మరోసారి మేక్రాన్‌..!

ABN , First Publish Date - 2022-04-27T09:30:07+05:30 IST

ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఇమ్మానియేల్ మేక్రాన్ పునర్విజయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఊపిరిపీల్చుకుంది. ఆయన ఎన్నిక అమెరికాకు కూడా పెద్ద ఉపశమనం. మరో ఐదేళ్ళపాటు దేశాధ్యక్షుడిగా కొనసాగబోతున్న మేక్రాన్...

మరోసారి మేక్రాన్‌..!

ఫ్రాన్స్ అధ్యక్షుడుగా ఇమ్మానియేల్ మేక్రాన్ పునర్విజయంతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఊపిరిపీల్చుకుంది. ఆయన ఎన్నిక అమెరికాకు కూడా పెద్ద ఉపశమనం. మరో ఐదేళ్ళపాటు దేశాధ్యక్షుడిగా కొనసాగబోతున్న మేక్రాన్ 58.55 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి మెరీన్ లీపెన్‌ను ఓడించారు. ఆమెకు 41.45 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల తేడా ఎంతో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, ఐదేళ్ళనాటి ఫలితాలతో పోల్చితే మేక్రాన్ ఆధిక్యత చాలా తగ్గి, మరొకవైపు ఈ మితవాద నాయకురాలు బాగానే బలపడ్డారు. ఐదేళ్ళక్రితం మేక్రాన్‌ తన 39వ ఏట దేశాధ్యక్షపదవికి తొలిసారి పోటీపడి కూడా 66శాతం ఓట్లు సాధించాడు. అయినా, ప్రస్తుత విజయాన్ని కూడా చరిత్రాత్మకమేనని అభివర్ణించడానికి అనేక కారణాలున్నాయి.


దేశాధ్యక్షుడొకరు ఇలా రెండోమారు ఎన్నికకావడం రెండు దశాబ్దాల తరువాత జరిగింది. నిజానికి, 2002 ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు జాక్ షిరాక్ తిరిగి ఎన్నికైంది ప్రస్తుత మితవాద నాయకురాలు మెరీన్ తండ్రిని ఓడించే. ఫ్రాన్స్ చరిత్రలో మితవాద నాయకుడొకరు అధ్యక్ష ఎన్నికలో రెండో రౌండుకు పోటీపడే అర్హత సంపాదించడం అదే తొలిసారి. అధ్యక్షపదవికి పోటీపడేవారిలో ఏ ఒక్కరూ కనీసం యాభైశాతం ఓట్లు దాటని పక్షంలో మరోపర్యాయం ఎన్నిక జరుగుతుంది. ఈ రౌండులో అత్యధిక ఓట్లు సాధించిన వారు అధ్యక్షస్థానంలో కూచుంటారు. మేక్రాన్ ఐదేళ్ళక్రితంతో పోల్చితే తొలి రౌండులో మూడుశాతం ఎక్కువ ఓట్లు సాధించినా, మలిరౌండులో బాగా తగ్గిపోయారు. ఆయన ప్రత్యర్థి మెరీన్ మాత్రం రెట్టింపు బలాన్ని సంపాదించుకున్నారు. ఫ్రాన్స్ చరిత్రలో మితవాద నాయకురాలు ఒకరు రెండో రౌండులో ఇంత స్కోరు సాధించడం ఇదే తొలిసారి. మేక్రాన్‌ ఆమెను తట్టుకొని నిలిచి మరోమారు మంచిమార్కులతో పరీక్ష గట్టెక్కడమే కాక, 1958 నుంచి అమలులో ఉన్న ప్రస్తుత పాలక విధానంలో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ముగ్గురిలో ఒకరిగా నిలవడం ప్రశంసనీయం. దానితోపాటు, అధికారంలో ఉన్న పక్షానికి చెందిన వ్యక్తే మరోమారు అధ్యక్షుడు కావడమన్న లెక్కన చూస్తే మేక్రాన్ తొలిసారిగా సాధించిన రికార్డు చిన్నదేమీ కాదు.


