కరోనా బాధితులకు నూరుశాతం వైద్యసేవలందించాలి

ABN , First Publish Date - 2020-08-07T05:42:34+05:30 IST

రోజురోజుకు కరోనా ప్రభావం అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా రోగులకు నూరుశాతం వైద్య

కరోనా బాధితులకు నూరుశాతం వైద్యసేవలందించాలి

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌


కరీంనగర్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రోజురోజుకు కరోనా ప్రభావం అధికంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా రోగులకు నూరుశాతం వైద్య సేవలందించడానికి వైద్య సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య సిబ్బంది కొరత ఉన్న జిల్లా, ఏరియా, మెడికల్‌ కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవాలని, దీనికి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కోవిడ్‌ బాధితుల కొరకు ప్రైవేట్‌ ఆసుపత్రుల సేవను కూడా వినియోగించుకోవాలని సూచించారు.


ప్రతి జిల్లా కేంద్రంలో 50 నుంచి 100 మందికి సేవలందించడానికి వీలుగా ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి మందులతో కూడిన మెడికల్‌ కిట్‌లను అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ బాధితులకు మెడికల్‌ కిట్‌లను అందించడంతోపాటు వారికి తగిన సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. ప్రతి కరోనా పాజిటివ్‌ వ్యక్తికి 24/7 వైద్య సేవలందించాలని అన్నారు.  వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ కె శశాంక, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ నవీన్‌, ఎల్‌డీఎం లక్ష్మణ్‌, హెడ్‌క్వార్టర్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-07T05:42:34+05:30 IST