‘ఒకరు సెంచరీ.. మరొకరు సెంచరీకి దగ్గరలో..’

ABN , First Publish Date - 2021-06-21T18:22:49+05:30 IST

‘ఓ బ్యాట్స్‌మన్‌ సెంచరీ కొట్టాడు. మరో బ్యాట్స్‌మన్‌ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు’

‘ఒకరు సెంచరీ.. మరొకరు సెంచరీకి దగ్గరలో..’

  • ఆగని పెట్రో మంట
  • సోషల్‌ మీడియాలో వ్యంగాస్త్రాలు  

హైదరాబాద్‌ సిటీ : పెట్రో మంట ఆగడం లేదు. ఆదివారం నగరంలో పెట్రోల్‌ లీటర్‌ 101.04 అయింది. డీజిల్‌ రూ. 95.89గా ఉంది. ఈ నెల 14న నగరంలో పెట్రోల్‌ లీటర్‌ రూ. 100 దాటింది. ఆ తర్వాత కూడా రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్రోల్‌ ధరల మరో ఏడాదిలో రూ. 200కి చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. రేపో మాపో డీజిల్‌ కూడా సెంచరీ కొట్టడం ఖాయమని అంటున్నారు.  


స్టేటస్‌, వాల్స్‌ నిండా... 

‘ఓ బ్యాట్స్‌మన్‌ సెంచరీ కొట్టాడు. మరో బ్యాట్స్‌మన్‌ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు’ ఇది పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సోషల్‌ మీడియాలోని ఓ వ్యంగాస్త్రాం. నగరంలో పెట్రో ల్‌ లీటర్‌ రూ.100 దాటి వారం రోజులు అయింది. డీజిల్‌ కూడా లీటర్‌ రూ. 100కు చేరుకుంటుందని పెట్రో ధరలను క్రికెట్‌ ఆటతో పోలుస్తూ సోషల్‌ మీడియాలో జోకులు పేలుస్తున్నారు. ఇప్పటి దాకా టెస్టు మ్యాచ్‌లే చూశామని, ఏడాదిగా 20-20 మ్యాచ్‌లు చూస్తున్నామంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా పెంచుకుంటూ పోతే డబుల్‌ సెంచరీలు ఖాయమంటూ పోస్టులు పెడుతున్నా రు. పెట్రో ధరలు ఇలాగే పెరిగితే త్వరలోనే ప్రస్తుత వాహనాలకన్నా పాత జమానాలోని బండ్లు, గుర్రాలు, సైకిళ్లే బెటరని అంటున్నారు. నగరంలో పెట్రోల్‌ పంపుల స్థా నంలో గుర్రపుశాలలు.. గడ్డి విక్రయ కేంద్రాలు వస్తాయని ఇలా రకరకాల చర్చ సాగుతోంది. వాట్సాప్‌ స్టేట్‌సలు, ఫేస్‌బుక్‌ వాల్‌లో ఇలాంటివి చాలా దర్శనమిస్తున్నాయి. 


పెరిగిన ఖర్చులు 

పెట్రోలు- డీజిల్‌ ధరలు పెరగడంతో మధ్యతరగతి వారిపై భారీ ప్రభావం చూపుతోంది. రవాణా ఖర్చు పెరగడంతో నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలు అందించే వ్యాపారులు ధరలు అమాంతం పెంచేస్తున్నారు. కూరగాయలు, ఆహార ధాన్యాల ధరలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇక ద్విచక్ర వాహనాలపై తిరిగే వారు కూడా పెట్రోల్‌ ధరలు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసినందున చాలా మంది బస్సులు.. మెట్రో ద్వారా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆటోలు, ట్రాలీలు, క్యాబ్‌లపై కూడా పెరిగిన ఇంధన భారాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

Updated Date - 2021-06-21T18:22:49+05:30 IST