మరోసారి కొలతలు

ABN , First Publish Date - 2022-01-25T05:28:22+05:30 IST

సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సాగునీటి కాలువను ఆక్రమించిన వ్యవహారంపై మరోసారి అధికారులు దృష్టిసారించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌డీసీ) ఉమాదేవి నేతృత్వలో రెవెన్యూ, జలవనరుల సర్వే శాఖల అధికారులు సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సర్వే ఆర్క్‌ కాల్వ అలైన్‌మెంట్‌ ప్రకారం ఎలా ఉందన్న అంశాన్ని సర్వే చేసిన వారు రికార్డులను కూడా పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు ఇవ్వనున్నట్లు సమాచారం.

మరోసారి కొలతలు
మ్యాపులు పరిశీలించి, అధికారులతో చర్చిస్తున్న ఎస్‌డీసీ

ఎమ్మెల్యే కాల్వ ఆక్రమణలపై కొనసాగిన విచారణ

ఎస్‌డీసీ నేతృత్వలో పలు శాఖల అధికారుల సర్వే

ఒంగోలు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సాగునీటి కాలువను ఆక్రమించిన వ్యవహారంపై మరోసారి అధికారులు దృష్టిసారించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (ఎస్‌డీసీ) ఉమాదేవి నేతృత్వలో రెవెన్యూ, జలవనరుల సర్వే శాఖల అధికారులు సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సర్వే ఆర్క్‌ కాల్వ అలైన్‌మెంట్‌ ప్రకారం ఎలా ఉందన్న అంశాన్ని సర్వే చేసిన వారు రికార్డులను కూడా పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ‘దర్జాగా కబ్జా’ పేరుతో ఈనెల 21న ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనం ఇటు రాజకీయ, అటు అధికారవర్గాల్లో కలకలం రేపడంతో పాటు విస్త్రతస్థాయిలో చర్చకు దారితీసింది. దీనిపై యంత్రాంగం స్పందించింది. అదేరోజు సాయంత్రం మద్దిపాడు తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే గుండ్లకమ్మ పంట కాల్వ కావడంతో సంబంధిత రికార్డులు తమ వద్ద ఉండే అవకాశం లేదని విచారణ చేయాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. దీంతో 22న ప్రాజెక్టు డీఈ బొల్లయ్య తన సిబ్బందితో ఆక్రమణ ప్రాంతాన్ని పరిశీలించి కొలతలు తీశారు. తమ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం విచారణ సాధ్యం కాదని, మరికొన్ని రికార్డులు ప్రాజెక్టు ఎస్‌డీసీ, ఇతర శాఖల నుంచి తెప్పించి విచారణ చేస్తామని చెప్పారు. దీనిపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ దృష్టిసారించినట్లు తెలుస్తుండగా ఆయన ఆదేశాలతో పలు శాఖల అధికారులు సోమవారం సాయంత్రం సంయుక్తంగా కాల్వ ఆక్రమణ ప్రాంతాన్ని చూశారు. ఎస్‌డీసీ ఉమాదేవి నేతృత్వంలో డివిజనల్‌ సర్వేయర్‌ కోటేశ్వరరావు, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, డీఈ బొల్లయ్య ఇతర సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు సదరు సర్వే నంబరులోని భూమిని కొలతలు వేశారు. కాల్వకు పైపులు వేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాల్వ కోసం భూసేకరణ సమయంలో రూపొందించిన అలైన్‌మెట్‌(రికార్డుల ప్రకారం) అలాగే ప్రస్తుతం భౌతికంగా ఉన్న కాల్వ తీరును ప్రాథమికంగా పరిశీలించారు. ఈ రెండింటిన పోల్చి చూసి ఆక్రమణలు జరిగాయా లేదా అనే విషయాన్ని తేల్చాలన్న ఆలోచనలో వారు ఉన్నట్లు సమాచారం. కాగా పంట కాల్వ ఉన్న సర్వే నెంబరు భూమిని కొలతలు వేశామని, రికార్డులు కూడా పరిశీలించి స్కెచ్‌ రూపొందించి తదనుగుణంగా నివేదికను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నట్లు ఎస్‌డీసీ ఉమాదేవి చెప్పారు.


   

Updated Date - 2022-01-25T05:28:22+05:30 IST