ఒకరికి ఒకే పదవి

ABN , First Publish Date - 2022-06-03T16:56:12+05:30 IST

ఒకరికి ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌ తదితర నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర

ఒకరికి ఒకే పదవి

- ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ 

- ఉదయపూర్‌ తీర్మానాలు కర్ణాటక నుంచే అమలు

- కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా


బెంగళూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఒకరికి ఒకే పదవి, ఒక కుటుంబానికి ఒకటే టికెట్‌ తదితర నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. దేవనహళ్లి సమీపంలో జరుగుతున్న శిబిరంలో పార్టీ జాతీయ కమిటీ తీర్మానాలను గురువారం ప్రకటించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అధ్యక్షత వహించగా ప్రతిపక్షనేత సిద్దరామయ్యతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేపీసీసీ కేడర్‌కు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. మరో పదినెలల్లో శాసనసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు నిర్వహించిన నవసంకల్ప శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఉదయపూర్‌లో ఇటీవల జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించిన చింతన్‌ శిబిర్‌ సదస్సు తీర్మానాలను తొలుత కర్ణాటక నుంచే శ్రీకారం చుట్టాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో టికెట్లు రాకపోతే అందుకు సిద్దరామయ్య, శివకుమార్‌ కారణం కాదన్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ వర్తిస్తుందని, 50 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యత ఇస్తామని, ఒకరికి ఒకే ప దవి ఉంటుందనే నిబంధనలు అమలు చేస్తామన్నారు. కేపీసీసీలో ఖాళీగా ఉన్న అన్ని కేడర్ల పోస్టులను 15 రోజుల్లోగా భర్తీచేయాలని ఆదేశించారు. తర్వాత జిల్లా, బ్లాక్‌ స్థాయిలోనూ భర్తీ చేయాలన్నారు. బూత్‌స్థాయి, బ్లాక్‌ స్థాయి మధ్య గ్రామసమితి, మండల సమితులు ఉండాలని సూచించారు. యూత్‌కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ చే 20 రోజుల్లోగా వార్‌ రూంలు తెరవాలని దిశానిర్దేశం చేశారు. జాతీయ కాంగ్రెస్‌ ఫార్ములా ప్రకారం 50 శాతం పధాధికారులు 50 ఏళ్లలోపు వారు ఉండాలన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ, మహిళలకు కమిటీల్లో ప్రాధాన్యతా పరంగా నియమించాలన్నారు. కింది నుంచి పైస్థాయి దాకా ఐదేళ్లు కొనసాగి ఉంటే వెంటనే ఇతరులకు పదవులు అప్పగించాలన్నారు. అమృతమహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 9 నుంచి 15వరకూ జిల్లా కేంద్రాల్లో పాదయాత్రలు చేయాలని సూచించారు. 150 స్థానాలు గెలవాలని, సంఖ్యాబలం ఉంటే పరిషత్‌, రాజ్యసభలోనూ మరింత మందికి అవకాశాలు లభిస్తాయన్నారు. పార్టీ జాతీయ కమిటీ తీర్మానాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయన్నారు. ఉదయం నుంచి రాత్రిదాకా సాగిన సదస్సులో రాష్ట్రానికి చెందిన ముఖ్యనాయకులంతా ప్రసంగించారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ అంటే దాదాపు 25 మందికి పైగా సీనియర్‌ నేతల వారసులకు టికెట్‌లు దక్కవనే అంశం హాట్‌టాపిక్‌ అ యినట్లు సమాచారం. కాగా పార్టీ సీనియర్‌లు ఎస్‌ఆర్‌ పాటిల్‌, ముద్దహనుమేగౌడ, జమీర్‌అహ్మద్‌ సహా పలువురు గైర్హాజరయ్యారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జునఖర్గే అత్యవసరంగా ఢిల్లీకు వెళ్లడంతో పాల్గొనలేక పోయారు.





Updated Date - 2022-06-03T16:56:12+05:30 IST