కోటి రూపాయల సరుకు తీసుకొని బిల్లు ఎగ్గొట్టారు!

ABN , First Publish Date - 2021-07-25T16:22:26+05:30 IST

కోటిరూపాయల విలువ చేసే సరుకు అరువుగా తీసుకుని..

కోటి రూపాయల సరుకు తీసుకొని బిల్లు ఎగ్గొట్టారు!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : కోటిరూపాయల విలువ చేసే సరుకు అరువుగా తీసుకుని, తీరా డబ్బు అడిగేందుకు ప్రయత్నింగా మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని కేసులు పెట్టిస్తామని బెదిరింపులకుపాల్పడుతున్న నలుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. శ్రీనగర్‌కాలనీ కమలాపురీ కాలనీలో ‘ఇండియా క్యాష్‌ అండ్‌ క్యారీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరిట ఓ కార్యాలయం ఉంది. ఈ సంస్థ ఔషధాల తయారీలో ఉపయోగించే కెమికల్స్‌, ల్యాబ్‌ పరికరాల వ్యాపారం నిర్వహిస్తోంది. సరుకు పంపించిన తరువాత బిల్లు వసూలు చేస్తారు. ఈ కంపెనీకి మెడం హన్మంతరావు, ఆలేటి కనకయ్య, మేడం వెంకట నాగసురేష్‌ డ్రైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరు బెంగళూరు కోమ్‌జెన్‌ బయోటెక్‌ ఎండీ శివకుమార్‌కు రూ.1.07 కోట్ల విలువైన సరుకు పంపించారు. శివకుమార్‌  కంపెనీకి డబ్బు చెల్లించలేదు. 


పలు మార్లు కంపెనీని బాకీ గురించి సంప్రదించేందుకు ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాలేదు. దీంతో ఇండియా క్యాష్‌ అండ్‌ క్యారీ జనరల్‌ మేనేజర్‌ రామ్మోహన్‌ బెంగళూరు వెళ్లి శివకుమార్‌ను డబ్బు కట్టాలని కోరగా తన కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను వేధిస్తున్నట్టు కేసు పెట్టిస్తానని బెదిరించాడు. వాకబు చేయగా శివకుమార్‌తోపాటు మేడం హన్మంతరావు, ఆలేటి కనకయ్య, మేడం వెంకటనాగసురేష్‌ కావాలనే కంపెనీని మోసం చేసినట్టు తేలింది. రామ్మోహన్‌ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T16:22:26+05:30 IST