ఒక్కొక్కరుగా కదన రంగంలోకి

Published: Sat, 13 Aug 2022 00:37:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఒక్కొక్కరుగా కదన రంగంలోకిమునుగోడులో సీఎం కేసీఆర్‌ సభాస్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

నేటి నుంచి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పాదయాత్ర

సీఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రి జగదీష్‌రెడ్డి

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ పర్యటన

చండూరులో సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి సమావేశం

యాదాద్రి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, ఉప ఎన్నిక షెడ్యూల్‌ రాకముందే మునుగోడును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా కార్యక్రమాలను ముమ్మరంగా చేస్తున్నాయి.

నియోజకవర్గంపై ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చండూర్‌లో బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం నారాయణపూర్‌ నుంచి చౌటుప్పల్‌ వరకు ఆజాదీకా గౌరవ్‌ యాత్ర నిర్వహించనుండగా, దీనికి రేవంత్‌రెడ్డి సహా పలువురు సీనియర్‌ నాయకులు హాజరుకానున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌, నారాయణపురం మండలాలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించగా, పాదయాత్రను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేసింది. ఇదిలా ఉండగా మునుగోడులో సీఎం కేసీఆర్‌ సభ నిర్వహించేందుకు మంత్రి జగదీ్‌షరెడ్డి శుక్రవారం సభాస్థలికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ రామన్నపేట మండలంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మునుగోడులో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఇలా అన్ని పార్టీల నాయకులు మునుగోడు కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వెలువడకముందే రాజకీయాన్ని వేడి పుట్టిస్తున్నారు. ఇక విమర్శలు, ఆరోపణలు, ప్రభుత్వ పథకాల ప్రచారాలతో పైచేయి సాధించేందుకు నాయకులు పోటీపడుతున్నారు.

ఐదు వేల మందితో యాత్ర

చౌటుప్పల్‌రూరల్‌: నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు 5వేల మందితో ఆజాదీకా గౌరవ్‌ యాత్ర నిర్వహించనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తెలిపారు. చౌటుప్పల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పాదయాత్రకు రేవంత్‌తోపాటు పార్టీ అగ్రనాయకులు పాల్గొంటారని తెలిపారు. పాదయాత్ర 13న ఉదయం 10గంటలకు ప్రారంభమై సాయంత్రం 4గంటలకు ముగుస్తుందని, అనంతరం చౌటుప్పల్‌లో సభ ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 16, 18, 19 తేదీల్లో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో మండలాల వారీగా రేవంత్‌రెడ్డి సమావేశమవుతారని, 20 తేదీ నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పాదయాత్రకు ఆహ్వానించామని స్పష్టం చేశారు.

మునుగోడు గడ్డపై గులాబీ జెండా : మంత్రి జగదీ్‌షరెడ్డి

మునుగోడు, సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 12: రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ కుట్రలు చేస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఉప ఎన్నికలో మునుగోడు గడ్డపై గులాబీ జెండా ఎగురుతుందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఈనెల 20న నిర్వహించే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభా వేదిక కోసం నల్లగొండ జిల్లా మునుగోడు, సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌, పుట్టపాక పంచాయతీ పరిధిలోని సాయిగోనిబావి గ్రామంలో మరో స్థలాన్ని గురువారం పరిశీలించారు. గుడిమల్కాపురం గ్రామంలో దళిత బంధు పథకం కింద గాదె శ్రీను ఏర్పాటు చేసిన శారీ సెంటర్‌, కిరాణా దుకాణాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. రాజగోపాల్‌రెడ్డి తన కుటుంబ అబివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని తాకట్టు పెట్టారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ సభను లక్షమందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, నాయకులు నారబోయిన రవి, శివశంకర్‌నేత, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డిరాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొడ్డు శ్రీనివా్‌సరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, వీరమళ్ల వెంకటేశంగౌడ్‌, మన్నె ఇంద్రసేనారెడ్డి, పాల్గొన్నారు.

మునుగోడు నుంచే బీజేపీ పతనం : పల్లా వెంకట్‌రెడ్డి

చండూరు, ఆగస్టు 12: మునుగోడు ఉప ఎన్నికతోనే బీజేపీ పతనం ప్రారంభమవుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలోని సీపీ ఐ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిందని, ఐదు పర్యాయాలు సీపీఐ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. రాజకీయ పరిణామాలు, ఎన్నికల పొత్తులో భాగంగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సీపీఐ మద్దతు ఇచ్చిందని తెలిపారు. తమ మద్దతుతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారని విమర్శించారు. దే శంలో మోదీ పాలనలో అన్ని రకాల ధరలు పెంచి పేదలపై ఎనలేని భారం మోపిన బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కమ్యూనిస్టులకు ప్రధాన శత్రువు బీజేపీ అని, ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించడమే తమ లక్ష్యమన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆటలు సాగనివ్వం  : జూలకంటి

నల్లగొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఆటలు, నాటకాలు సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీతో పాటు సీపీఎం, సీపీఐ బలంగా ఉన్నాయని, బీజేపీది నాలుగో స్థానమేనన్నారు. కమ్యూనిస్టులకు 25వేల వరకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని, ఉప ఎన్నికలో తమదే కీలక పాత్ర అన్నారు. నియోజకవర్గంలో ఒంటరిగా పోటీ చేయాలా లేదా, ఏ పార్టీతో కలిసి పోటీ చేయాలనే దానిపై కార్యకర్తలతో త్వరలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

పోటీలో ఉంటాం : డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మునుగోడు బరిలో నిలుస్తామని దళిత శక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మునుగోడు బరిలో నిలిచేందుకు రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకున్నామన్నారు. పేదల రాజ్యాన్ని స్థాపించేందుకు పేదలకు అంబేడ్కర్‌ ఓటు హక్కు ఇస్తే మునుగోడు నియోజకవర్గంలో 70ఏళ్ల నుంచి రెడ్డి, రావులు, అగ్రకులాలు, భూస్వాములు ఎమ్మెల్యేలుగా గెలిచి రాజ్యమేలుతున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన 2లక్షల ఓట్లను దోచుకుని వారు గెలుస్తున్నారన్నారు. నియోజకవర్గంలో 95శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు  మరోమారు బలిపశువులు కాబోతున్నారని, దీన్ని నివారించేందుకే ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ప్రకటించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.