ఆ కాళరాత్రి..!

ABN , First Publish Date - 2022-05-21T09:23:05+05:30 IST

యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య చేసి నిప్పు..! దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాల.

ఆ కాళరాత్రి..!

  • ఇప్పటికీ కళ్ల ముందే దిశ ఘటన.. 
  • ఒళ్లు గగుర్పొడిచేలా.. హత్యాచారం
  • తెల్లవారుజామున నిందితుల ఎన్‌కౌంటర్‌
  • హైదరాబాద్‌ శివారులో సంచలనాలు


హైదరాబాద్‌ సిటీ, షాద్‌నగర్‌, మే 20(ఆంధ్రజ్యోతి): యువతిపై సామూహిక అత్యాచారం.. హత్య చేసి నిప్పు..! దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాల.. వేగంగా నిందితుల పట్టివేత.. వారం లోపే ఎన్‌కౌంటర్‌..! హత్యాచారం రాత్రివేళ జరగ్గా.. తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా తెల్లవారుతుండగానే జరిగింది. ‘‘దిశ’’ కేసులో తీవ్ర సంచలనం రేపిన ఈ వరుస ఘటనల క్రమం.. శంషాబాద్‌లో ఉండే వెటర్నరీ డాక్టర్‌ దిశ 2019 నవంబరు 27న సాయంత్రం తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద వాహనాన్ని నిలిపి క్యాబ్‌లో హైదరాబాద్‌ వెళ్లింది. రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చింది. అయితే, దిశ వెళ్లేటప్పుడు అక్కడున్న లారీ డ్రైవర్‌ మహ్మద్‌ పాషా అలియాస్‌ ఆరిఫ్‌, చెన్నకేశవులు, శివ, నవీన్‌ గమనించారు. దురుద్దేశంతో ఆమె వాహనం వెనుక టైర్‌ గాలి తీశారు. రాత్రివేళ పంక్చర్‌ చేయించే పరిస్థితి లేక.. నిస్సహాయంగా చూస్తున్న దిశకు సాయం చేస్తున్నట్లు నటించారు.


 పాపా.. భయమేస్తోందే: చెల్లితో ఫోన్‌లో దిశ

పంక్చర్‌ వేయిస్తానని టైర్‌ తీసుకెళ్లిన వ్యక్తి త్వరగా రాకపోవడం.. మిగతా నిందితులు, పరిసరాలను చూస్తూ ఆందోళనకు గురైన దిశ తన చెల్లెలుకు ఫోన్‌ చేసింది. ‘‘పాపా భయమేస్తోందే. వీళ్లంతా అదోలా ఉన్నారు. ఫోన్‌ మాట్లాడుతూనే ఉండు. ధైర్యంగా ఉంటుంది’’ అని కోరిం ది. బండి వదిలేసి వచ్చేయమని చెల్లి సూచించింది కూడా. కానీ, దిశ ఆ నిర్ణయం తీసుకోలేకపోయింది. మరోవైపు పీకల దాకా మద్యం తాగి ఆరిఫ్‌, మిగతా ముగ్గురు.. పథకం ప్రకారం దిశపై దాడిచేశారు. కొంత దూరం లాక్కెళ్లి  అత్యాచారానికి పాల్పడ్డారు. నోరు, ముక్కు గట్టిగా మూయడంతో దిశ ఊపిరాడక చనిపోయింది. మృతదేహాన్ని క్యాబిన్‌లో వేసుకొని.. 35 కిలోమీటర్లు దూరం ప్రయాణించి షాద్‌నగర్‌ పరిధి చటాన్‌పల్లి అండర్‌పాస్‌ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లారు. దిశపై పెట్రోల్‌ పోసి దహనం చేసి పారిపోయారు. నవంబరు 29న పాలుపోసే వ్యక్తి ఒకరు.. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, నవంబరు 27 రాత్రి దిశ తండ్రి, సోదరి శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితులను గుర్తించారు.


రోజంతా పోలీస్‌ స్టేషన్‌ దిగ్బంధం

ఈ దారుణ ఘటన అందరినీ కలచివేసింది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ అన్నివర్గాల నుంచి డిమాండ్లు పెరిగాయి. ఈ క్రమంలోనే నవంబరు 29న నిందితులను కస్టడీ కోసం షాద్‌నగర్‌ ఠాణాకు తీసుకురాగా వేలాది జనం ఆందోళన చేపట్టారు. నిందితులను మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించకుండా సాయంత్రం దాకా అడ్డుకున్నారు. ఇక  అదే ఏడాది డిసెంబరు 6వ తేదీన తెల్లవారుజామున నలుగురు నిందితులను.. దిశను దహనం చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఎన్‌కౌంటర్‌ చేయడం మరింత సంచలనం సృష్టించింది. నిందితులు తమ తుపాకీని లాక్కొని పారిపోతున్న క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ క్రమంలో మానవహక్కుల సంఘం కూడా సంఘటనాస్థలాన్ని సందర్శించి నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు సిర్పుర్కర్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయడం, వివిధ రూపాల్లో విచారణ అనంతరం.. బూటకపు ఎన్‌కౌంటర్‌గా నివేదిక ఇవ్వడం తాజా పరిణామం. నాటి ఘటన ఒక్కసారిగా తెరమీదకు రావడంతో శుక్రవారం షాద్‌నగర్‌ పరిధిలో ఎక్కడచూసినా దీనిపైనే చర్చించుకోవడం కనిపించింది.


పోస్టుమార్టం.. రీ పోస్టుమార్టం..

నిందితుల మృతదేహాలను 2019 డిసెంబరు 11వరకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు. గాంధీ వైద్యులు అక్కడికే వెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు. ఇక ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఆ ఏడాది డిసెంబరు 7న రాచకొండ ఎస్‌వోటీ డీసీపీగా ఉన్న సురేందర్‌రెడ్డిని విచారణాధికారిగా నియమించారు. అదే రోజు.. ప్రభుత్వం రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ను ఏర్పాటు చేసింది. మరోవైపు డిసెంబరు 11న సుప్రీం కోర్టు ధర్మాసనం త్రిసభ్య కమిటీని నియమించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పోలీసుల తీరుపై హైకోర్టు, సుప్రీం కోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దాంతో మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచాలని హైకోర్టు ఆవేశించింది. డిసెంబరు 11న నలుగురు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యుల బృందం రీ పోస్టుమార్టం చేసింది.  

Updated Date - 2022-05-21T09:23:05+05:30 IST