Sri Lanka : ఒకప్పుడు చిత్రహింసల బాధితుడే నేడు గొటబయ రాజపక్సను గద్దె దించాడు

Published: Tue, 19 Jul 2022 14:49:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Sri Lanka : ఒకప్పుడు చిత్రహింసల బాధితుడే నేడు గొటబయ రాజపక్సను గద్దె దించాడు

కొలంబో : శ్రీలంక (Sri Lanka)లో ఆర్థిక సంక్షోభాన్ని రాజకీయ సంక్షోభంగా మలచి, దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa)ను గద్దె దించడంలో ప్రముఖ పాత్ర పోషించినవారిలో ప్రేమ కుమార్ గుణరత్నం ఒకరు. ఓ దశాబ్దం క్రితం గొటబయ నేతృత్వంలోని సైన్యం ఆయనను అపహరించి, చిత్రహింసలకు గురి చేసింది. అప్పట్లో అసమ్మతివాదులను పెద్ద ఎత్తున సైన్యం మట్టుబెట్టింది. అదేవిధంగా ప్రేమ కుమార్‌ను కూడా మట్టుబెట్టాలని ప్రయత్నించింది. కానీ అంతర్జాతీయ ఒత్తిడితో ఆయనను వదిలేయక తప్పలేదు. ఓ దశాబ్దం తర్వాత నేడు ఆయన గొటబయను దేశం విడిచి పారిపోయేలా చేయగలిగారు. 


Premakumar Gunaratnam (56) టీనేజ్‌లోనే 1980వ దశకంలో వామపక్ష రాజకీయ సంస్థలో చేరారు. ఆయుధాల కోసం కేండీలోని సైనిక శిబిరంపై దాడి చేసిన ఓ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆయన నాయకత్వం వహించారు. ఆయనను సైనిక కమాండర్ శరత్ ఫోన్సెకా అరెస్టు చేశారు. ఆ సమయంలో న్యాయస్థానాలతో సంబంధం లేకుండా ట్రింకోమలీలో జరిగిన వందలాది మంది అసమ్మతివాదుల హత్యలకు బాధ్యుడు శరత్ ఫోన్సెకా అని ప్రేమ కుమార్ చెప్తుంటారు. తాను మరణించే వరకు రోజులు లెక్కపెడుతూనే ఉంటానని చెప్తుంటారు. 


ప్రేమ కుమార్ ఇటీవల ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, తనను ఓ దశాబ్దం క్రితం కొలంబో సమీపంలోని తన ఇంటి నుంచి కొందరు సాయుధులు లాక్కెళ్ళిపోయారని చెప్పారు. ఓ తెల్లని వ్యానులోకి తనను విసిరికొట్టారని, ఓ గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి, తన బట్టలు విప్పేసి, తీవ్రంగా చిత్రహింసలు పెట్టారన్నారు. 2012లో పదుల సంఖ్యలో ప్రతిపక్ష నేతలు, అసమ్మతివాదులు, పాత్రికేయులను లాక్కెళ్ళిపోయారని, వారిలో చాలా మంది జాడ  కనిపించలేదని చెప్పారు. 


తనను నాలుగు రోజులపాటు చిత్రహింసలు పెట్టారని, అంతర్జాతీయ ఒత్తిళ్ళ వల్ల అనూహ్యంగా వదిలిపెట్టారని చెప్పారు. ఇలా విడుదలైన కొందరు అదృష్టవంతుల్లో తాను ఒకడినని చెప్పారు. ఆ సమయంలో శ్రీలంక భద్రతా దళాలు (Sri Lanka's security forces) గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) నేతృత్వంలో ఉండేవన్నారు. ఆ తర్వాత ఆయన దేశాధ్యక్షుడయ్యారని చెప్పారు. 


శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత నిరసనకారులు తన నివాసంలోకి చొచ్చుకెళ్ళి విధ్వంసం సృష్టించడంతో గొటబయ రాజపక్స గత వారం సింగపూర్ (Singapore) వెళ్ళిపోయి, తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశాధ్యక్షుని నివాసంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్ళేలా ప్రేరేపించినవారిలో ప్రేమ కుమార్ ఒకరని స్థానిక మీడియా చెప్తోంది. ఆర్థిక సంక్షోభంపై ప్రజల్లో ఏర్పడుతున్న ఆగ్రహాన్ని రాజకీయ విప్లవంగా మార్చి, కొన్ని నెలలపాటు నాయకుడు లేని ఉద్యమాన్ని నిర్మించినవారిలో ఆయన కీలక వ్యక్తి అని చెప్తోంది. 


