రూ.కోటి భూమిపై కన్నేశారు!

ABN , First Publish Date - 2021-04-22T06:27:02+05:30 IST

ప్రభుత్వ భూమిని కాజేయడానికి కొందరు పక్కా స్కెచ్‌ వేశారు. కోట్ల విలువ చేసే భూమికి నకిలీ పట్టా సృష్టించి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై మండలంలో జోరుగా చర్చ నడుస్తోంది.

రూ.కోటి భూమిపై కన్నేశారు!
అక్రమార్కులు కన్నేసిన కనుమళ్ల చెరువు భూమి

రియల్టర్‌, మాజీ సైనికుడు కలిసి పక్కా స్కెచ్‌

నకిలీ పట్టాలతో స్వాధీనానికి యత్నం

ఎన్‌వోసీపై విచారణతో అప్పట్లో చుక్కెదురు

తాజాగా ఆ భూమిలో జగనన్న పట్టాలు 

రెవెన్యూ సహకారంతో మళ్లీ రంగంలోకివైసీపీ నేతలు 

కాపాడాలంటున్న కనుమళ్లవాసులు

సింగరాయకొండ, ఏప్రిల్‌ 21 : ప్రభుత్వ భూమిని కాజేయడానికి కొందరు పక్కా స్కెచ్‌ వేశారు. కోట్ల విలువ చేసే భూమికి నకిలీ పట్టా సృష్టించి అమ్మకానికి సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై మండలంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంలో అధికారపార్టీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది హస్తం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మండంలోని కనుమళ్ల గ్రామ సర్వే నెం. 371-6 లో 4.96 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూమి ఉంది. ఇది నీటిపారుదల చెరువుకి సంబంధించినది. ఆది నుంచి ఈ భూమిని హస్తగతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నించారు. సింగరాయకొండ నుంచి కందుకూరుకి వెళ్లే మార్గంలో రోడ్డుకి అనుకొని ఇది ఉంది. రోడ్డు పక్కనే ఉండటంతో ఆ ప్రాంతంలో ఎకరం విలువ రూ.కోటిపైనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా అక్రమార్కుల కన్ను ఆ భూమిపై పడింది.


కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే కొట్టేసేందుకు యత్నం

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 2009లో ఆ పార్టీ నాయకులు పథకం ప్రకారం కొందరికి బినామీ పట్టాలను మంజూరు చేయించి భూమిని స్వాహా చేయడానికి ప్రయత్నించారు. అప్పట్లో ఈ సంఘటన మండలంలో పెద్దఎత్తున దుమారాన్ని లేపింది.  గ్రామస్థులు ధర్నా చేసి భూపంపిణీని అడ్డుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఆ భూమిపై అందరి కన్ను ఉంది.


మాజీ సైనికుడి పేరుతో నకిలీ పట్టా

కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించడానికి రియల్టర్‌, మాజీ సైనిక ఉద్యోగి కలిసి పక్కా పథకం నడిపారు. నకిలీ పట్టాతో ఆ భూమిని కాజేసే ఎత్తుగడ వేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కుంచాల రవిదేవ రాజు సైన్యంలో పనిచేసి డిశ్చార్జి మీద 1968లో ఎటువంటి పింఛన్‌ లేకుండా బయటకు వచ్చాడు. తదుపరి మాజీ సైనికుడు కోటాలో భారతీ య రైల్వే విభాగంలో డ్రైవర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. ప్రస్తుతం నెలకు రూ.40వేల ఫించన్‌ పొందుతున్నాడు. మాజీ సైనికుడిగా రిటైర్‌ అయిన తర్వాత ఏటీఏం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించాడు. 11.11.2003న సర్వే నెం.107-5లో 4.42సెంట్లు తనకు ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా నకిలీ పట్టాను 2013లో సృష్టించాడు. సదరు భూమి శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి ఈనాం కావడంతో ఆ పట్టాను పక్కన పెట్టాడు. కనుమళ్ల సర్వే నెం.371-6లోని 4.96 సెంట్ల భూమికి అసైన్‌మెంట్‌ కమిటీ ఆమోదం లేకుండా, జిల్లా సైనిక సంక్షేమాధికారి సిఫార్సు లేఖ లేకుండానే 2013లో మరో నకిలీ పట్టాను సృష్టించాడు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, ఆ భూమిని అమ్ముకోవడానికి ఎన్‌ఓసీ ఇప్పించాల్సిందిగా కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టాడు.


తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఎండార్స్‌మెంట్‌

ఎన్‌వోసీ కోసం మాజీ సైనికుడు పెట్టిన దరఖాస్తుపై విచారించా ల్సిందిగా కలెక్టర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి పంపారు. అధికారులు పరిశీలించగా అనేక అక్రమాలు వెలుగుచూశాయి. కనుమళ్లలో సర్వే నెం.371-6లో తహసీల్దార్‌ కార్యాలయం నుంచి భూమి మంజూరైనట్లు అసైన్‌మెంట్‌ రివ్యూ కమిటీ రిజిస్టర్‌లో నమోదు కాలేదని తెలింది. పట్టా కాగితం మీద ఉన్న రెవెన్యూ అధికారి సంతకం, 18.03.2003 కార్యాలయంలో పనిచేసిన మండల రెవెన్యూ అధికారి సంతకానికి తేడా ఉందని తేల్చారు. అంతేకాకుండా శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి ఈనాం భూమికి దరఖాస్తుదారుడు నకిలీ పట్టా సృష్టించుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఎన్‌వోసీ నిరాకరిస్తున్న విషయాలను కలెక్టర్‌ కార్యాలయానికి ఎండార్స్‌ చేశారు. ఈ పరిమాణాలతో అప్పట్లో స్థల ఆక్రమణపై అక్రమార్కులు వెనక్కితగ్గారు.


జగనన్న ఇళ్లస్థలాల పంపిణీకి పరిశీలన

గత డిసెంబర్‌లో జగనన్న ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి 371-6 భూమిని రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్న తరుణంలో గ్రామ ప్రజలు కోర్టును ఆశ్రయించారు. ఈ భూమి నుంచి 150 ఎకరాలు గల పంట చెరువుకు నీరు రావాలని, ఇందులో కట్టడాలు నిర్మిస్తే చెరువు నిరుపయోగంగా మారి రైతులు వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు స్టేటస్‌కో ఇచ్చింది. 


స్టేటస్‌కో బేఖాతరు 

న్యాయస్థానం ఇచ్చిన స్టేటస్‌కోను బేఖాతరు చేసి అధికారపార్టీ నాయకుల ఆదేశాలకు తలొగ్గి రెవెన్యూ అధికారులు ఆ భూమిలో కొంతభాగం ప్లాట్లు వేసి పంపిణీ చేశారు. ఈ పరిణామాలు పలు విమర్శలకు దారితీశాయి. అలాగే రియల్టర్‌, వైసీపీ నాయకులు మాజీ సైనికుడితో కుమ్మక్కై సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వివాదాస్పద భూమి బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.కోటికిపైగా పలుకుతోంది. దీంతో రియల్టర్‌, వైసీపీ నాయకులు నకిలీ పట్టా ఉన్న మాజీ సైనికుడికి కొంత మొత్తాన్ని ముట్టజెప్పి మిగతా తంతు నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి రెవెన్యూలోని అధికారుల సహకారం ఉన్నట్లు తెలుస్తోంది.


చెరువు భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలి

చెరువు భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కనుమళ్లవాసుల కోరుతున్నారు. ఇప్పటికి కొంత భూమిలో జగనన్న కాలనీలకు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లువేసి పట్టాలు ఇచ్చారని, మిగతా భూమి కూడా అన్యాక్రాంతం అయితే 150 ఎకరాల భూమి ఎడారిగా మారుతుందని వాపోతున్నారు. అధికారులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2021-04-22T06:27:02+05:30 IST