టాలీవుడ్ బాట పడుతోన్న మరో కోలీవుడ్ దర్శకుడు

Jun 6 2021 @ 18:37PM

కోలీవుడ్‌లోని అగ్రదర్శకుల్లో ఏ.ఆర్‌.మురుగదాస్‌ ఒకరు. ‘గజనీ’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ హోదాను దక్కించుకున్నారు. అదేవిధంగా తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘స్టాలిన్‌’ చిత్రానికి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఆయన తన ఫోకస్‌ను కోలీవుడ్‌పైనే కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన ఫోకస్ మళ్ళీ టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమపై మళ్ళింది. ఇప్పటికే అగ్ర దర్శకుడు ఎస్‌.శంకర్‌, ఎన్‌.లింగుస్వామి వంటి వారు టాలీవుడ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించే పనుల్లో బిజీగా గడుపుతున్నారు. వీరిద్దరూ టాలీవుడ్‌ బాటపట్టడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలోని పలువురు అగ్రహీరోలు వీరికి కాల్షీట్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో మనస్తాపం చెందిన శంకర్‌, లింగుస్వామిలు టాలీవుడ్‌ బాటపట్టినట్టిగా కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.


ఈ కోవలోకి ఇపుడు మురుగదాస్‌ కూడా చేరిపోయారు. ఇళయదళపతి విజయ్‌ 65వ చిత్ర దర్శకత్వ బాధ్యతలను చేపట్టాల్సిన మురుగదాస్‌... కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దీంతో ఇది టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లికి వరించే అవకాశాలు ఉన్నట్టు టాక్‌ వినిపిస్తోంది. అదేసమయంలో మురుగదాస్‌ కూడా పలువురు తెలుగు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాంటివారిలో రామ్‌ పోతినేని ఒకరు. పైగా మురుగదాస్‌ తెలుగులో రెండు స్ట్రయిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో ఒకటి ‘స్టాలిన్‌’ కాగా, రెండో మహేష్‌ బాబు నటించిన ‘స్పైడర్‌’. ఈ రెండు చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ టాలీవుడ్‌ హీరోతో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏ.ఆర్‌.మురుగదాస్‌ తన వంతు ప్రయత్నాలు చేయగా, అవి ఫలవంతమైనట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన వెంటనే తమతమ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని శంకర్‌, లింగుస్వామి, మురుగదాస్‌లు భావిస్తున్నారు. కాగా, మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్‌’ చిత్రం సూపర్‌ హిట్‌ కాగా, ఆ తర్వాత వచ్చిన ‘దర్బార్‌’ ఫరావాలేదనిపించుకుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.