కాంగ్రెస్‌లో మళ్లీ ఒక కుటుంబం - ఒకే టికెట్‌’

ABN , First Publish Date - 2022-05-11T08:17:32+05:30 IST

పార్టీని పునరుత్థానం వైపు నడిపించడంలో భాగంగా... ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ ఇవ్వాలనే నిబంధనను అమలుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.

కాంగ్రెస్‌లో మళ్లీ  ఒక కుటుంబం - ఒకే టికెట్‌’

గాంధీ కుటుంబానికి మాత్రం ఆ నిబంధన నుంచి మినహాయింపు!

న్యూఢిల్లీ, మే 10: పార్టీని పునరుత్థానం వైపు నడిపించడంలో భాగంగా... ఒక కుటుంబానికి ఒకే టికెట్‌ ఇవ్వాలనే నిబంధనను అమలుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ నెల 13-15 తేదీల మధ్య రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనున్న మేధో మథన సదస్సులో ఇదే అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో కూడా ‘ఒక కుటుంబం - ఒకే టికెట్‌’ నిబంధనపై చర్చించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం మరోసారి జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిబంధనను పార్టీ ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధన గాంధీ కుటుంబానికి వర్తించబోదని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రె్‌సను కుటుంబ పార్టీగా ఎప్పటినుంచో విమర్శిస్తోన్న బీజేపీకి ఈ మినహాయింపు మరో అస్త్రం కావొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా పార్లమెంటరీ బోర్డు ను పునరుద్ధరించే ఆలోచన ఉందని ఓ కాంగ్రెస్‌ నేత చెప్పారు. చర్చల అనంతరం ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ పేరుతో నిర్ణయాలను ప్రకటిస్తారని తెలిపారు. 

Read more