ఫ్రాన్స్ చట్టాల ప్రకారం మేక్రాన్ మూడోసారి దేశాధ్యక్ష పదవికి పోటీచేయలేరు కానీ, మెరీన్ రాజకీయ ఎదుగుదల మాత్రం చాపకిందనీరులాగా ఉన్నమాట నిజం. ఆమె ఈయూ, నాటోలకు వ్యతిరేకి. పుతిన్ అనుకూలతను బాహాటంగానే ప్రకటించారు. రష్యాపై ఆంక్షలు కూడదన్నారు. యూరప్‌లో రష్యా పక్షాన మాట్లాడే బలమైన గొంతు ఆమె. యూరప్ ఐక్యతకు ఆమె శత్రువు అన్న భావన బలంగా ఉన్నందునే ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఓడిపోగానే, ‘ప్రజాస్వామ్యం నిలిచింది, యూరప్ గెలిచింది’ అంటూ స్పెయిన్ ప్రధాని ఎగిరిగంతేశారు. నిజానికి, ఈ ఎన్నికల కాలానికి లీపెన్ తన వైఖరిలో ఎంతో మార్పు ప్రకటించారు. రష్యా అనుకూలతను, వలసల వ్యతిరేకతను, ఈయూ నుంచి ఫ్రాన్స్ బయటకు వచ్చేయాలన్న డిమాండ్‌ను ఆమె బలహీనపరిచారు. గతంతో పోల్చితే ఆమె కాఠిన్యం తగ్గినా, ఓటర్లలో పూర్తి సానుకూలత వచ్చినట్టు లేదు. ఇక, మేక్రాన్‌కు సంపన్నుల పక్షపాతి అన్న ముద్రతోపాటు, చాలా అంశాల్లో ప్రజావ్యతిరేకత లేకపోలేదు. కానీ, ఎంతటి పెద్దనేతనైనా నిలదీయగలడనీ, ఫ్రాన్స్ ప్రయోజనాల కోసం ఎవరినైనా ప్రశ్నించగలడనీ ప్రజలు నమ్మారు. కరోనా కాలంలో బాగా వ్యవహరించిన పేరుతో పాటు, మూడోవంతుమంది ఓటర్లు పోలింగ్ బూతులకు రాకపోవడం ఆయన విజయానికి ఉపకరించింది. ఇంటా బయటా పరిస్థితులు అంతగొప్పగా లేని తరుణంలో పాలనను ఓ మతవాది కంటే, అనుభవం ఉన్న ఓ మధ్యేవాది చేతుల్లో పెట్టడం అవసరమని ప్రజలు భావించి ఉంటారు. దేశ ముస్లిం జనాభాను విదేశీ ప్రభావం నుంచి నియంత్రించే చట్టం అంటూ ఒకదానిని గత ఏడాది తీసుకొచ్చి మితవాద ఓటర్ల మనసులు గెలుచుకొనే ప్రయత్నమూ చేశాడు మేక్రాన్‌. ఫ్రాన్స్ ఉదారవాద విలువలను ఈ చట్టం భూస్థాపితం చేసిందని ఎందరు విమర్శించినా, కాసిన్ని ఓట్లనైతే సాధించిపెట్టింది. మేక్రాన్ విజయం భారతదేశానికి కూడా శుభవార్తే. దౌత్యబంధాలు, వాణిజ్య బాంధవ్యాల చరిత్రను అటుంచితే, రక్షణరంగంలో దానితో సాన్నిహిత్యం తెలియనిదేమీ కాదు. భారత రక్షణ దిగుమతుల్లో రష్యా తరువాత స్థానం ఫ్రాన్స్‌దే. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని ఆచరణలో నిలబెట్టడమే కాక, దానిచుట్టూ కమ్ముకున్న వివాదం విషయంలో ఎప్పటికప్పుడు అతిజాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మరో రెండునెలల్లో జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో మేక్రాన్ పార్టీ ఘన విజయం సాధిస్తే అధ్యక్షుడిగా ఆయన ఏలుబడి సాఫీగా సాగిపోతుంది. లేనిపక్షంలో విపక్ష ప్రధాని నుంచి వేధింపులు, సాధింపులు ఎదుర్కోక తప్పదు.

Updated Date - 2022-04-27T09:30:07+05:30 IST