అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి !

ABN , First Publish Date - 2021-04-09T14:53:11+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్​ రాష్ట్రం బ్రియాన్​లో గురువారం కాల్పులు చోటు చేసుకున్నాయి.

అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. ఒకరి మృతి !

టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్​ రాష్ట్రం బ్రియాన్​లో గురువారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ వ్యాపార సంస్థలో ఉద్యోగి జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతిచెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడు జోబైడెన్‌ తుపాకుల హింసను "అంటువ్యాధి" అని, ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రణాళికను ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని బ్రియాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, దుండగుడు కాల్పులు ఎందుకు జరిపాడనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు పోలీస్ చీఫ్ ఎరిక్ బస్కే వెల్లడించారు. కెంట్ మూరే కేబినేట్స్‌లో ఈ ఘటన జరిందని, నిందితుడు ఈ సంస్థలోనే పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అగ్రరాజ్యంలో తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా బైడెన్‌ చర్యలు చేపట్టారు. మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ(ఏటీఎఫ్‌) డైరెక్టర్‌గా డేవిడ్‌ చిప్‌మాన్‌ను నియమించిన సంగతి తెలిసిందే.    

Updated Date - 2021-04-09T14:53:11+05:30 IST