మరోసారి...!

ABN , First Publish Date - 2021-01-14T08:54:37+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి ఇంకా పట్టుమని పదిరోజులు కూడా లేదు, డొనాల్డ్‌ ట్రంప్‌ మరో అభిశంసన ఎదుర్కుంటున్నారు...

మరోసారి...!

అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి ఇంకా పట్టుమని పదిరోజులు కూడా లేదు, డొనాల్డ్‌ ట్రంప్‌ మరో అభిశంసన ఎదుర్కుంటున్నారు. పార్లమెంటు భవనంపై జరిగిన మూకదాడిఘటనలో జనాన్ని రెచ్చగొట్టి, విధ్వంసాన్ని ప్రేరేపించినందుకు డెమోక్రాట్లు ఆయనను అభిశంసిస్తున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన, అవమానకరమైన ఘటనకు బాధ్యుడైన ట్రంప్‌ను క్షమించకూడదన్న పట్టుదలలో విపక్షం ఉన్నది. ఎలాగూ దిగిపోతున్నాడు కదా అని ట్రంప్‌ను వీరు వదిలేయదల్చుకోలేదు. బైడెన్‌ బాధ్యతలు స్వీకరించేవరకూ కూడా ట్రంప్‌ అధికారంలో కొనసాగడానికి అనర్హుడని డెమోక్రాట్ల వాదన. అధ్యక్షుడు తన విధులను సవ్యంగా నిర్వర్తించలేని అత్యంత కష్ట, క్లిష్టకాలాల్లో మాత్రమే ప్రయోగించే ‘ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ’ ను వినియోగించి, ట్రంప్‌ను తప్పించి, ఈ పదిరోజులూ నువ్వు దేశాన్ని ఏలు అంటూ ఉపాధ్యక్షుడి మీద విపక్షం ఒత్తిడి తెచ్చింది. సహజంగానే మైక్‌ పెన్స్‌ అందుకు నిరాకరించడం, అయినా, ప్రతినిధుల సభ ౧౮ ఓట్ల ఆధిక్యంతో తన ఈ అభీష్టాన్ని తీర్మానించడం కూడా జరిగిపోయాయి. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు ఆధిక్యం ఉన్నందునా, ట్రంప్‌ను ఇంతకాలం మోసిన పాపాన్ని ఈ సందర్భంలో ఎంతోకొంత కడిగేసుకోవాలని రిపబ్లికన్లలో కూడా కొంతమంది భావిస్తున్నందునా అభిశంసన తీర్మానం కచ్చితంగా నెగ్గుతుంది. సెనేట్‌లో నిలుస్తుందా వీగుతుందా అన్నది అటుంచితే, అమెరికా చరిత్రలో రెండోసారి అభిశంసనకు గురైన మచ్చమాత్రం ట్రంప్‌కు తప్పదు. 


వారం క్రితం కాపిటల్‌ భవనంపై జరిగిన దాడి అమెరికా సమాజాన్ని అవమానంలోనూ, మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యంలోనూ ముంచెత్తితే, ట్రంప్‌ మాత్రం ఘటన అనంతరం కూడా తన వైఖరి సవరించుకోలేదు. ఎన్నికల ఫలితాలను తారుమారుచేయమని చట్టసభ సభ్యులను ఒత్తిడిచేయడం, బెదిరించడం, పార్లమెంటుమీదకు తన మద్దతుదారులను ఉసిగొల్పడం వంటి చర్యలను ఆయన నిర్లజ్జగా సమర్థించుకుంటూనే ఉన్నారు. ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగింది కనుకనే, జో బైడెన్‌, కమలా హారిస్‌ విజయాలను ఖరారు చేసే కీలక ప్రక్రియ పార్లమెంటులో జరుగుతున్న తరుణంలో, తన మద్దతుదారులను తరలిరమ్మన్నానని ఆయన ఇప్పటికీ వాదిస్తున్నాడు. కానీ ఆయన అభిమానులు జేజేలకు, నినాదాలకు పరిమితం కాలేదు. పార్లమెంటు భవనంలోపలకు చొరబడి తీవ్ర విధ్వంసం సృష్టించారు. స్పీకర్‌ సహా శాసనకర్తలంతా ప్రాణభయంతో బంకర్లలోకి పరుగులు తీసేట్టు చేశారు. సెనేట్‌ సమావేశాల సందర్భంలో ట్రంప్‌ మద్దతుదారుల నిరసనలు మాత్రమే ఊహించిన భద్రతాబలగాలకు ఈ విధ్వంసాన్ని నిలువరించడం ఎంతో కష్టమైపోయింది. తాను రెచ్చగొట్టినందువల్లే ఇంతటి విధ్వంసం జరిగిందని ట్రంప్‌కు తెలుసు. కనీసం ఆ తరువాతైనా ఆయన హుందాగా మాట్లాడివుంటే మరోమారు అభిశంసన అవమానం తప్పేదేమో! దీనిని వ్యతిరేకిస్తూ కూడా ఆయన హింసను ప్రేరేపించే వ్యాఖ్యలే చేశాడు.


గత ఏడాది అభిశంసనకు నెలలు పడితే ఇప్పుడు రోజుల్లోనే దానిని ఓ కొలిక్కి తేవడం డెమోక్రాట్ల పట్టుదలకు నిదర్శనం. ఈనెల 19వతేదీన సెనేట్‌ సమావేశం కాబోతున్నందున, దిగువసభలో నెగ్గిన తీర్మానాన్ని అక్కడ ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంలో డెమోక్రాట్లు ఉన్నారు. ఇంతకాలం సెనేట్‌లో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్నందున తమ మాట నెగ్గలేదు కానీ, కొత్త సెనేట్‌లో ఉభయపక్షాల బలాబలాలూ చెరిసగం ఉన్నందున తాము అనుకున్నది చేయగలమని డెమోక్రాట్ల ఆలోచన. కానీ, కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ సామరస్యపూర్వకంగా, కలసికట్టుగా సాగిపోవాలనే ధోరణి ఉన్నవారు. ట్రంప్‌ అభిశంసన సాధ్యమైనంత వేగంగా సాగించాలన్న, పదవినుంచి దిగిపోయిన తరువాత కూడా ఆయనను వేటాడాలన్న పార్టీ ఉత్సాహానికి బైడెన్‌ ఎంత మేరకు సహకరిస్తారో చూడాలి. ఇక, ట్రంప్‌ తొలి అభిశంసనకు ఒక విదేశీ అధినేతమీద తెచ్చిన రాజకీయ ఒత్తిడి కారణం కావచ్చును కానీ, ఈ మారు అది మిగతా ప్రపంచం ముందు అమెరికా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దేశం పరువు ప్రతిష్ఠలను దిగజార్చిన ఘటనకు సంబంధించింది. కానీ, ట్రంప్‌ మద్దతుదారుల దాడుల భయంతో ఈ మారు పార్లమెంటు భవనమే కాదు, రాజధాని నగరం కూడా వేలాదిమంది భద్రతాబలగాల గుప్పిట్లోకి పోవడం విచిత్రం.

Updated Date - 2021-01-14T08:54:37+05:30 IST