటిపై ఉన్నామనే సంకేతాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి అధిష్ఠానానికి పలుమార్లు స్పష్టం చేశారు. పార్టీ ఎమ్మెల్యే లేని మునుగోడు వంటి నియోజకవర్గాల్లోనూ విపక్షాలకు అవకాశం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు.
నిర్మాణంపై కామ్రేడ్ల నజర్‌
గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పార్టీ శాఖల నిర్మాణం, సభ్యత్వం, రాజకీయ శిక్షణ తరగతులతో సీపీఎం, సీపీఐ నిత్యం బిజీగా ఉంటాయి. మరోవైపు ప్రజా ఆందోళనలకు పిలుపునిస్తుంటాయి. కరోనా కారణంగా ఏడాదిన్నర కాలంగా పార్టీ శాఖలు కొవిడ్‌ బాధితులకు సేవలు మినహా పోరాటాలు, నిర్మాణాలపై దృష్టి నిలపలేకపోయాయి. తాజాగా పార్టీ శాఖల నిర్మాణంపై కామ్రేడ్లు దృష్టిపెట్టారు. సీపీఐ ఇప్పటికే ప్రాజెక్టుల పోరుబాట పేరుతో ఆందోళనలకు పిలుపునిచ్చింది.
వేగం                     పెంచిన బీజేపీ
బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డిని సీనియర్‌ నేతలు విభేదించడం, జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండటంలేదని, అసమ్మతి నేతలు బహిరంగ సమావేశం నిర్వహించి ఆయన్ను తొలగించాలని అధిష్ఠానానికి ఫిర్యాదులు చేశారు. సాగర్‌ ఉప ఎన్నికలో టికెట్‌ దక్కకపోవడంతో కంకణాల కుటుంబం డీలాపడింది. సాగర్‌లో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో నష్టం జరిగిందని కంకణాల కుటుంబం గుర్తించి అధ్యక్ష బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధమైంది. నల్లగొండలో ఇల్లు తీసుకొని సీనియర్‌ నేతలను అందరినీ కలిసి తనకు సహకరించాల్సిందిగా ఆయన కోరుతున్నారు. మరోవైపు ఆందోళనలు నిర్వహిస్తూ జనంలో ఉంటున్నారు.

Updated Date - 2021-07-27T06:23:00+05:30 IST