ఒకప్పుడు అటెండర్‌..ఇప్పుడు అధ్యక్షురాలు

ABN , First Publish Date - 2021-01-02T05:58:42+05:30 IST

చిన్నా చితకా పనులు చేసిన కార్యాలయంలోనే అధికారిగా బాధ్యతలు చేపట్టడం ఎవరికైనా పట్టలేనంత సంతోషాన్నిస్తుంది. కేరళకు చెందిన ఆనందవల్లి కూడా ఇప్పుడు అదే సంతోషంలో ఉన్నారు

ఒకప్పుడు అటెండర్‌..ఇప్పుడు అధ్యక్షురాలు

చిన్నా చితకా పనులు చేసిన కార్యాలయంలోనే అధికారిగా బాధ్యతలు చేపట్టడం ఎవరికైనా పట్టలేనంత సంతోషాన్నిస్తుంది. కేరళకు చెందిన ఆనందవల్లి కూడా ఇప్పుడు అదే సంతోషంలో ఉన్నారు. తాత్కాలిక స్వీపర్‌గా పదే ళ్లు చీపురు పట్టి ఊడ్చిన పంచాయతీ ఆఫీసులోనే ఆమె ఇప్పుడు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొల్లాం జిల్లాలో ఈమధ్య జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆనందవల్లి పఠాన్‌పురం పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. పంచాయతీ అధ్యక్షురాలిగా ఆమె పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయడంతో అందరితో పాటు ఆనందవల్లి కూడా ఆశ్చర్యపోయారు. కొల్లాం జిల్లాలోని పఠాన్‌పురం పంచాయతీ అధ్యక్షురాలిగా ఆనందవల్లి రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు.


ఆఫీసులో పదేళ్లుగా నేలను శుభ్రం చేయడం, కుర్చీలు, టేబుళ్ల మీది దుమ్ము తుడవడం మాత్రమే కాదు ఆఫీసు అటెండర్‌గా విధులు నిర్వహించారామె. పెయింటింగ్‌ పనిచేసే ఆమె భర్త మోహనన్‌ సీపీఎం స్థానిక కమిటీలో సభ్యుడు కూడా. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలిద్దరూ మొదటి నుంచి కమ్యూనిస్ట్‌ పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈసారి దళిత మహిళకు రిజర్వేషన్‌ రావడంతో పార్టీ సభ్యులు ఆనందవల్లిని పోటీకి నిలబెట్టారు. మొదటి ఎన్నికల్లోనే గెలవడమే కాదు ప్రెసిడెంట్‌ పదవిని అలంకరించారు ఆనందవల్లి. పంచాయతీ సభ్యులు చప్పట్లు కొడుతూ ఆమెను ప్రెసిడెంట్‌ కుర్చీలో కూర్చోబెట్టిన క్షణం ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 


ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా!

‘‘నా జీవితంలో మరచిపోలేని రోజిది. నాపై ఎంత పెద్ద బాధ్యత ఉందో నాకు తెలుసు. నేను వారి రుణం తీర్చుకోలేను. నా బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తాను. కొంత భయంగానే ఉంది. కానీ పార్టీ పెద్దలు, పంచాయతీ సభ్యులు ఈ కొత్త బాధ్యతను తీసుకొనేలా వెన్నుతట్టారు. మా పంచాయతీని రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా పై పెద్ద బాధ్యత ఉంది. నా పంచాయతీలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’’ అని అంటున్నారు ఆనందవల్లి.

Updated Date - 2021-01-02T05:58:42+05:30 IST