జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా దుష్ప్రభావం.. ఒకరు మృతి !

ABN , First Publish Date - 2021-04-14T16:57:19+05:30 IST

అమెరికాలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ సింగిల్‌ డోసు కరోనా టీకా తీసుకున్న ఆరుగురిలో రక్తం గడ్డకట్టే దుష్ప్రభావం తలెత్తిన విషయం తెలిసిందే.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా దుష్ప్రభావం.. ఒకరు మృతి !

వాషింగ్టన్‌: అమెరికాలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ సింగిల్‌ డోసు కరోనా టీకా తీసుకున్న ఆరుగురిలో రక్తం గడ్డకట్టే దుష్ప్రభావం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ ఆరుగురిలో మంగళవారం ఒకరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) సీనియర్ సైంటిస్ట్ పీటర్ మార్క్స్ తెలిపారు. ఆరుగురు బాధితులు కూడా 18 నుంచి 48 ఏళ్లలోపు మహిళలేనని, టీకా తీసుకున్న 6 నుంచి 13 రోజుల తర్వాత వారిలో రక్తం గడ్డకట్టే దుష్ప్రభావం తలెత్తిందని ఆయన పేర్కొన్నారు. ఇదే మాదిరి యూరప్‌లో కూడా అడెనోవైరస్ వెక్టర్ టెక్నాలజీపై ఆధారపడి రూపొందించిన ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న కొందరిలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా మార్క్స్ గుర్తు చేశారు.


ఇదిలాఉంటే.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా దుష్ప్రభావం నేపథ్యంలో దాని వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఎఫ్‌డీఏ, సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) అమెరికా ప్రభుత్వానికి సిఫారసు చేశాయి. ఈ మేరకు మంగళవారం సంయుక్త ప్రకటన కూడా విడుదల చేశాయి. ఎఫ్‌డీఏ, సీడీసీ సిఫారసుల నేపథ్యంలో వెంటనే ఈ టీకా వినియోగాన్ని నిలిపివేసే దిశగా బైడెన్ సర్కారు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక తమ టీకా సైడ్ ఎఫెక్ట్స్‌పై స్పందించిన జాన్సన్ అండ్ జాన్సన్.. రక్తం గడ్డకట్టే సమస్యకు మా టీకాతో సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. టీకా దుష్ప్రభావాలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వ ఆరోగ్య విభాగాలకు అందించినట్లు తెలిపింది. ప్రజల ఆరోగ్య భద్రతకే మా తొలి ప్రాధాన్యం అని చెప్పుకొచ్చింది. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 68 లక్షల మందికి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్ వేసినట్లు తెలుస్తోంది.    


Updated Date - 2021-04-14T16:57:19+05:30 IST