గొటబయ పలాయనం ప్రజాస్వామ్య విజయం

గొటబయ రాజపక్స తనను అపహరించారని, తనను హత్య చేయాలని కూడా ఆయన అనుకున్నారని ప్రేమ కుమార్ చెప్పారు. అయితే ఇది వ్యక్తిగత విషయం కాదన్నారు. గొటబయ పదవీచ్యుతుడు కావడం, సింగపూర్ పారిపోవడం ప్రజాస్వామ్యానికి విజయమని చెప్పారు. అయితే శ్రీలంక కోర్టు గదిలో న్యాయాన్ని గొటబయ ఎదుర్కొనే వరకు నిరసనకారుల లక్ష్యం అసంపూర్ణం అవుతుందన్నారు. అపహరణలు, అదృశ్యాల వెనుకగల కీలక వ్యక్తుల్లో గొటబయ ఒకరని తెలిపారు. యుద్ధ నేరాలకు బాధ్యులైనవారిలో ఆయన ఒకరన్నారు. శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో, ఆ తర్వాత ప్రత్యర్థులను భద్రతా దళాలు తరచూ అపహరిస్తూ ఉండేవన్నారు. 


ప్రేమ కుమార్ మృత్యుంజయుడు

గుణరత్నం తన జీవితాన్ని విప్తవ రాజకీయాలకు అంకితం చేశారు. సాయుధ ఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘనల చరిత్రగల శ్రీలంకలో ఆయన అనేకసార్లు మృత్యుకుహరంలోకి వెళ్ళి, తిరిగి వచ్చారు. అసమ్మతివాదుల అపహరణలు, అదృశ్యమవడం, హత్యలు జరగడం, మానవ హక్కుల ఉల్లంఘనలు కొనసాగడం వంటివాటికి వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిళ్ళు తీవ్రంగా ఉండేవన్నారు. దీంతో అదృశ్యమైనవారిలో కొందరు సజీవంగా ఉన్నారని ప్రపంచానికి చూపించుకోవడానికే తనను ప్రభుత్వం వదిలిపెట్టిందని ఆయన చెప్పారు. తన ప్రాణాలను కాపాడటంలో ఆస్ట్రేలియా (Australia) రాయబారి చాలా ముఖ్యమైన పాత్రను పోషించారని తెలిపారు. తాను దేశం విడిచి వెళ్ళిన తర్వాత తనకు ఆస్ట్రేలియా పౌరసత్వం మంజూరైందన్నారు. 


అభ్యర్థులపై ఉద్యమకారుల వ్యతిరేకత

శ్రీలంక తదుపరి అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఫోన్సెకా ఒకరు. సాజిత్ ప్రేమదాస కూడా పోటీలో ముందు వరుసలో ఉన్నారు. సాజిత్ ప్రేమదాస తండ్రి దేశాధ్యక్షునిగా పని చేసిన కాలంలో గుణరత్నం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. అదే ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రణిల్ విక్రమసింఘే ప్రస్తుతం శ్రీలంక తాత్కాలిక అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన కూడా దేశాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థులందరిపైనా ఉద్యమకారులకు వ్యతిరేకత ఉంది. అందువల్ల ఎదురులేని అధికారాలను నిషేధించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి అధికారాల వల్ల అవినీతి, రాజకీయ హింస పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. 


వీథుల్లో ఉద్యమాలు రావాలి

గుణరత్నం చాలా కాలం క్రితమే సాయుధ సంఘర్షణలను వదిలిపెట్టారు. సమగ్ర రాజకీయ సంస్కరణలు రావాలంటే వీథుల్లోకి వచ్చి మరిన్ని ఉద్యమాలను నిర్వహించాలన్నారు. పాలకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని ఆశించలేమని, అందుకే ప్రజలు వీథుల్లోకి వచ్చి, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెప్పారని అన్నారు. 
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.