వందశాతం రక్త పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-10-08T05:47:44+05:30 IST

జిల్లాలోని గర్భిణీ స్ర్తీలను గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేయడంతో పాటు వందశాతం హెచ్‌బీ (హిమోగ్లోబిన్‌) పరీక్షలను నిర్వహించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు.

వందశాతం రక్త పరీక్షలు నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- గర్భిణీల వివరాలను నమోదు చేయాలి

- సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌


కరీంనగర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని గర్భిణీ స్ర్తీలను గుర్తించి వారి వివరాలను ఆన్‌లైన్‌ నమోదు చేయడంతో పాటు వందశాతం హెచ్‌బీ (హిమోగ్లోబిన్‌) పరీక్షలను నిర్వహించాలని  కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లతో గర్భిణీల నమోదు, సీజనల్‌ వ్యాధుల నివారణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణీల నమోదు తక్కువగా ఉన్న మానకొండూర్‌, చెల్పూర్‌, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు వందశాతం వివరాలను నమోదు చేయాలని తెలిపారు. తీవ్ర పోషణలోపం ఉన్న పిల్లలను గుర్తించి పోషణ అందించాలని, వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని, ఏ షీల్డ్‌ యాప్‌లో వారి వివరాలను నమోదు చేయాలని తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను గుర్తించి వారికి ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలు ఇవ్వాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వావిలాలలో హెచ్‌బీ పరీక్షలు బాగా నిర్వహిస్తున్నందున పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ తులసీదాస్‌, సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. అన్ని మండలాల్లో గర్భిణీ స్ర్తీల వివరాలు రిజిస్ర్టేషన్‌ చేయాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను నిర్వహిం చాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో తప్పకుండా డ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి జువేరియా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రత్నమాల, ఇతర ప్రోగ్రాం అధికారులు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T05:47:44+05:30 IST